Karnataka election: ఓటింగ్‌కు 2 రోజుల ముందు కర్ణాటక కాంగ్రెస్‌కు అనూహ్య మద్ధతు... బీజేపీ అస్సలు ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2023-05-07T12:39:04+05:30 IST

కర్ణాటక పోలింగ్‌కు (Karnataka election) సమయం దగ్గరపడింది. సోమవారంతో ప్రచారం ముగిసిపోనుంది. దీంతో చివరి రెండు రోజులైన ఆది, సోమవారాల్లో ప్రచారం హోరెత్తబోతోంది.

Karnataka election: ఓటింగ్‌కు 2 రోజుల ముందు కర్ణాటక కాంగ్రెస్‌కు అనూహ్య మద్ధతు... బీజేపీ అస్సలు ఊహించని విధంగా..

బెంగళూరు: కర్ణాటక పోలింగ్‌కు (Karnataka election) సమయం దగ్గరపడింది. సోమవారంతో ప్రచారం ముగిసిపోనుంది. దీంతో చివరి రెండు రోజులైన ఆది, సోమవారాల్లో ప్రచారం హోరెత్తబోతోంది. ప్రధాన పోటీదారులైన బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన జాతీయ స్థాయి నేతలు సైతం విస్తృతంగా పర్యటించబోతున్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా తోపాటు రాష్ట్ర స్థాయి నేతలు హోరాహోరీగా ప్రచారం సాగించబోతున్నారు.

కాగా పోలింగ్‌కు సరిగ్గా 2 రోజుల ముందు కర్ణాటక కాంగ్రెస్‌కు (Congress party) అనూహ్య మద్ధతు లభించింది. కర్ణాటక వీరశైవ లింగాయత్ ఫోరం (Karnataka Veerashaiva Lingayat forum) కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని లింగాయత్ వర్గ ప్రజలను కోరుతూ ఈ ఫోరం అధికారికంగా ఒక లేఖను విడుదల చేసింది. నిజానికి కర్ణాటకలో బీజేపీ (BJP), ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ (Congress), జేడీఎస్‌లు (JDS) అభివృద్ధి, ఇతర సమస్యలు, వివాదాలపై పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ.. రాజకీయంగా లింగాయత్ వర్గం, వారి ఓట్ల కోసం ఆయా పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వ్యూహాలను కూడా అనుసరిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ప్రచారపర్వాన్ని కొనసాగించాయి. దీంతో కర్ణాటక వీరశైవ లింగాయత్ ఫోరం విడుదల చేసిన లేఖ అత్యంత ఆసక్తికరంగా మారింది.

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో గెలుపునకు కుల సమీకరణాలు అత్యంత కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా లింగాయత్ యోగులు (Lingayat seers), వారి ఆశీర్వాదాలు ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటాయి. లింగాయత్‌లు కాషాయ పార్టీవైపు మొగ్గుచూపుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు మద్ధతు తెలిపాలంటూ కర్ణాటక వీరశైవ లింగాయత్ ఫోరం విడుదల చేసిన లేఖ బీజేపీకి కాస్త ఆందోళన కలిగించడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాన్ని బీజేపీ అస్సలు ఊహించకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కిట్టుర్ కర్ణాటక (ముంబై కర్ణాటక), కల్యాణ కర్ణాటక (హైదరాబాద్ కర్ణాటక) లతో కూడిన ఉత్తర కర్ణాటకలోని మొత్తం 13 జిల్లాల్లో 90 అసెంబ్లీ సీట్లు వరకు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా బీజేపీ 52 సీట్లు, కాంగ్రెస్ 32, జేడీఎస్ 6 చొప్పున సీట్లు గెలుచుకున్నాయి. లింగాయత్‌లు అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఈసారి ఎన్నికల్లో చాలా కీలకం కాబోతున్నాయి. ఈ వర్గానికి చెందినవారు ఈసారి ఎక్కువగా కాంగ్రెస్‌లో చేరడంతోపాటు ప్రస్తుతం ఆ వర్గానికి చెందిన కీలక ఫోరం లేఖ విడుదల చేయడం అత్యంత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌కు మైలేజీ గ్యారంటీ అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-05-07T21:27:32+05:30 IST