Ectopic pregnancy: గర్భాశయం బయట గర్భం దాల్చారా? అయితే వెంటనే..!

ABN , First Publish Date - 2023-09-26T10:59:20+05:30 IST

సాధారణంగా ఫలదీకరణ చెందిన పిండం గర్భసంచి లోపల నాటుకుంటుంది. ఇలా కాకుండా ఫెలోపియన్‌ ట్యూబ్‌ లేదా సర్వైకల్‌ కెనాల్‌.. ఇలా గర్భాశయం వెలుపల పిండం నాటుకుంటే, దాన్ని ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీగా

Ectopic pregnancy: గర్భాశయం బయట గర్భం దాల్చారా? అయితే వెంటనే..!

సాధారణంగా ఫలదీకరణ చెందిన పిండం గర్భసంచి లోపల నాటుకుంటుంది. ఇలా కాకుండా ఫెలోపియన్‌ ట్యూబ్‌ లేదా సర్వైకల్‌ కెనాల్‌.. ఇలా గర్భాశయం వెలుపల పిండం నాటుకుంటే, దాన్ని ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీగా పరిగణించాలి. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీలలో ట్యూబల్‌ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పెల్విక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ డిసీజ్‌ లేదా సర్జరీలు, ఇన్‌ఫెక్షన్‌లు, లైంగిక వ్యాధుల వల్ల ఫెలోపియన్‌ ట్యూబ్‌లు పాడైనా ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో పుట్టుకతోనే ఫెలోపియన్‌ ట్యూబ్‌ ఆకారంలో తేడాలుంటాయి. ఈ కారణంగా కూడా ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ రావచ్చు. కుటుంబ నియంత్రణలో భాగంగా ఫెలోపియన్‌ ట్యూబ్‌లను కత్తిరించి, తొలగించిన మహిళలు పొరపాటున గర్భం దాల్చితే ఈ ఫెలోపియన్‌ ట్యూబ్‌లోనే పిండం నాటుకుంటుంది. అలాగే కాపర్‌ టి వేయించుకున్న మహిళలు పొరపాటున గర్భం దాల్చినా ఇదే పరిస్థితి తలెత్తవచ్చు.

స్కాన్‌తో బట్టబయలు

సాధారణంగా స్కాన్‌ గర్భం దాల్చిన ఏడు వారాలకు చేస్తారు. కానీ పై లక్షణాలు కనిపిస్తే, అంతకంటే ముందే స్కాన్‌ చేసి చూడవలసి ఉంటుంది. సిటి స్కాన్‌తో గర్భం గర్భాశయంలో ఉందో లేదో తెలిసిపోతుంది. గర్భాశయంలో ప్రెగ్నెన్సీ శాక్‌ కనిపించనప్పుడు, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీగా పరిగణించి, ట్రాన్స్‌ వెజైనల్‌ పరీక్షతో పాటు, రక్త పరీక్ష కూడా చేయవలసి ఉంటుంది. గర్భం దాల్చిన మహిళల్లో ప్రెగ్నెన్సీ హార్మోన్‌ ఐదు ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌ కంటే ఎక్కువ ఉంటుంది. గర్భం గర్భాశయంలోనే నాటుకుని ఉన్న వాళ్లలో ఈ హార్మోన్‌ మోతాదు వెయ్యి కంటే ఎక్కువ ఉండాలి. అయితే ఈ హార్మోన్‌ వెయ్యి కంటే ఎక్కువ ఉన్నప్పటికీ, గర్భసంచి లోపల పిండం కనిపించకపోతే ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీగా వైద్యులు నిర్థారిస్తారు. అయితే ఆ గర్భం ఫెలోపియన్‌ ట్యూబుల్లో ఉందా, అండాశయాల్లో ఉందా అనేది తెలుసుకోవడం కోసం వైద్యులు ఎమ్మారై మీద ఆధారపడతారు. ఈ పరీక్షతో ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ కచ్చితమైన ప్రదేశం తేలిపోతుంది.

prgnet.jpg

హార్మోన్‌ మోతాదు ఆధారంగా....

