Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్ సౌధంలో మారణాయుధాలు..

ABN , First Publish Date - 2023-03-19T18:44:13+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సౌధంలో పలు మారణాయుధాలను..

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్ సౌధంలో మారణాయుధాలు..

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సౌధం(Mansion)లో పలు మారణాయుధాలను పోలీసులు స్వాధీం చేసుకున్నారు. ఏకే-47 రైపిళ్లు, పెట్రోల్ బాంబులు ఇందులో ఉన్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. 16 ఏకే-47 రైఫిళ్లు, పేలుడు పదార్ధాలను శనివారంనాడు స్వాధీనం చేసుకున్నట్టు పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) డాక్టర్ ఉస్మాన్ అన్వర్ తెలిపారు. పట్టుబడిన మారణాయుధాలను మీడియా ముందు ఆయన ప్రదర్శించారు. జమాన్ పార్క్ నుంచి పెట్రోల్ బాంబులు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కాగా, ఖాన్ నివాసంలో పట్టుబడిన ఆయుధాలకు చట్టబద్ధత (లైసెన్స్) ఉందా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని, ఖాన్ నివాసానికి చేరకుండా ఏర్పాటు చేసిన షిప్పింగ్ కంటైనర్లను తొలగిస్తున్నామని ఐజీ ఉస్మాన్ అన్వర్ తెలిపారు.

ఇమ్రాన్ ఉద్దేశం ఏమిటి?

ఇమ్రాన్ నివాసంలో పెద్దఎత్తున మారణాయుధాలు లభించడంతో ఆయన రాజకీయ ఉద్దేశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించే ఆలోచన ఆయనకు ఉందన్న ఆలోచనకు బలం చేకూరుతోందని అనుమానిస్తున్నారు. ఇమ్రాన్ నివాసంలోనే కాకుండా, ఆయన రాజకీయ కేంద్రమైన ఖైబర్ పఖ్తుంఖ్వాలోనూ భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. మరోవైపు, చట్టాన్ని ధిక్కరించినందుకు 60 మందికి పైగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను అరెస్టు చేసిన పాకిస్థాన్ మీడియా ప్రకటించింది. లాహోర్‌లో 144 సెక్షన్ అమలు చేస్తుండటంతో పాటు, ఇమ్రాన్ నివాసాన్ని వీడి వెళ్లిపోవాల్సిందిగా ఖాన్ మద్దతుదారులను పోలీసులు కోరుతున్నారు.

పదివేల మందితో ముట్టడి?

తోషాఖానా కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇమ్రాన్ ఖాన్ శనివారంనాడు లాహోర్ నుంచి ఇస్లామాబాద్ బయలుదేరగానే సుమారు 10 వేల మంది పోలీసులు లాహోర్ జమాన్ పార్క్‌లోని ఆయన ఇంటిపైకి దూసుకు వెళ్లారు. మద్దతుదారుల క్యాంపులు, బారికేడ్లు తొలగించి, కార్యకర్తలను చెదరగొట్టి, పలువురిని అరెస్టు

చేశారు. ఇరుపక్షాల తోపులాటంలో పోలీసులు సహా అనేక మంది గాయపడ్డారు. ఇమ్రాన్ నివాసంలో సోదాలు నిర్వహించాలని యాంటీ టెర్రరిజం కోర్టు వారెంట్లు జారీ చేయడంతోనే తాము ఆయన ఇంట్లోకి ప్రవేశించామని పోలీసులు చెబుతుండగా, తాను ఇంట్లో లేని సమయంలో ఏ చట్ట ప్రకారం పోలీసులు తన నివాసంపై దాడి చేశారంటూ ఇమ్రాన్ ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు.

Updated Date - 2023-03-19T20:09:48+05:30 IST