Pregnancy: మొదటి 3 నెలలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే..!

ABN , First Publish Date - 2023-07-18T11:32:14+05:30 IST

చెట్టుకు కాయలు కాయడం సహజమే! అయితే ఆ కాయలు పండ్లుగా మారాలంటే, చెట్టుకు మంచి ఎరువులు, పోషకాలు అందాలి. లేదంటే పిందె దశలోనే అవి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. గర్భధారణకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

Pregnancy: మొదటి 3 నెలలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే..!

చెట్టుకు కాయలు కాయడం సహజమే! అయితే ఆ కాయలు పండ్లుగా మారాలంటే, చెట్టుకు మంచి ఎరువులు, పోషకాలు అందాలి. లేదంటే పిందె దశలోనే అవి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. గర్భధారణకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గర్భం దాల్చిన తర్వాత, మొదటి మూడు నెలల్లో శరీరం ఎన్నో మార్పులకు లోనై, కొన్ని చిన్నపాటి సమస్యలు వేధిస్తాయి. కాబట్టి తొలి త్రైమాసికం వైద్యుల పర్యవేక్షణలో మెలగడం ఎంతో అవసరం.

పెళ్లి తర్వాత నెలసరి రాలేదంటే గర్భం దాల్చినట్టు భావిస్తూ ఉంటాం. అయితే క్రమం తప్పకుండా నెలసరి వచ్చే వాళ్ల విషయంలో ఇది కరెక్టే! కానీ నెలసరిలో అవకతవకలున్నా, గర్భనిరోధక మాత్రలు వాడుతూ నెలసరి మిస్‌ అయినా అది గర్భమో కాదో తెలుసుకోవటం కోసం కచ్చితంగా వైద్యుల్ని సంప్రతించి ప్రెగ్నెన్సీని నిర్ధారించుకోవాలి. కొన్ని సందర్భాల్లో గర్భం దాల్చిన విషయం తెలియక గర్భ నిరోధక మాత్రలు వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల పిండం పెరుగుదల మీద మాత్రల ప్రభావం పడుతుంది. కాబట్టి గర్భధారణను కచ్చితంగా గుర్తుపట్టడం కోసం నెలసరి సమస్యలుంటే వాటికి తగిన చికిత్స తీసుకోవాలి.

ఫోలిక్‌ యాసిడ్‌ శ్రీరామరక్ష

గర్భంలో పెరిగే బిడ్డకు నాడీ సంబంధ అవకరాలు రాకుండా ఫోలిక్‌ యాసిడ్‌ నివారిస్తుంది. కాబట్టి గర్భం దాల్చే ప్రయత్నంలో ఉన్నవారు గర్భధారణకు ముందు నుంచే, గర్భం దాల్చిన వాళ్లు వెంటనే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు మొదలుపెట్టాలి. అలాగే ఎపిలెప్సీ, మధుమేహం, హైపర్‌టెన్షన్‌ ఉంటే గర్భం దాల్చకముందు నుంచే వీటిని నియంత్రణలో ఉంచుకోవాలి. గర్భం దాల్చితే వెంటనే ఈ రుగ్మతలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి.

గర్భిణుల్లో సాధారణ సమస్యలు

గర్భంతో ఉన్నప్పుడు పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం సహజమే! పైగా తిన్న వెంటనే ఆహారం అన్నవాహికలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. జీర్ణాశయంలోని యాసిడ్‌ అన్నవాహికలోకి ఎగిసి పడుతుంది. గర్భిణుల్లో అసిడిటీ, మలబద్ధకాలు మామూలే! వీటిని మందులతో కంటే తినే ఆహారం, పద్ధతుల్లో మార్పులతో సరిదిద్దుకోవాలి. గర్భధారణతో గర్భకోశం పరిమాణం పెరిగి, జీర్ణాశయం మీద ఒత్తిడి పెరగడం మూలంగా ఛాతీలో, గొంతులో మంట వేధిస్తాయి. ఇలా జగరకుండా ఉండాలంటే తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలి. ఒకేసారి భారీగా తినేయకుండా కొద్ది పరిమాణాల్లో ప్రతి రెండు గంటలకోసారి తింటూ ఉండాలి. ఇక మలబద్ధకం నివారణ కోసం పీచుపదార్థం ఎక్కువగా ఉండే పళ్లు, ఆకుకూరలు తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. స్వల్ప వ్యాయామం చేయాలి.

మొదటి నెలలో...

గర్భం దాల్చినట్టు తెలియగానే కొందరు మహిళలు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలనే అపోహలో ఉంటారు. కానీ అంతకు ముందు ఎలాంటి జీవనశైలిని గడిపారో దాన్నే తొలి త్రైమాసికంలో కొనసాగించవచ్చు. విశ్రాంతి వల్ల అదనపు ప్రయోజనమేమీ ఉండదు. అయితే పూర్వం వరస గర్భస్రావాలు అయి ఉన్నా, గర్భాశయ ముఖద్వార సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యల ఉండి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తే తప్ప గర్భిణులు మొదటి నెలలో అవసరానికి మించి విశ్రాంతి తీసుకోనవసరం లేదు. వ్యాయామం విషయంలో కూడా ఎలాంటి నిబంధనలు లేవు. ఏరోబిక్స్‌ లాంటి హెవీ ఎక్సర్‌సైజ్‌లు కాకుండా వాకింగ్‌, ఇతరత్రా తేలికపాటి వ్యాయామాలన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. ఆహారంలో మాంసకృత్తులు(ప్రొటీన్లు) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఐరన్‌ ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.

