Share News

Elon Musk: మస్క్‌ని వివాదంలో నెట్టేసిన పోస్టు.. యాడ్స్ తొలగించిన యాపిల్, డిస్నీ సంస్థలు

ABN , First Publish Date - 2023-11-18T15:45:38+05:30 IST

Israel-Hamas War: తను కావాలనే చేస్తాడో లేక అనుకోకుండా జరిగిపోతుందో తెలీదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అనవసరమైన విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో చిక్కుకుంటుంటాడు. ఫలితంగా.. లేనిపోని సమస్యలు ఎదురవ్వడంతో పాటు విమర్శలపాలవుతుంటాడు.

Elon Musk: మస్క్‌ని వివాదంలో నెట్టేసిన పోస్టు.. యాడ్స్ తొలగించిన యాపిల్, డిస్నీ సంస్థలు

తను కావాలనే చేస్తాడో లేక అనుకోకుండా జరిగిపోతుందో తెలీదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అనవసరమైన విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో చిక్కుకుంటుంటాడు. ఫలితంగా.. లేనిపోని సమస్యలు ఎదురవ్వడంతో పాటు విమర్శలపాలవుతుంటాడు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. యూదులకు వ్యతిరేకంగా వస్తున్న పోస్టులకు అతడు మద్దతు తెలపడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో.. అగ్రరాజ్యం అమెరికా అతనిపై మండిపడటంతో పాటు యాపిల్, డిస్నీ వంటి దిగ్గజ సంస్థలు మస్క్‌కి చెందిన ‘ఎక్స్’లో తమ యాడ్స్‌ని నిలిపివేశాయి.

అసలేం జరిగిందంటే.. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న దాడుల కారణంగా అక్కడ సామాన్య పౌరులు (ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు) అన్యాయంగా చనిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు యూదులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తారాస్థాయి విమర్శలు కురిపించారు. ఈ యూజర్లతో మస్క్ ఇటీవల విరివిగా సంభాషణలు జరిపాడు. అలాగు.. యూదులు, శ్వేతజాతీయులను కించపర్చేలా ఓ యూజర్‌ పెట్టిన పోస్ట్‌కు స్పందిస్తూ.. ‘‘నువ్వు అసలు నిజం చెప్పావు’’ అని మస్క్ పేర్కొన్నాడు. ఇదే అతని పాలిట శాపమైంది. ఆ కామెంట్ మస్క్‌ని ఊహించని చిక్కుల్లో పడేసింది.


మస్క్ చేసిన కామెంట్‌పై అమెరికా అధ్యక్ష భవనం తీవ్రంగా స్పందిస్తూ.. ‘మస్క్‌ స్పందన యూదు కమ్యూనిటీని ప్రమాదంలో పడేసేలా ఉంది’ అని మండిపడింది. అటు.. యాపిల్‌, ఐబీఎం, ఒరాకిల్‌, కామ్‌కాస్ట్‌, బ్రావో టెలివిజన్‌ నెట్‌వర్క్‌, యూరోపియన్‌ కమిషన్స్‌, లయన్స్‌ గేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్పొరేషన్‌, వాల్ట్‌ డిస్నీ, పారామౌంట్‌ గ్లోబల్‌, వార్నర్‌ బ్రోస్‌ డిస్కవరీ వంటి దిగ్గజ సంస్థలు ‘ఎక్స్’లో తమ యాడ్స్ ప్రసారాల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. మస్క్‌కి ఇదే పెద్ద తలనొప్పి అనుకుంటే, అంతకుమించిన మరో సమస్య కూడా అతడ్ని వెంటాడుతోంది. మస్క్‌కు చెందిన టెస్లాలోని కొందరు వాటాదారుల్ని, టెస్లా సీఈవో పదవి నుంచి మస్క్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అటు.. $282,200 టెస్లా స్టాక్‌ను కలిగిన ఉన్న నియా ఇంపాక్ట్ క్యాపిటల్ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టిన్ హల్ కూడా మస్క్ పోస్టుపై అసహనం వ్యక్తం చేశారు. మస్క్ కొత్త పోస్టులు చూసి తాను షాక్‌కి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. టెస్లా సీఈవో నుండి వచ్చిన ఈ అస్థిరమైన, జాత్యహంకార, సెమిటిక్ కామెంట్.. టెస్లా బ్రాండ్‌పై నేరుగా ప్రభావం చూపుతుందని అన్నారు. మస్క్ చర్యలకు ప్రతిస్పందనగా.. అతనిపై వేటు పడే అవకాశం ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు. మరి.. ఈ పెద్ద వివాదం నుంచి మస్క్ ఎలా బయటపడతాడో, దీనిని ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.

Updated Date - 2023-11-18T15:45:39+05:30 IST