South Korea: అణ్వాయుధాలు ప్రయోగిస్తే కిమ్ పాలనని అంతం చేస్తాం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సౌత్ కొరియా

ABN , First Publish Date - 2023-09-26T21:12:32+05:30 IST

సౌత్ కొరియా, నార్త్ కొరియా.. ఈ రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. నార్త్ కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ఉవ్విళ్లూరుడుతున్నాడు..

South Korea: అణ్వాయుధాలు ప్రయోగిస్తే కిమ్ పాలనని అంతం చేస్తాం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సౌత్ కొరియా

సౌత్ కొరియా, నార్త్ కొరియా.. ఈ రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా.. నార్త్ కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాపై ఆధిపత్యం చెలాయించేందుకు ఉవ్విళ్లూరుడుతున్నాడు. తనకు ఛాన్స్ వస్తుందా? ఆ దేశంపై అణ్వాయుధాలు ఎప్పుడెప్పుడు వేద్దామా? అని కళ్లుకాయలు కాచేలా వేచి చూస్తున్నాడు. ఈమధ్య అతడు క్షిపణి, మిసైల్ ప్రయోగాలను కూడా వేగవంతం చేశాడు. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియా అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే.. అతని పాలనని తాము నామరూపాల్లేకుండా అంతం చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ హెచ్చరించాడు.

75వ ‘సాయుధ బలగాల దినోత్సవం’ పురష్కరించుకొని.. సియోల్ వీధుల్లో సైనిక కవాతు నిర్వహించారు. ఇందులో భాగంగా.. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగానే ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర కొరియా ఆగడాలను కట్టడి చేసేందుకు పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మిస్తామని అన్నారు. అణ్వాయుధాలపై కిమ్ జోంగ్ ఉన్ పాలనకు ఉన్న మోజు.. అక్కడి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. కేవలం అణ్వాయుధాలు ఉన్న మాత్రాన తాము భద్రంగా ఉన్నామని నార్త్ కొరియా భావిస్తే పప్పులే కాలేసినట్టేనని అన్నారు. న్యూక్లియర్ ఆయుధాలు భద్రతాకు గ్యారెంటీ ఇవ్వలేవన్న విషయాన్ని వాళ్లు గ్రహించాలని సూచించారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. వెంటనే ప్రతీకారం తీర్చుకుంటామని ఉద్ఘాటించారు.


ఇదిలావుండగా.. యూన్‌ సుక్‌ యోల్ గతేడాదిలోనే దక్షిణ కొరియా అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియాను ఎదుర్కునేందుకు అమెరికాతో చేతులు కలిపి.. సైనిక కసరత్తులను విస్తరిస్తున్నారు. మరోవైపు.. ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించడం అమెరికాతో పాటు దాని మిత్రదేశాల్ని ఆందోళనకు గురి చేస్తోంది. రష్యా, ఉత్తర కొరియా మధ్య ఆయుధాల సరఫరా ఒప్పందం జరుగుతుందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అటు.. అమెరికాతో కలిసి సైనిక కసరత్తులు చేస్తున్నందుకు యూన్‌ సుక్‌ యోల్‌ను ‘తోలుబొమ్మ దేశద్రోహి’గా కిమ్ జోంగ్ ఉన్ అభివర్ణించారు.

నిజానికి.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న విభేదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ప్రయత్నించారు. కొరియన్ బార్డర్‌లో కిమ్ జోంగ్ ఉన్‌ని కలిశారు. ఇద్దరు ఆలింగనం చేసుకొని, కొద్దిసేపు చర్చలు కూడా జరిపారు. దాంతో.. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్టేనని అంతా అనుకున్నారు. కానీ.. కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. ఎప్పట్లాగే అతను అనేక కవాతుల్ని, క్షిపణి ప్రయోగాల్ని ప్రదర్శించాడు. దీంతో.. ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే వస్తోంది.

Updated Date - 2023-09-26T21:12:32+05:30 IST