రెండవ నెలలో

రెండవ నెలలో బరువు పెరుగుతారు. పగటివేళ కూడా నిద్రమత్తు వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగినులు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిద్ర మత్తుతో ఉన్నప్పుడు ఇంటికే పరిమితమైతే మంచిది. కొందరికి రెండో నెల నుంచే వికారం, వాంతులు మొదలవుతాయి. ఇలాంటప్పుడు ఎలాంటి ఆహారం తినాలనిపిస్తుందో దాన్నే తినాలి. ఇష్టం లేని పదార్థాలను బలవంతంగా తినాల్సిన అవసరం లేదు. అయితే పోషకాలన్నీ అందుతున్నాయో లేదో సరిచూసుకుంటూ ఉండాలి. పాలు, పెరుగు, జున్ను మొదలైన పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమయంలో పుల్లని పళ్లు, పచ్చళ్ల మీదకు మనసు మళ్లుతుంది. అలాగని వాటికే పరిమితమైతే పోషకాలు లోపిస్తాయి. పైగా ఎసిడిటీ కూడా వేధిస్తుంది. కాబట్టి సమతులాహారం తీసుకోవాలి.

మూడవ నెలలో...

మూడవ నెల ఎంతో కీలకం. ఈ నెలలో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అనేది అపోహే! గర్భం దాల్చిన మహిళల్లో 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే గర్భస్రావం అవుతుంది. ఇందుకు ఎన్నో కారణాలుంటాయి. క్రోమోజోముల్లో లోపాలు, గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉండటం, పూర్వం గర్భస్రావాలు జరిగి ఉండటం, ఇతరత్రా అనారోగ్యాలు...ఇలా మూడవ నెలలో గర్భస్రావానికి చాలా కారణాలుంటాయి. అలాగని ఎవరికో మూడవ నెలలో గర్భస్రావం జరిగిందని మనకూ అలా జరిగే అవకాశం ఉండొచ్చని అనుకోవటం పొరపాటు. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు అబార్షన్‌ జరిగే అవకాశాలు చాలా తక్కువ. అయితే గర్భంలో పెరిగే పిండంలో లోపాలను ప్రారంభంలోనే గుర్తించటం కోసం మూడవ నెలలో స్కానింగ్‌ తప్పనిసరి.

పిండంలో క్రోమోజోమ్స్‌కు సంబంధించిన లోపాలను, డౌన్స్‌ సిండ్రోమ్‌తో పుట్టే లక్షణాలను స్కానింగ్‌లో కనిపెట్టే వీలుంది. బిడ్డలో నాడీమండల సమస్యలు, గుండెలో సమస్యలను కూడా స్కానింగ్‌లో కనిపెట్టవచ్చు. అలాగే బిడ్డలో అవయవలోపాలను కూడా స్కానింగ్‌లో కనిపెట్టవచ్చు. ఒకవేళ లోపాలున్నాయని తెలిసినప్పుడు గర్భాన్ని కొనసాగించాలా? లేక గర్భస్రావం చేయించుకోవాలా? అనేది వైద్యులు మన ఇష్టానికే వదిలేస్తారు.

మూడు నెలల్లో ఆహార నియమాలు

గర్భం దాల్చినది మొదలు ప్రతి నెలా ప్రత్యేకమే! గర్భంలో పిండం సక్రమంగా ఎదగాలంటే బిడ్డ పోషణకు సరిపడా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం మాంసకృత్తులు ఎక్కువగా ఉండే గుడ్లు, మాంసం, చేపలు తినాలి. శాకాహారులైతే బ్రకోలీ, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్‌, ఆకుకూరలు తీసుకోవాలి. కాల్షియం సమృద్ధిగా దొరికే పాల ఉత్పత్తులు తప్పనిసరిగా తీసుకోవాలి. నూనె పదార్థాలు, పచ్చళ్లు తగ్గించాలి. అయితే రోజుకి ఎన్ని ప్రొటీన్లు, పిండి పదార్థాలు తీసుకోవాలి? ఇందుకోసం ఎలాంటి పదార్థాలు తినాలి? అనేది కచ్చితంగా తెలుసుకోవటం కోసం డైటీషియన్‌ను సంప్రతించాలి.

గర్భంతో వ్యాయామం

గర్భం దాల్చినంత మాత్రాన వ్యాయామం పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. అలాగని బరువైన, శక్తికి మించిన వ్యాయామాలూ చేయకూడదు. బాగా అలుపొచ్చేలా చేసే వ్యాయామాలకు బదులు వాకింగ్‌, యోగాలాంటి సౌకర్యవంతమైన వ్యాయామాలు చేయవచ్చు. వ్యాయామం చేసే శక్తి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. దాని ఆధారంగా చేయగలిగేంతవరకే వ్యాయామం చేయాలి.

