China Minister: పత్తా లేకుండా పోయిన చైనా మంత్రి.. అధ్యక్షుడు జిన్‌పింగ్ పాలనపై అనుమానాలు..?

ABN , First Publish Date - 2023-09-17T17:56:29+05:30 IST

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఓ నియంత అనే విషయం అందరికీ తెలుసు. తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా ఆయన దూసుకుపోతుంటాడు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా...

China Minister: పత్తా లేకుండా పోయిన చైనా మంత్రి.. అధ్యక్షుడు జిన్‌పింగ్ పాలనపై అనుమానాలు..?

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఓ నియంత అనే విషయం అందరికీ తెలుసు. తాను చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా ఆయన దూసుకుపోతుంటాడు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా, కనీసం పల్లెత్తు మాట మాట్లాడినా.. సైలెంట్‌గా వారి పనిని ముగించేస్తాడు. అసలేమైందో తెలియనివ్వకుండా.. అత్యంత రహస్యంగా పని కానిచ్చేస్తాడు. ఇప్పటివరకూ అతని పాలనలో పారిశ్రామిక వేత్తల దగ్గర నుంచి మంత్రుల దాకా.. ఎంతోమంది అదృశ్యమయ్యారు. అసలు వాళ్లు బ్రతికే ఉన్నారా? లేదా? అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ జాబితాలోకి తాజాగా చైనా రక్షణ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫూ చేరిపోయారు.

అసలేమైందో ఏమో తెలీదు కానీ.. గత రెండు వారాల నుంచి లీ షాంగ్‌ఫూ కనిపించడం లేదు. ఆయన ఏమయ్యారు? ఎక్కడ ఉన్నారు? అనే వివరాలు తెలియవు. ఇటీవల షీ జిన్‌పింగ్‌ నేతృత్వంలో సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సమావేశం జరగ్గా.. అందులో షాంగ్‌ఫూ కనిపించలేదు. అంతకుముందు.. అంటే ఈ నెల 7, 8వ తేదీల్లో వియత్నాం రక్షణ అధికారులతో జరిగిన అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించలేదు. బహుశా ఆరోగ్య సమస్యల వల్ల ఆయన ఆ ఈవెంట్స్‌కు హాజరు కాలేదేమోనని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ.. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలోనూ కనిపించకపోవడంతో, చైనాలో తీవ్ర కలకలం రేపుతోంది. షాంగ్‌ఫూ అదృశ్యంపై చైనా అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ.. ఆయన్ను పదవి నుంచి తప్పించారన్న కథనాలు మాత్రం బాగా చక్కర్లు కొడుతున్నాయి.


కాగా.. లీ షాంగ్‌ఫూ చివరిసారిగా ఆగస్టు చివరలో కనిపించారు. ఆ తర్వాత ఆయన ఒక్కసారిగా మాయమైపోయారు. ఎలాంటి సమావేశాలకూ హాజరు కాలేదు. లీ షాంగ్‌ఫూ అదృశ్యం.. జి జిన్‌పింగ్ పాలనపై అనిశ్చితిని రేకెత్తిస్తోంది. ఇలాంటి పరిణామాలు.. చైనా ఆర్థిక వ్యవస్థ నాయకత్వంపై నమ్మకం పెట్టుకున్న ఇతర దేశాల విశ్వాసాన్ని ప్రభావితం చేయగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. లీ షాంగ్‌ఫూ అదృశ్యంపై చైనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితి గురించి తనకేమీ తెలియదని కుండబద్దలు కొట్టారు. అటు.. స్టేట్ కౌన్సిల్, రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. జిన్‌పింగ్‌కి లీ షాంగ్‌ఫూ అత్యంత సన్నిహితుడు.

ఇదిలావుండగా.. జూన్‌లో రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లీ షాంగ్‌ఫూ చైనాలో విస్తరిస్తున్న సైనిక దౌత్యానికి ప్రజాముఖంగా నిలిచారు. జూన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి భద్రతా సమావేశంలో యూఎస్ మిలిటరీ ఆపరేషన్స్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టులో రష్యా, బెలారస్‌లో పయనించారు. అక్టోబర్‌లో బీజింగ్‌లో నిర్వహించబోయే అంతర్జాతీయ భద్రతా సమావేశానికి లీ షాంగ్‌ఫూ ఆతిథ్యం ఇస్తారని.. అలాగే నవంబర్‌లో జకార్తాలో జరిగే ప్రాంతీయ రక్షణ అధిపతుల సమావేశంలోనూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి ప్రాతినిధ్యం వహిస్తారని భావించారు. కానీ.. ఇంతలోనే ఆయన అదృశ్యం అవ్వడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2023-09-17T17:56:29+05:30 IST