Painను ఇలా వివరించవచ్చు..!
ABN , First Publish Date - 2023-01-31T14:05:21+05:30 IST
నొప్పి తీవ్రత (Pain)ను వైద్యులకు వివరించేటప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ నొప్పిని కచ్చితంగా గుర్తించటానికి వైద్యులు నొప్పి కొలబద్ద (పెయిన్ స్కేల్)ను

నొప్పి తీవ్రత (Pain)ను వైద్యులకు వివరించేటప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ నొప్పిని కచ్చితంగా గుర్తించటానికి వైద్యులు నొప్పి కొలబద్ద (పెయిన్ స్కేల్)ను వాడతారు. నొప్పి తీవ్రతను బట్టి నొప్పిని 1 - 10 అంకెల్లో వివరించవచ్చు. ఈ సారి ఎలాంటి నొప్పితో వైద్యులను కలిసినా ఈ పెయిన్ స్కేల్ (Pain scale) ఆధారంగా నొప్పిని వివరించండి.
00 - నొప్పి లేదు.
01 - స్వల్పంగా(మైల్డ్): చాలా తక్కువ. మరీ అంత ఇబ్బంది పెట్టట్లేదు. రోజు మొత్తంలో దాని గురించి ఆలోచనే రాదు.
02 - కొద్దిగా(మైల్డ్): నొప్పి ఉంది. చిరాకుపెడుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్రమవుతూ ఉంటుంది.
03 - అసౌకర్యం (అన్‌కంఫర్టబుల్): నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది. దానికి అలవాటు పడి పనుల్లో పడిపోతూ ఉంటారు.
04 - మోస్తరుగా (మోడరేట్): ఏదైనా పనిలో పడిపోయినప్పుడు నొప్పి తెలియదు. అయినా నొప్పి మాత్రం అదే పనిగా విసిగిస్తూనే ఉంటుంది.
05 - దేని మీదా ఏకాగ్రత పెట్టలేనంత (డిస్‌ట్రెసింగ్): విపరీతమైన నొప్పి. కొద్ది నిమిషాలు కూడా వదిలిపెట్టదు. అయితే ప్రయత్నం మీద నొప్పి మీద నుంచి ధ్యాస మళ్లించి పనులు చేసుకోగలుగుతున్నారు.
06 - వ్యధాభరితంగా (డిస్‌ట్రెసింగ్): రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెట్టే నొప్పి. నొప్పి వల్ల ఏ పనీ చేయలేకపోతూ ఉండటం.
07 - తీవ్రం (సివియర్): మన పంచేంద్రియాలను డామినేట్ చేసేటంత నొప్పి. నొప్పితో ఒక ప్రదేశానికే పరిమితమైపోవటం, ఎవరితో కలవలేకపోవటం, నిద్ర పట్టకపోవటం.
08 - అత్యంత తీవ్రంగా (ఇంటెన్స్): శారీరాన్ని కదిలించలేకపోవటం. అతి కష్టం మీద మాట్లాడగలగటం.
09 - భరించలేనంత (ఎక్స్‌క్రూషియేటింగ్): నొప్పి వల్ల మాటలు రాకపోవటం. బిగ్గరగా ఏడ్వటం/మూలగటం.
10 - మాటల్లో చెప్పలేనంత (అన్‌స్పీకబుల్): మంచానికే పరిమితమై స్పృహ కోల్పోతూ ఉండటం.
నొప్పి గురించి చెప్పేటప్పుడు దొర్లే తప్పులు సాధారణంగా వైద్యులకు నొప్పి గురించి వివరించేటప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెపుతూ ఉంటాం. అది రెండు పద్ధతుల్లో చేస్తూ ఉంటాం.
1. 0 నుంచి 10 పెయిన్ స్కేల్‌తో పోలిస్తే మీ నొప్పి 12 ఉందని చెప్పటం: మీ నొప్పి తీవ్రతను వైద్యులకు వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇలా చెప్తూ ఉంటాం.య కానీ ఇలా చెప్పటం వల్ల మీరు ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెబుతున్నట్టు డాక్టర్లు గ్రహిస్తారు. దాంతో మీ నొప్పి తీవ్రతను కచ్చితంగా అంచనా వేయలేకపోతారు.
2. నొప్పి గురించి నవ్వుతూ చెప్పటం: నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు మాట్లాడటమే కష్టం. అలాంటిది నవ్వుతూ మాట్లాడుతున్నామంటే నొప్పి భరించగలిగే స్థాయిలోనే, 10 లోపలే ఉందని అర్థం. ఎపిడ్యురల్ ఇంజెక్షన్ (Epidural injection) లాంటి నొప్పిని తగ్గించే ఇంజక్షన్ సహాయం లేకుండా జరిగే సాధారణ ప్రసవ నొప్పులే పెయిన్ స్కేల్‌లో 8 స్థానాన్ని సూచిస్తాయని గుర్తు పెట్టుకోండి. కాబట్టి వైద్యులకు అవసరాన్ని మించి నొప్పిని ఎక్కువ చేసి చెప్పటం వృథా ప్రయాసే అనే విషయాన్ని గ్రహించండి.