Pakistan: పాకిస్థానీ హిందువుల్లో అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా..?
ABN , First Publish Date - 2023-01-22T20:33:05+05:30 IST
పాకిస్థానీ మిలియనీర్లలో హిందువులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూనే పలువురు హిందువులు సంపన్నులుగా ఎదిగారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆహారం కొరతతో ప్రస్తుతం పాకిస్థానీలు అల్లాడుతున్నారు. గోధుమ పిండి, బియ్యం, కోడి గుడ్లు వంటి వాటి కోసం వీధుల్లో తగాదాలకు దిగుతున్నారు. ఇక పాకిస్థాన్‌లో ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయిన హిందువులూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే.. పాకిస్థానీ మిలియనీర్లలో హిందువులు(Richest Hindus in Pakistan) చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూనే పలువురు హిందువులు సంపన్నులుగా ఎదిగారు. మరి అక్కడి హిందూ ధనవంతులు ఎవరో ఓ మారు లుక్కేద్దామా..
దీపక్ పెర్వానీ
పాకిస్థానీ ఫ్యాషన్ రంగ ప్రముఖుల్లో దీపక్ పెర్వానీ ఒకరు. సింధీ అయిన ఆయన 1973లో మీర్‌పూర్ ఖాస్‌లో జన్మించారు. దీపక్ గొప్ప యాక్టర్ కూడా. ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన వార్షిక ఆదాయం 71 కోట్ల వరకూ ఉంటుందట.
నవీన్ పెర్వానీ
ప్రముఖ స్నూకర్ ప్లేయర్ అయిన నవీన్ పెర్వానీ ..దీపక్ పెర్వానీ బంధువు. ఆయన 1971లో జన్మించారు. 2006లో దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆయన పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 60 కోట్లు వరకూ ఉంటుందని సమాచారం.
సంగీత
పాకిస్థానీ సీని రంగంలో సంగీత ఓ నటిగా, దర్శకురాలిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. అక్కడి చిత్రం రంగంలో ఆమె పర్వీన్ రిజ్వీగా పాపులర్ అయ్యారు. నికా, ముఠ్ఠీ బార్ చావల్, యే అమన్, నామ్ మేరా బద్నామ్ వంటి పెద్ద చిత్రాల్లో పనిచేశారు. సంగీత వార్షిక ఆదాయం 39 కోట్ల రూపాయలు ఉండొచ్చని ఓ అంచనా.
రీతా ఈశ్వర్
కరాచీలో 1981లో జన్మించిన రీతా ఈశ్వర్ రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. 2013 నుంచి 2018 వరకూ పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు. పాకిస్థాన్‌లోని అత్యంత సంపన్న మహిళా రాజకీయనేతల్లో ఒకరిగా రీతా పేరు పొందారు. ఆమె వార్షిక ఆదాయం 60 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.