Share News

COVID-19: దేశంలో జేఎన్.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

ABN , Publish Date - Dec 20 , 2023 | 05:25 PM

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులపై కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ ఉపరకానికి చెందిన 21 కేసులు ఇంతవరకూ నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో చెరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారంనాడు సమీక్షించారు.

 COVID-19: దేశంలో జేఎన్.1 సబ్‌వేరియంట్.. 21 కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా (Covid-19) వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులపై కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ ఉపరకానికి చెందిన 21 కేసులు ఇంతవరకూ నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో చెరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) బుధవారంనాడు సమీక్షించారు. కోరోనా వైరస్ కొత్త వేరియంట్‌ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


కోవిడ్ మేనేజిమెంట్ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సన్నద్ధతతో మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్నారు. కోవిడ్ ఇంకా పూర్తిగా తొలిగినట్టు కాదని రాష్ట్రాలకు ఆయన గుర్తుచేశారు. కోవిడ్ కేసులు, లక్షణాలు, కేసుల తీవ్రతపై రాష్ట్రాలు నిఘా ఉంచుతూ, తగిన పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలన్నారు.


కాగా, పలు దేశాల్లోనూ, దేశీయంగానూ వెలుగు చూస్తున్న కేసులను ఆరోగ్య శాఖ కార్యదర్శి సుదర్శన్ పంత్ పోల్చిచెబుతూ, మన దేశంలో గణనీయంగా కేసులు తక్కువగానే ఉన్నాయన్నారు. అయితే గత రెండు వారాలుగా చూసినప్పుడు డిసెంబర్ 6న 115 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 614కు చేరిందని చెప్పారు. వీరిలో 92.8 శాతం కేసులు హోం ఐసొలేషన్‌లోనే ఉన్నట్టు చెప్పారు. అది కూడా చాలా స్వల్ప అస్వస్థతేనని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య పెరగలేదన్నారు. రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటకలో పెరుగుతున్నట్టు గమినించామని పంత్ తెలిపారు.

Updated Date - Dec 20 , 2023 | 05:28 PM