పిండం ఎదగడానికి తగ్గట్టుగా గర్భసంచి మాత్రమే వ్యాకోచించగలుగుతుంది. ఈ పరిస్థితి మరెక్కడా ఉండదు. కాబట్టి ఒకవేళ ఫెలోపియన్‌ ట్యూబులో పిండం పెరుగుతూ, దాన్ని పసిగట్టలేకపోతే, ఒక దశ దాటిన తర్వాత ట్యూబు పగిలిపోతుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి మహిళలకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి లక్షణాలను బట్టి వీలైనంత త్వరగా వైద్యుల సహాయంతో నిర్థారించుకోవాలి. చికిత్స కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్‌ (బీటా హెచ్‌సిజి) ఆధారంగానే సాగుతుంది. ఈ హార్మోన్‌ మోతాదును బట్టి, రోగి లక్షణాలను బట్టి మందులతో సమస్యను సరిదిద్దవచ్చా, లేదంటే సర్జరీకి వెళ్లాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. సాధారణ గర్భధారణలో ప్రెగ్నెన్సీ హార్మోన్‌ ప్రతి 48 గంటలకూ రెట్టింపు అవుతూ ఉంటుంది. కానీ ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీలో హార్మోన్‌ అంతగా పెరగదు. ఈ హార్మోన్‌ 4 వేల యూనిట్ల కంటే తక్కువ ఉన్నప్పుడు, గర్భాశయం లోపలి శాక్‌ పరిమాణం 35 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ పిండం శరీరంలో కలిసిపోయే ఇంజక్షన్‌ను ఇచ్చే పద్ధతిని వైద్యులు ఎంచుకుంటారు. దీంతో పరిస్థితి సర్దుకుంటుంది. అలా కాకుండా ఆ తర్వాత కూడా బీటా హెచ్‌సిజి హార్మోన్‌ పెరుగుతూ ఉన్నా, అసౌకర్యం, కడుపు నొప్పి పెరుగుతూ ఉన్నా, సదరు మహిళకు సర్జరీ అవసరం పడవచ్చు. ఒకవేళ ఈ హార్మోన్‌ ఐదు వేలు ఉన్నా, ప్రెగ్నెన్సీ మాస్‌ 3.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నా కూడా వైద్యులు సర్జరీని ఎంచుకుంటారు.

రెండు రకాలుగా...

సర్జరీలో కూడా ల్యాప్రోస్కోపిక్‌, ఓపెన్‌ అనే రెండు రకాలుంటాయి. మహిళ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండి, ట్యూబ్‌ రప్చర్‌ అవకుండా ఉంటే, ల్యాప్రోస్కోపిక్‌ ద్వారా ట్యూబ్‌ దెబ్బతినకుండా పరిస్థితిని చక్కబరచవచ్చు. అలా కాకుండా ట్యూబ్‌ బాగా డ్యామేజ్‌ అయితే, సర్జరీతో పిండంతో పాటు, ట్యూబ్‌ను కూడా తొలగించవలసి ఉంటుంది. అయితే ఒక ట్యూబ్‌ తొలగించినంత మాత్రాన తిరిగి గర్భం దాల్చలేమోనని భయపడవలసిన అవసరం లేదు. రెండో ట్యూబు ఆరోగ్యంగానే ఉంటుంది కాబట్టి గర్భధారణ సాధ్యమే! అయితే గర్భధారణకు ముందు ట్యూబ్స్‌ ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం కోసం సోనో స్కాన్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి.

నిర్లక్ష్యం తగదు

ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ సమయంలో, ఫలదీకరణం చెందిన అండం గర్భాశయం బయట ఒక స్ట్రక్చర్‌గా మారి, కొన్ని వారాల పాటు పెరుగుతుంది. అయితే ఆ స్ట్రక్చర్‌ 6 నుంచి 16 వారాల్లోగా పగిలిపోతుంది. అలా ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ పగిలిపోయినప్పుడు, తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. ఈ రక్తస్రావాన్ని నియంత్రించకపోతే, అది ప్రాణాంతక పరిస్థితి అయిన హెమరేజిక్‌ షాక్‌కు దారి తీయవచ్చు. కాబట్టి అలా ఫలదీకరణ చెందిన అండం పగిలిపోకముందే అప్రమత్తం కావాలి. ఆ స్ట్రక్చర్‌ పలిగిపోవడం మూలంగా అది అంటుకుని ఉన్న ఫెలోపియన్‌ ట్యూబ్‌ కూడా దెబ్బతింటుంది. దాంతో వైద్యులు సర్జరీలో ఫెలోపియన్‌ ట్యూబును కూడా తొలగించవలసి వస్తుంది. అయితే సాధారణంగా మహిళల్లో రెండు ఫెలోపియన్‌ ట్యూబులు ఉంటాయి. గర్భం దాల్చడానికి ఒక ఫెలోపియన్‌ ట్యూబ్‌ సరిపోతుంది. కానీ అరుదుగా కొందర్లో రెండవ ఫెలోపియన్‌ ట్యూబుకు సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి. రెండవ ట్యూబు దెబ్బతిన్నా, దాన్లో ఏవైనా సమస్యలున్నా, పునరుత్పత్తి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు గర్భం దాల్చడం కోసం ఐవి్‌ఫను ఎంచుకోవలసి ఉంటుంది. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఫెలోపియన్‌ ట్యూబులు దెబ్బతినకుండా చూసుకోవాలి. అందుకోసం ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీని లక్షణాల ఆధారంగా ప్రారంభ దశలోనే గుర్తించాలి. ఒకసారి ఈ సమస్య బారిన పడిన వాళ్లకు తర్వాతి ప్రెగ్నెన్సీ కూడా ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీగా ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ పరిస్థితిని ఎదుర్కొన్న మహిళలు ప్రతి ప్రెగ్నెన్సీకీ వైద్యులను సంప్రతించి, అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి.

లక్షణాలు ఇలా...

  • నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపా దడపా స్రావం కనిపిస్తూ ఉండడం

  • పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి

  • బలహీనత, కళ్లు తిరగడం

  • గర్భధారణ అసౌకర్యంగా ఉండడం

dke.jpg

-డాక్టర్‌ ప్రత్యూష రెడ్డి,

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-09-26T10:59:20+05:30 IST