India-Canada Row: కెనడా ప్రధాని ట్రూడోకి రిషి సునాక్ ఫోన్ కాల్.. భారత్‌తో వివాదంపై కీలక చర్చ.. ఏం మాట్లాడరంటే?

ABN , First Publish Date - 2023-10-07T17:54:09+05:30 IST

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు...

India-Canada Row: కెనడా ప్రధాని ట్రూడోకి రిషి సునాక్ ఫోన్ కాల్.. భారత్‌తో వివాదంపై కీలక చర్చ.. ఏం మాట్లాడరంటే?

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడం, భారత దౌత్యాధికారిని బహిష్కరించడంతో.. వివాదం రాజుకుంది. రోజులు గడిచేకొద్దీ ఇది ముదురుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఇరు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న ఇతర దేశాలు ఈ సమస్యని పరిష్కరించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఈ అంశంలో జోక్యం చేసుకొని.. కెనడా చేపట్టిన దర్యాప్తుకు భారత్ సహకరించాలని కోరింది.


ఇప్పుడు లేటెస్ట్‌గా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రంగంలోకి దిగారు. కెనడా ప్రధాని ట్రూడోకి ఫోన్ చేసి, ఈ దౌత్య వివాదంపై ఆయన మాట్లాడారు. ఈ వివాదం వీలైనంత త్వరగా తగ్గుముఖం పడుతుందని తాను భావిస్తున్నానని ట్రూడోతో రిషి అన్నారు. శుక్రవారం సాయంత్రం వీరి మధ్య ఈ ఫోన్ సంభాషణ జరిగిందని సమాచారం. చట్టాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ గౌరవిస్తుందని రిషి పునరుద్ఘాటించడంతో.. వాళ్లిద్దరు రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలో.. భారత్‌లోని కెనడియన్ దౌత్యవేత్తలకు సంబంధించిన పరిస్థితి గురించి రిషిని ట్రూడోకి వివరించారు. ‘‘దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ సూత్రాలతో సహా అన్ని దేశాలు సార్వభౌమాధికారం, చట్ట నియమాలను గౌరవించాలనే యునైటెడ్ కింగ్‌డమ్ వైఖరిని ప్రధాన మంత్రి సునక్ పునరుద్ఘాటించారు. భారత్, కెనడా మధ్య నెలకొన్న వివాదం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు’’ అని డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇదిలావుండగా.. జూన్ 18వ తేదీన కెనడాలోని సర్రేలో ఉన్న గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఇద్దరు దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో.. హర్దీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని కెనడా ప్రధాని ట్రూడో జీ20 సమావేశాలు జరిగిన వారం రోజుల తర్వాత సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో భారత్ దౌత్యాధికారిని సైతం కెనడా బహిష్కరించింది. ఈ ఆరోపణలతో మండిపడ్డ భారత్.. వాటిని తిరస్కరించడంతో పాటు కెనడా దౌత్యాధికారిని దేశం నుంచి వెళ్లగొట్టి గట్టి కౌంటర్ ఇచ్చింది.

Updated Date - 2023-10-07T17:54:09+05:30 IST