Share News

Israel-Hamas War: ఇజ్రాయెల్‌కు మరో ఝలక్ ఇచ్చిన ఇరాన్.. మా చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయంటూ వార్నింగ్

ABN , First Publish Date - 2023-10-16T15:47:07+05:30 IST

పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతోనే దూసుకుపోతున్న ఇజ్రాయెల్‌కు ఇరాన్ తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణం ముగింపు పలకాలని...

Israel-Hamas War: ఇజ్రాయెల్‌కు మరో ఝలక్ ఇచ్చిన ఇరాన్.. మా చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయంటూ వార్నింగ్

పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతోనే దూసుకుపోతున్న ఇజ్రాయెల్‌కు ఇరాన్ తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని గట్టి హెచ్చరిక జారీ చేసింది. ‘‘గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి’’ అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్దుల్లాహియన్ పేర్కొన్నట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది.

ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపిన అమెరికాపై కూడా ఆయన మండిపడ్డారు. ‘‘ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్‌కు మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల్ని నియంత్రించడానికి ఎవరూ హామీ ఇవ్వలేరు. అలాగే.. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూస్తామని కూడా ఏ ఒక్కరూ భరోసా కల్పించలేరు. ఈ యుద్ధాన్ని, సంక్షోభాన్ని నిరోధించే ఆసక్తి కలిగి ఉన్నవారు.. గాజా పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులకు వ్యతిరేకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది’’ అని అమెరికాను ఉద్దేశిస్తూ హుస్సేన్ పరోక్ష విమర్శలు చేశారు.


ఇదిలావుండగా.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడుల వెనుక ఇరాన్ హస్తం ఉండొచ్చని మొదట్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ గతంలో మాట్లాడుతూ.. ఈ యుద్ధం తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ఇజ్రాయెల్ దీర్ఘకాల ప్రత్యర్థి అయిన ఇరాన్ ఈ యుద్ధంలో నేరుగా పాల్గొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హుస్సేన్ తాజాగా అమెరికాని ఉద్దేశిస్తూ.. పై విధంగా విరుచుకుపడ్డారు. అలాగే.. ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు.

కాగా.. ఎంతోకాలం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య చిన్నగానో, పెద్దగానో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు హమాస్ మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రాకెట్లను ప్రయోగించడంతో, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా.. గాజాలో దూసుకుపోతోంది. గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ దెబ్బకు గాజాలో ఉండే జనాలు ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోతున్నారు. అటు.. హమాస్ మాత్రం వెనక్కు తగ్గకుండా ఇజ్రాయెల్‌తో పోరాటం కొనసాగిస్తోంది.

Updated Date - 2023-10-16T15:47:07+05:30 IST