వేవిళ్లు వేధిస్తే?

కొంతమందికి వాంతులు మరీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ సమస్యకూ మందులున్నాయి. ఒకవేళ నీళ్లు తాగినా వాంతి అయిపోతూ, డీహైడ్రేట్‌ అయిపోయి, బలహీనపడిపోతూ ఉంటే రక్తపరీక్షలు చేసి ‘హైపర్‌ ఎమిసిస్‌’ సమస్యను వైద్యులు నిర్థారిస్తారు. హైపర్‌ ఎమిసిస్‌ ఉంటే దానికి సపోర్టివ్‌ ట్రీట్మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సమస్య అదుపులోకొస్తుంది.

pl5.jpg

వరుస గర్భస్రావాలు అయి ఉంటే?

కొందరికి గర్భం దాల్చిన మూడు వారాల్లోపే గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. ఇలా వరుసగా జరుగుతూ ఉంటే ఇలాంటి వాళ్లు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. వీళ్లకు కొన్ని పరీక్షలు చేసి, గర్భస్రావాలకు కారణాన్ని వైద్యులు కనిపెట్టగలుగుతారు. థైరాయిడ్‌ స్రావంలో అవకతవకలు, రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువ ఉండటం, క్రోమోజోమల్‌ డిజార్డర్లు ఉన్నాయా? అనే అంశాలను వైద్యులు పరీక్షిస్తారు. అలాగే యాంటీబాడీ సిండ్రోమ్‌ వల్ల కూడా అబార్షన్లు అవుతాయి. ఈ సమస్యను కూడా వైద్య పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. కాబట్టి గతంలో వరుస అబార్షన్లు అయిన వాళ్లు గర్భం దాల్చిన వెంటనే వైద్యులను కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొంతమందికి మూడో నెలలో చేసే స్కానింగ్‌లో గర్భద్వారం వదులుగా ఉందని తెలిస్తే ఆ భాగంలో వైద్యులు కుట్టు వేస్తారు.

pr2.jpg

మందులు వాడాలంటే?

గర్భిణులు నోటి ద్వారా తీసుకునే ప్రతిదీ కడుపులోని బిడ్డకు చేరుతుంది. కాబట్టి గర్భిణులు ఇతరత్రా ఆరోగ్య సమస్యల కోసం తీసుకునే మందుల విషయంలో వైద్యుల సూచనలు పాటించాలి. ఎంత చిన్న రుగ్మతకైనా సొంత వైద్యం మానుకుని వైద్యుల సూచన మేరకు నాన్‌ స్టెరాయిడల్‌ మాత్రలనే తీసుకోవాలి. నొప్పుల కోసం పారా సెటమాల్‌ తీసుకోవచ్చు. ఇక గర్భిణులు వాడదగిన యాంటీ బయాటిక్స్‌ వేరుగా ఉంటాయి. వాటిని వైద్యులు మాత్రమే సూచిస్తారు. కాబట్టి బ్యాక్టీరియల్‌, వైరల్‌, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల బారిన పడితే సొంత వైద్యం మీద ఆధారపడకుండా వైద్యులను వెంటనే సంప్రదించాలి.

po2.jpg

మధుమేహం, రక్తపోటు ఉన్న గర్భిణులైతే?

గర్భానికి ముందే మధుమేహం ఉంటే మందులతో షుగర్‌ను అదుపులో ఉంచుకుంటే గర్భం దాల్చినా సమస్యలు ఎదురవవు. అలాగే అధిక రక్తపోటు కూడా! ఇలాంటి గర్భిణులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ అవసరానికి తగ్గట్టు ఇన్సులిన్‌ మోతాదులను సరిచేస్తూ చికిత్స తీసుకోవాలి. అలాగే డైటీషియన్‌ను సంప్రదించి ప్రత్యేకమైన ఆహార నియమాలు కూడా పాటించాలి. అలాగే మధుమేహం ఉన్న గర్భిణులకు వ్యాయామం కూడా తప్పనిసరి. వీళ్లకి స్కానింగ్‌లు కూడా ఎక్కువ అవసరమవుతాయి. రక్తపోటు ఉన్నవాళ్లకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి గర్భంతోపాటే రక్తపోటూ మొదలవుతుంది. హైపర్‌టెన్షన్‌ ఉన్న వాళ్లకి గర్భం దాల్చగానే బిపి మొదలవుతుంది. ఇలాంటి వాళ్లు కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, మూత్రపిండాలు, కాలేయం పనితీరులను పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలాంటివాళ్లకి ఫిట్స్‌ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వైద్యులను తరచుగా కలుస్తూ, బిపి, రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ గర్భంలోని బిడ్డ పెరుగుదలను గమనిస్తూ ఉండాలి.

Updated Date - 2023-07-18T11:32:14+05:30 IST