Pakistan : పాకిస్థాన్‌లో కరువు నివురుగప్పిన నిప్పు!

ABN , First Publish Date - 2023-04-01T20:27:00+05:30 IST

పాకిస్థాన్‌లో దుర్భిక్షం త్వరలో విలయతాండవం చేయబోతోందనే హెచ్చరికలు వస్తున్నాయి. మార్చితో ముగిసిన సంవత్సరానికి

Pakistan : పాకిస్థాన్‌లో కరువు నివురుగప్పిన నిప్పు!
Pakistan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో దుర్భిక్షం త్వరలో విలయతాండవం చేయబోతోందనే హెచ్చరికలు వస్తున్నాయి. మార్చితో ముగిసిన సంవత్సరానికి అంతకుముందు ఏడాదితో పోల్చినపుడు ద్రవ్యోల్బణం 35.37 శాతానికి చేరుకున్నట్లు వెల్లడైంది. ఇది ఐదు దశాబ్దాలనాటి గరిష్ఠ స్థాయి కావడంతో ఆందోళన తీవ్రతరమవుతోంది. మరోవైపు ఎంతో అవసరమైన ఉద్దీపన ప్యాకేజీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) నుంచి రావడం లేదు.

పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్చి నెల ద్రవ్యోల్బణం (Inflation) ఫిబ్రవరి నెల కన్నా 3.72 శాతం పెరిగింది. గత సంవత్సరం సగటు ద్రవ్యోల్బణం 27.26 శాతం ఉండేది. అనేక సంవత్సరాల నుంచి తప్పుడు నిర్వహణ వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంది, మరోవైపు రాజకీయ అస్థిరత కూడా దీనికి తోడైంది. అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం, విధ్వంసం సృష్టించిన వరదలు కూడా ప్రజలను కష్టాలపాలు చేశాయి. మొత్తం మీద ఇవన్నీ కలవడంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దశకు చేరుకుంది. ప్రస్తుత రుణాలను, వడ్డీలను తిరిగి చెల్లించడానికి బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం పాకిస్థాన్‌కు అవసరం. విదేశీ మారక ద్రవ్య నిల్వలు, రూపాయి విలువ క్షీణిస్తున్నాయి. ఐఎంఎఫ్ నుంచి 6.5 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ పొందాలంటే పాకిస్థాన్ ప్రభుత్వం కఠినమైన పన్ను సంస్కరణలను అమలు చేయవలసి ఉంటుంది.

ఆర్థిక సంక్షోభం వల్ల పేద పాకిస్థానీలు అనేక అవస్థలు పడుతున్నారు. గోధుమ పిండి కొరత ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. గోధుమ పిండిని రవాణా చేసే లారీలకు పోలీసుల రక్షణ తప్పనిసరి అవుతోంది. రంజాన్ నెల ప్రారంభంలోనే ఆహార పంపిణీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరాచీకి చెందిన అనలిస్ట్ షహీదా విజరత్ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం పెరుగుతుండటాన్నిబట్టి కరువు పరిస్థితులు త్వరలో రాబోతున్నట్లు భావిస్తున్నానని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Hindus in danger : బీజేపీ ఆరోపణలపై మహువా మొయిత్రా మండిపాటు

IndiGo : ఇండిగో సిబ్బందిపై దాడి.. స్వీడిష్ జాతీయుడి అరెస్ట్..

Updated Date - 2023-04-01T20:27:00+05:30 IST