Share News

Nikki Haley: డొనాల్డ్ ట్రంప్ గెలుపు అమెరికాకు అత్యంత ప్రమాదకరం.. నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2023-10-29T19:45:00+05:30 IST

అమెరికా అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న ఇండియన్-అమెరియన్ నిక్కీ హేలీ తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే.. నాలుగేళ్ల పాటు గందరగోళం నెలకొంటుందని..

Nikki Haley: డొనాల్డ్ ట్రంప్ గెలుపు అమెరికాకు అత్యంత ప్రమాదకరం.. నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్ష అభ్యర్థి బరిలో ఉన్న ఇండియన్-అమెరియన్ నిక్కీ హేలీ తాజాగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే.. నాలుగేళ్ల పాటు గందరగోళం నెలకొంటుందని, ప్రతీకార ఘటనలూ వెలుగు చూడొచ్చని కుండబద్దలు కొట్టారు. అలాంటి వాతావరణం అమెరికాకు ఎంతో ప్రమాదకరమైనదని హెచ్చరించారు. ఒక నౌకను స్థిరంగా నడిపించేందుకు సమర్థవంతమైన కెప్టెన్ ఎంత అవసరమో.. దేశాన్ని నడిపించేందుకు అంతే సమర్థుడైన నాయకుడు అవసరమని పేర్కొన్నారు. కాబట్టి.. ఆచితూచి ఓట్లు వేయాల్సిందిగా ప్రజల్ని కోరారు. శనివారం లాస్ వెగాస్‌లో జూయిష్ రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో.. ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇజ్రాయెల్ అనుకూల విధానాల విషయంలో డొనాల్డ్ ట్రంప్‌కు నిక్కీ హేలీ క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. భవిష్యత్తులో అతనేం చేస్తామని ప్రశ్నించారు. ట్రంప్ ఒక ఇజ్రాయెల్ అనుకూల అధ్యక్షుడిగా చరిత్ర గుర్తిస్తుందని.. ఇరాన్ ఒప్పందం నుండి వైదొలగడం తప్పనిసరి అని పేర్కొన్నారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం సరైనదేని.. అందుకు ట్రంప్‌కు క్రెడిట్‌ ఇవ్వడం సంతోషంగా ఉందని.. ఆ ప్రయత్నాల్లో తానూ భాగమైనందుకు గర్వపడుతున్నానని చెప్పారు. కానీ.. అమెరికన్లుగా ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ట్రంప్ ఏం చేశాడో అందరికీ తెలుసని, కానీ భవిష్యత్తులో అతడేం చేస్తాడన్నదే అదిపెద్ద ప్రశ్న అని తెలిపారు. ప్రస్తుతం మనం అత్యంత ప్రమాదకరమైన కాలంలో జీవిస్తున్నానని ఆమె ఉద్ఘాటించారు.


ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హింసను ప్రస్తావిస్తూ.. నేడు ప్రపంచం మొత్తం తగలబడిబోతోందని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. ఒక మిలిటరీ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా.. యుద్ధాన్ని ఆపి, శాంతి నెలకొల్పి, అమెరికన్ ప్రజల్ని కాపాడటమే తనకు ముఖ్యమని తెలిపారు. ఆలస్యం కాకముందే మన స్వేచ్ఛను మనం రక్షించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని సరైన దారిలో నడిపించే నాయకుడు కావాలని.. గందరగోళం సృష్టించకుండా శాంతిని నెలకొల్పే లీడర్ అవసరమని పేర్కొన్నారు. ఓడ మునిగిపోకుండా కాపాడే సమర్థవంతమైన నాయకుడు ఈ అమెరికాకు కావాలని చెప్పుకొచ్చారు.

ఒకవేళ జో బైడెన్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. దాన్ని కూడా ఈ అమెరికా భరించలేదని నిక్కీ హేలీ బాంబ్ పేల్చారు. బైడెనే ఓ చెడ్డవాడు అనుకుంటే, కమలా హారిస్ అంతకుమించిన రాక్షసి అని షాకింగ్ కామెంట్స్ చేసింది. కమలా హారిస్ అధ్యక్షురాలైతే.. మనుగడ సాగించలేమని పేర్కొన్నారు. మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని, నైతిక స్పష్టతను తిరిగి పొందాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి, చెడుల వ్యత్యాసాన్ని గుర్తించి.. చెడుని మంచి ఓడిస్తుందన్న నిర్ధారణకు కట్టుబడి ఉండాలన్నారు.

Updated Date - 2023-10-29T19:45:00+05:30 IST