Share News

Israel-Hamas War: గాజా శరణార్థులకు స్వాగతం పలికేందుకు స్కాట్లాండ్ సిద్ధంగా ఉంది.. ఫస్ట్ మినిస్టర్ హమ్జా యూసఫ్ వెల్లడి

ABN , First Publish Date - 2023-10-18T20:31:52+05:30 IST

హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా.. గాజాలోని ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ఎన్నో విషయాలపై ఆంక్షలు (ఆహారం, ఇంధనం, విద్యుత్ సరఫరాలపై నిషేధం) విధించడం, గాజా స్ట్రిప్‌లో...

Israel-Hamas War: గాజా శరణార్థులకు స్వాగతం పలికేందుకు స్కాట్లాండ్ సిద్ధంగా ఉంది.. ఫస్ట్ మినిస్టర్ హమ్జా యూసఫ్ వెల్లడి

హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా.. గాజాలోని ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ఎన్నో విషయాలపై ఆంక్షలు (ఆహారం, ఇంధనం, విద్యుత్ సరఫరాలపై నిషేధం) విధించడం, గాజా స్ట్రిప్‌లో బాంబుల వర్షం కురిపిస్తుండటంతో.. గాజా పౌరులందరూ తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే రఫా క్రాసింగ్ బార్డర్ వద్ద భారీ స్థాయిలో గాజా ప్రజలు గుమిగూడారు. అయితే.. వీరికి సహాయం అందించేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అటు.. ఇజ్రాయెల్ సైతం మానవతా సహాయం అందించబోమని ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది. దీంతో.. తమని ఆదుకునే నాథుడే లేడా? అంటూ అక్కడి ప్రజలు వేడుకుతున్నారు.

ఇలాంటి తరునంలో.. స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ హమ్జా యూసఫ్ ఓ ఆసక్తికరమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతున్న గాజా ప్రజలకు ఆశ్రయం ఇవ్వడానికి తమ స్కాట్లాండ్ సిద్ధంగా ఉందని శుభవార్త తెలిపారు. యూసఫ్‌ అత్తమామలు గాజాలోనే చిక్కుకుపోవడంతో పాటు ఆయన బంధువుల్లోని ఓ రెండేళ్ల చిన్నారి గాయపడిన నేపథ్యంలో.. యూసఫ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇలాంటి సంక్షోభాలు నెలకొన్న సమయంలో మేము సిరియా, ఉక్రెయిన్‌‌లతో పాటు ఇతర దేశాల నుంచి చాలా మందిని స్కాట్లాండ్‌కు ఆహ్వానించాం. ఇప్పుడు మళ్లీ మనం ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర దాడుల్లో చిక్కుకున్న వారికి భద్రత, ఆశ్రయం కల్పించేందుకు యూకేలోని మొదటి ప్రాంతంగా స్కాట్లాండ్‌ సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. గాజాలో నిరాశ్రయులైన పది లక్షల మందిని ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్త శరణార్థుల కార్యక్రమానికి అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.


ప్రస్తుత పరిస్థితులో రెండు అత్యవసర చర్యలు తీసుకోవాలని యూకే ప్రభుత్వాన్ని యూసఫ్ కోరారు. మొదటిది.. గాజాలో ఉన్నవారి కోసం శరణార్థుల పునరావాస పథకాన్ని రూపొందించాలి. రెండోది.. గాజాలో గాయపడిన పౌరులను వైద్య చికిత్స నిమిత్తం తరలించే కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. శరణార్థుల్ని ఆదుకోవడం కోసం స్కాట్లాండ్ తనవంతు పాత్ర పోషించేందుకు రెడీ ఉందని మరోసారి స్పష్టం చేశారు. క్షతగాత్రులైన గాజా పురుషులు, స్త్రీలు, చిన్నారులకు తమ ఆస్పత్రుల్లో చికిత్స అందజేస్తామని హామీ ఇచ్చారు. గాజాలో తన బావ వైద్యుడిగా విధులు నిర్వరిస్తున్నారని.. గాజాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన తనకు ఫోన్‌లో వివరించారని చెప్పారు. సరిపడా మందులు, వైద్యులు, నర్సులు లేకుండానే గాజా ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోందని.. ఎవరికి చికిత్స అందించాలో, ఎవరిని వదిలేయాలో అక్కడ తేల్చుకోలేకపోతున్నారన్నారు. ఈ ఆధునిక యుగంలో అలాంటి పరిస్థితులను రావడం దుర్భరమన్నారు.

గాజాలో చిక్కుకున్న ప్రజలు సురక్షితంగా అక్కడి నుంచి వస్తారన్న గ్యారెంటీ ఏమాత్రం లేదని యూసఫ్ కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ విధించిన ఆంక్షలతో పాటు ఈ యుద్ధం కారణంగా.. గాజా ప్రజలు ఆహారం, నీటి కొరతతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాజా నుంచి వాళ్లు వీలైనంత త్వరగా బయలుదేరకపోతే.. వాళ్లంతా చనిపోవచ్చని హెచ్చరించారు. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా యూసఫ్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-10-18T20:31:52+05:30 IST