France Wine: ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వైన్‌ని నాశనం చేసేందుకు ఏకంగా రూ.1700 కోట్లు ఖర్చు

ABN , First Publish Date - 2023-08-27T16:09:01+05:30 IST

నిల్వలు భారీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? తక్కువ ధరలకు అమ్మడమో లేదా ఇతర మార్గాల్ని అన్వేషించడమో చేస్తారు. కానీ.. ఫ్రాన్స్ దేశం ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా?

France Wine: ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వైన్‌ని నాశనం చేసేందుకు ఏకంగా రూ.1700 కోట్లు ఖర్చు

నిల్వలు భారీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? తక్కువ ధరలకు అమ్మడమో లేదా ఇతర మార్గాల్ని అన్వేషించడమో చేస్తారు. కానీ.. ఫ్రాన్స్ దేశం ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా? మద్యం స్టాక్‌ను నాశనం చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఏకంగా 200 మిలియన్ యూరోలు (మన ఇండియన్ కరెన్సీలో రూ.1700 కోట్లు) ఖర్చు చేస్తోంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. తమ దేశంలో అదనంగా నిల్వ ఉన్న వైన్‌ని ధ్వంసం చేసేందుకు ఫ్రాన్స్ సమాయత్తమైంది. వైన్‌కు మంచి ధర తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా.. ఈ పని చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం రెడీ అయ్యింది.


ద్రవ్యోల్బణం, కొవిడ్ ప్రభావం, రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆహారం, ఇంధన ధరలు పెరిగిపోవడంతో.. ఫ్రాన్స్ ప్రజలు తమ వ్యయాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ముఖ్యంగా.. వైన్‌ వంటి అనవసర ఖర్చులను తగ్గించారు. అలాగే.. అక్కడ నాన్-ఆల్కహాలిక్, క్రాఫ్టెడ్ బీర్ వంటి ఇతర రకాల లిక్విడ్ డ్రింక్స్‌కి డిమాండ్ బాగా పెరిగింది. దీనికితోడు.. వైన్‌ దిగ్గజాలైన బోర్డాక్స్‌, లాంగ్యూడాక్‌ సంస్థలు గణనీయంగా వైన్‌‌ను ఉత్పత్తి చేశాయి. దీంతో.. అక్కడ వైన్ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఈ దెబ్బకు ఆ సంస్థలకు ఎనలేని నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే.. మిగిలిపోయిన ఆ వైన్ స్టాక్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వమే ముందుకు వచ్చింది.

200 మిలియన్ యూరోలతో ఆ వైన్‌ను కొనుగోలు చేసి.. మొత్తం ధ్వంసం చేయనుంది. అయితే.. అందులోని ఆల్కహాల్‌ని మాత్రం వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు గాను ఇతర కంపెనీలకు అమ్మనుంది. అంతేకాదు.. వైన్‌ తయారీదారులు ఇతర మార్గాల్లో ఉపాధి వెతుక్కోవడానికి వీలుగా నిధుల్ని కూడా కేటాయించింది. కాగా.. ఐరోపా కమిషన్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్‌ వరకు ఇటలీలో 7%, స్పెయిన్‌లో 10%, ఫ్రాన్స్‌లో 15%, జర్మనీలో 22%, పోర్చుగల్‌లో 34% వైన్‌ వినియోగం పతనమైనట్టు గుర్తించారు. అందుకే.. వైన్ ధర పతనం అవ్వకుండా కాపాడేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Updated Date - 2023-08-27T16:09:01+05:30 IST