TV Reporter: లైవ్‌లోనే కీచకపర్వం.. రిపోర్టర్‌ని అసభ్యంగా తాకిన కామాంధుడు.. చివరికి ఏమైందంటే?
ABN , First Publish Date - 2023-09-14T19:27:31+05:30 IST
నిన్నటిదాకా కామాంధులు ఒంటరిగా ఉన్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లోనే వీళ్లు చెలరేగిపోతున్నారు. తమని ఏం చేసుకుంటారులే అనే ధీమాతో.. మహిళల పట్ల అసభ్యంగా...
నిన్నటిదాకా కామాంధులు ఒంటరిగా ఉన్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లోనే వీళ్లు చెలరేగిపోతున్నారు. తమని ఏం చేసుకుంటారులే అనే ధీమాతో.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. చుట్టూ నలుగురు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోకుండా బరితెగించేస్తున్నారు. ఇప్పుడు ఓ దుర్మార్గుడు కూడా అలాంటి కీచకపర్వానికే పాల్పడ్డాడు. లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కెమెరాలో రికార్డ్ అవుతోందని తెలిసినప్పటికీ.. అతడు వెనకడుగు వేయకుండా ఆమెను అసభ్యంగా తాకుతూ అనుచితంగా ప్రవర్తించాడు. చివరికి తాను చేసిన పాపానికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్‌లో మాడ్రిడ్‌లో ఇటీవల ఒక దుకాణంలో చోరీ జరిగింది. ఈ ఘటనపై రిపోర్టింగ్ చేసేందుకు.. స్థానిక క్యూట్రో ఛానల్‌కు చెందిన ఒక మహిళా జర్నలిస్ట్ తన కెమెరామెన్‌తో కలిసి అక్కడికి వెళ్లింది. ఘటనా స్థలంలో నిల్చొని ఆమె రిపోర్టింగ్ చేస్తుండగా.. ఒక వ్యక్తి వెనుక నుంచి ఆమెని అసభ్యంగా తాకాడు. ఆపై నువ్వు ఏ ఛానల్‌కి పని చేస్తావని ఆమెని అడిగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న రిపోర్ట్.. ఆ వెంటనే తేరుకొని, మళ్లీ రిపోర్టింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే.. అవతల స్టూడియోలో ఒక హోస్ట్ ఆమెని అడ్డగించి, ‘నీకు అంతరాయం కలిగించినందుకు క్షమించి, ఆ వ్యక్తి నిన్ను అసభ్యంగా తాకాడా?’’ అని ప్రశ్నించాడు. ఆమె అవునని చెప్పగా.. ఆ వ్యక్తిని చూపించమని హోస్ట్ కోరాడు.
ఈ కీచకుడివైపు కెమెరాని తిప్పగా.. ‘‘వీడొక ఇడియట్’’ అని తిట్టాడు. అటు.. రిపోర్టర్ సైతం అతనికి క్లాస్ తీసుకుంది. ‘‘నేను లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో, నువ్విలా అసభ్యంగా తాకడం సరైనదేనా? అసలు నీకు బుద్ధుందా’’ అని ఆ కీచకుడ్ని అడిగింది. అందుకు తానేమీ తప్పు చేయలేదని బుకాయించాడు. అంతేకాదు.. అక్కడి నుంచి వెళ్తూ, ఆమె చుట్టూని నిమిరాడు. కొన్ని సెకన్ల తర్వాత మళ్లీ తిరిగొచ్చి.. ఆమె లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగానే ‘‘నిజాలే చెప్పు’’ అంటూ మళ్లీ అంతరాయం కలిగించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తీవ్ర దుమారం రేగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. రెండు రోజుల తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేశారు.