Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష.. న్యాయ వ్యవస్థ నుదుట నల్ల మచ్చ.. : పీటీఐ

ABN , First Publish Date - 2023-08-05T14:58:07+05:30 IST

తోషాఖానా బహుమతుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు జైలు శిక్ష విధించడంపై ఆయన నేతృత్వంలోని రాజకీయ పార్టీ పీటీఐ తీవ్రంగా స్పందించింది. ఈ శిక్ష విధించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించింది. పక్షపాతంగల జడ్జి ఇచ్చిన పక్షపాతంతో కూడిన తీర్పును తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష.. న్యాయ వ్యవస్థ నుదుట నల్ల మచ్చ.. : పీటీఐ

ఇస్లామాబాద్ : తోషాఖానా బహుమతుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు జైలు శిక్ష విధించడంపై ఆయన నేతృత్వంలోని రాజకీయ పార్టీ పీటీఐ తీవ్రంగా స్పందించింది. ఈ శిక్ష విధించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించింది. పక్షపాతంగల జడ్జి ఇచ్చిన పక్షపాతంతో కూడిన తీర్పును తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు వెల్లడించింది.

తోషాఖానా కేసులో తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ నుదుటిపై మరొక నల్ల మచ్చను తీసుకొచ్చారని మండిపడింది. పక్షపాతంగల జడ్జి హుమాయున్ దిలావర్ చరిత్రలో లేనంతటి దయనీయ పద్ధతిలో విచారణ జరిపారని దుయ్యబట్టింది. చరిత్రలో అత్యంత హేయమైన విచారణలో, నైతికంగా అవినీతిపరుడు, పక్షపాతంగల జడ్జి చేతుల్లో న్యాయ వ్యవస్థను చంపే ప్రయత్నం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులోని వాస్తవాలను ఓ ప్రత్యేకమైన ఎజెండాతో కప్పిపుచ్చేందుకు జడ్జి ప్రయత్నించారని ఆరోపించింది. ఈ తీర్పు రాజకీయ ప్రతీకారానికి నిలువెత్తు నిదర్శనమని తెలిపింది. లోపభూయిష్టమైన, హాస్యాస్పదమైన, ఎటువంటి న్యాయ ప్రాతిపదిక లేని తీర్పు ద్వారా గణతంత్రంపైనా, ప్రజాస్వామ్యంపైనా నిస్సిగ్గుగా దండయాత్ర జరిగిందని దుయ్యబట్టింది.


కోర్టు తీర్పు

తోషాఖానా బహుమతుల వివరాలను దాచిపెట్టినందుకు పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఖాన్‌పై క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేసింది. దీని ఆధారంగా అధికార పార్టీ సభ్యులు కేసు దాఖలు చేశారు. దీనిపై మే 10న ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువయ్యాయని అడిషినల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ శనివారం తీర్పు చెప్పారు. ఇమ్రాన్ ఉద్దేశపూర్వకంగానే బూటకపు వివరాలను సమర్పించినట్లు నిర్థరణ అయిందని తెలిపారు. ఆయన అవినీతికి పాల్పడినట్లు రుజువైందన్నారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,00,000 జరిమానా విధించారు. ఈ జరిమానాను చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పు చెప్పారు. అంతేకాకుండా, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్లపాటు నిషేధం విధించారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనపై వేటు పడటం గమనార్హం.

తోషాఖానా కేసు

విదేశీ ప్రభుత్వ అధికారులు, నేతలు పాకిస్థాన్ నేతలు, పార్లమెంటేరియన్లు, అధికారులకు ఇచ్చే బహుమతులను భద్రపరచే శాఖను తోషాఖానా అంటారు. ఇది కేబినెట్ డివిజన్ నియంత్రణలో పని చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో తనకు వచ్చిన బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఆయన అవినీతికి పాల్పడినట్లు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆయన తప్పుడు స్టేట్‌మెంట్లు, అవాస్తవ ప్రకటనలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఇమ్రాన్ అరెస్ట్

ఈ తీర్పు వెలువడిన కాసేపటికే ఇమ్రాన్‌ను లాహోర్‌లో అరెస్ట్ చేసినట్లు ఆయన నేతృత్వంలోని పార్టీ పీటీఐ ట్వీట్ చేసింది. ఆయనను కోట్ లఖ్‌పత్ జైలుకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది. కంగారూ కోర్టు తీర్పు కాపీ ఆ కోర్టులో ఉన్నవారికే చేరలేదని, ఆ తీర్పు వెలువడటానికి ముందే పోలీసులు తమ పార్టీ అధ్యక్షుడిని అపహరించేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారని ఆరోపించింది. పీటీఐ పంజాబ్ యూనిట్ కూడా ఇమ్రాన్ అరెస్టును ధ్రువీకరించింది. ఆయనను జమన్ పార్క్ నివాసం నుంచి పోలీసులు తీసుకెళ్తున్నట్లు తెలిపింది.


ఇవి కూడా చదవండి :

Nuh violence : ఇళ్ల పై కప్పులపై రాళ్లు పోగేశారు, గుట్టల మీదకు ఎక్కారు.. భక్తులపై దాడి చేశారు.. : హర్యానా హోం మంత్రి

Gyanvapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే పునఃప్రారంభం

Updated Date - 2023-08-05T15:03:37+05:30 IST