Turkey: మీరు రావద్దు... పాక్ ప్రధానికి టర్కీ షాక్

ABN , First Publish Date - 2023-02-08T18:38:02+05:30 IST

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌కు టర్కీ ఊహించని షాక్ ఇచ్చింది. అంకారాలో షెహబాజ్ షరీప్ పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటనను..

Turkey: మీరు రావద్దు... పాక్ ప్రధానికి టర్కీ షాక్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ (Pakistan) ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)కు టర్కీ (Turkey) ఊహించని షాక్ ఇచ్చింది. అంకారాలో షెహబాజ్ షరీప్ పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటనను రద్దు చేసుకోవాలని టర్కీ సూచించింది. అత్యంత శక్తివంతమైన భూకంపంతో దేశం మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున మంత్రులంతా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని తెలిపింది. భూకంప బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు పాక్ ప్రధానమంత్రి షరీప్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఫిబ్రవరి 8న అంకారా వెళ్తున్నట్టు ఆ మీడియా ఇంతకుముందు ప్రకటించింది. అయితే, ఆయనను రావద్దంటూ చివరి నిమిషంలో టర్కీ తెలియజేయడంతో పాక్ ఖంగుతింది.

దీనికి ముందు, ప్రధాన మంత్రి షరీఫ్ బుధవారం ఉదయం అంకారాకు వెళ్తున్నట్టు పాక్ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ ఒక ట్వీట్‌లో తెలిపారు. భూకంపం సృష్టించిన విలయంతో టర్కీలో భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందని, దీనిపై ఆ దేశ అధ్యక్షుడు ఎర్డొగాన్‌కు షరీఫ్ సంతాపం తెలుపుతారని, షరీఫ్ టర్కీ పర్యటన కారణంగా మంగళవారం జరగాల్సిన ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ (ఏపీసీ) వాయిదా పడిందని, భాగస్వామ్య పార్టీలతో సంప్రదించిన అనంతరం తదుపరి తేదీని ప్రకటిస్తామని ఆమె ఆ ట్వీట్‌లో తెలిపారు.

వాతావరణం సానుకూలంగా లేనందునే: పాక్

కాగా, మరియం జౌరంగజేబ్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకు విదేశాంగ మంత్రిత్వ మరో ట్వీట్‌లో పాక్ ప్రధాని పర్యటన వాయిదా పడినట్టు తెలియజేసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం, టర్కీలో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో టర్కీ నాయకత్వం తలమునకలై ఉన్నందున పాక్ ప్రధాని పర్యటన వాయిదా పడినట్టు తెలిపింది. వాతావరణం బాగోలేనందున బాధిత ప్రాంతాల్లో హెలికాప్టర్‌లో ప్రధాని పర్యటించలేని పరిస్థితి ఉందని వివరించింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డెగాన్, ఉపాధ్యకుడు కూడా ఆ దేశంలో జరుగుతున్న సహాయక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్టు తెలిపింది.

Updated Date - 2023-02-08T18:43:53+05:30 IST