YouTube Star Killed: 22 ఏళ్ల యూట్యూబ్‌ స్టార్‌ను చంపేసిన తండ్రి.. ఇరాక్‌లో ఆందోళనలు

ABN , First Publish Date - 2023-02-05T21:34:26+05:30 IST

పరువు హత్యకు బలైన 22 ఏళ్ల యూట్యూబ్ స్టార్‌కు న్యాయం జరగాల్సిందేనంటూ

YouTube Star Killed: 22 ఏళ్ల యూట్యూబ్‌ స్టార్‌ను చంపేసిన తండ్రి.. ఇరాక్‌లో ఆందోళనలు

బాగ్దాద్: పరువు హత్యకు బలైన 22 ఏళ్ల యూట్యూబ్ స్టార్‌కు న్యాయం జరగాల్సిందేనంటూ ఇరాక్‌లో ఆందోళనలు మిన్నంటాయి. దక్షిణ ప్రావిన్సులోని దివానియా(Diwaniya)కు చెందిన టిబా అల్-అలీ (Tiba al-Ali) యూట్యూబ్ స్టార్. టర్కీలో ఉంటున్న ఆమె అక్కడి తన జీవితం గురించి వీడియోలు తీస్తూ యూట్యూబ్‌లో తరచూ పోస్టు చేసేది. ఆ వీడియోల్లో ఆమె ప్రియుడు కూడా కనిపించేవాడు.

తండ్రీకుమార్తె మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. టిబా తన కుటుంబంతో కలిసి 2017లో టర్కీ వెళ్లింది. అయితే, తిరిగి వారితో కలిసి ఇరాక్ వచ్చేందుకు నిరాకరించింది. అప్పటి నుంచి ఆమె అక్కడే ఒంటరిగా ఉంటోంది. ఇరాక్ వచ్చేయాలని ఎన్నిసార్లు కోరినా ఆమె నిరాకరించడంతో తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో జనవరి 31న కుమార్తెను దారుణంగా హత్య చేశాడు.

విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇరాక్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. టిబాకు న్యాయం జరగాల్సిందేనంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చిన ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఇరాక్ అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సాద్ మన్ వరుస ట్వీట్లు చేశారు. తండ్రీకుమార్తెల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నించారని పేర్కొన్నారు. అయితే, ఇంతకుమించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. ఆ తర్వాత టిబా మరణవార్త తెలిసి తాము ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. కుమార్తెను తానే హత్య చేసినట్టు ఆమె తండ్రి అంగీకరించాడని పేర్కొన్నారు.

టిబా మృతి సోషల్ మీడియాకెక్కడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆమెకు న్యాయం కోరుతూ రాజధాని బాగ్దాద్‌లో ఆందోళనలు నిర్వహించాలని నెటిజన్లు పిలుపునిచ్చారు. టిబా పరువు హత్యపై మానవహక్కుల కార్యకర్త అలా తలాబాని స్పందించారు. ప్రభుత్వం నుంచి సరైన చర్యలు లేకపోవడం వల్ల మహిళలు వెనకబడిన ఆచారాలకు ఇంకా బందీలుగానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలను రక్షించేందుకు ఇరాక్ అధికారులు బలమైన చట్టాన్ని ఆమోదించే వరకు ఇలాంటి హత్యలను చూస్తూనే ఉంటామని మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా మానవ హక్కుల సంఘం డిప్యూటీ డైరెక్టర్ అయా మజౌబ్(Aya Majzoub) పేర్కొన్నారు.

Updated Date - 2023-02-05T21:34:28+05:30 IST