Fitness: వీపు వెనక కొవ్వును కరిగించాలంటే..!

ABN , First Publish Date - 2023-04-18T12:36:03+05:30 IST

వీపు వెనక పేరుకునే కొవ్వును కరిగించడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. భుజాల వెనక, నడుముకు ఎగువన పేరుకునే ఈ కొవ్వు వల్ల

Fitness: వీపు వెనక కొవ్వును కరిగించాలంటే..!
Fitness

వీపు వెనక పేరుకునే కొవ్వును కరిగించడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. భుజాల వెనక, నడుముకు ఎగువన పేరుకునే ఈ కొవ్వు వల్ల శరీరం పైభాగం లావుగా, ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇబ్బంది తొలగాలంటే ఈ వ్యాయామాలు చేయాలి.

స్క్వాట్‌ జంప్స్‌: ఈ వ్యాయామంతో చేతులతో పాటు, కాళ్లూ, మొత్తం శరీరానికి వ్యాయామం దక్కుతుంది. ఎలా చేయాలంటే....

  • నిటారుగా నిలబడి మోకాళ్లను వంచి, కిందకు కుంగాలి.

  • ఈ భంగిమలో గోడ కుర్చీ వేసినట్టుగా శరీరాన్ని వంచాలి.

  • ఈ భంగిమ నుంచి ఒక్కసారిగా నిటారుగా నిలబడుతూ గాల్లోకి పైకి ఎగరాలి.

  • ఎగిరేటప్పుడు శరీరం నిటారుగా ఉండాలి, చేతులు శరీరానికి సమాంతరంగా ఉండాలి.

  • ఎగిరి నేలను తాకేటప్పుడు తిరిగి మోకాళ్లను వంచి, గోడ కుర్చీ భంగిమలోకి రావాలి.

  • ఇలా 20 సార్లు చొప్పున 3 సెట్లు చేయాలి.

రివర్స్‌ లంజ్‌: ఈ వ్యాయామంతో కాళ్లు, తొడలతో పాటు వెన్ను దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఎలా చేయాలంటే....

  • నిటారుగా నిలబడి, నడుము మీద చేతులు ఉంచుకోవాలి.

  • ఎడమ మోకాలు వంచి, కుడి కాలును రెండు అడుగుల ముందుకు వేయాలి.

  • ఇలా చేస్తున్నప్పుడు ఎడమ మోకాలు నేలను తాకాలి.

  • తిరిగి కుడి కాలును వెనకకు తీసుకువచ్చి, ఎడమ కాలును ముందుకు వేయాలి.

  • ఇలా చేస్తున్నప్పుడు కుడి మోకాలు నేలను తాకాలి. ఇలా కాళ్లు రెండూ మార్చి మార్చి రివర్స్‌ లంజ్‌ చేయాలి.

  • 15 రెప్స్‌ 3 సెట్లు చేయాలి.

రేర్‌ డెల్డాయిడ్‌ రొటేషన్స్‌: రెండున్నర కిలోల బరువులతో చేసే వ్యాయామమిది. ఎలా చేయాలంటే...

  • నిటారుగా నిలబడి చేతుల్లోకి బరువులు తీసుకోవాలి. రెండు చేతులను పక్కలకు చాపి, తిరిగి ఛాతీ దగ్గరకు తీసుకొచ్చి డంబెల్స్‌ను ఆనించాలి.

  • తిరిగి చేతులు రెండూ పక్కలకు చాపాలి.

  • చేతులు చాపేటప్పుడు ఊపిరి పీలుస్తూ, ఛాతీ దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఊపిరి వదలాలి.

  • ఇలా 15 రెప్స్‌ 3 సెట్లు చేయాలి.

Updated Date - 2023-04-18T12:36:03+05:30 IST