Education: గురుకులాల్లో ఐదో క్లాసు సీట్లు ఏమయ్యాయి?

ABN , First Publish Date - 2023-08-16T11:17:18+05:30 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడ తమ పిల్లలను చేర్పించడం తల్లిదండ్రులకు గగనమవుతోంది. అడ్మిషన్‌ కోసం వెళితే ‘మా వద్ద సీట్లున్నాయి. కానీ, పై అధికారులు చెబితేనే ఇస్తాం’ అని

Education: గురుకులాల్లో ఐదో క్లాసు సీట్లు ఏమయ్యాయి?

గురుకులాల్లో ప్రవేశాల భర్తీ పరంగా తీవ్ర గందరగోళం

ఉన్నతాధికారులు చెబితేనే ఇస్తామంటున్న నిర్వాహకులు

అక్కడికి వెళ్లినా నిరాశే..

ప్రవేశాలకు సంబంధించి మొదటి, రెండో జాబితా విడుదల

విద్యాసంవత్సరం మొదలై 2 నెలలు.. మూడో జాబితా ఏదీ?

అయినా ప్రవేశాలన్నీ పూర్తయ్యాయంటూ ఫ్లెక్సీ ఏర్పాటు

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడ తమ పిల్లలను చేర్పించడం తల్లిదండ్రులకు గగనమవుతోంది. అడ్మిషన్‌ కోసం వెళితే ‘మా వద్ద సీట్లున్నాయి. కానీ, పై అధికారులు చెబితేనే ఇస్తాం’ అని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. ఉన్నతాధికారులను కలిసేందుకు వ్యయ ప్రయాసలకు ఓర్చి హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయం (డీఎ్‌సఎస్‌ భవన్‌)కు వెళితే అక్కడా నిరాశే ఎదురవుతోంది. ‘మా దగ్గరా సీట్లు లేవు’ అని ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో సీట్లు ఎవరికి ఇస్తున్నట్లు? ఇవ్వకపోతే ఆ సీట్లన్నీ ఏమైనట్లు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల పరంగా అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మైనారిటీ మినహా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఎస్సీ గురుకులం నోడల్‌ ఏజేన్సీగా వ్యవహరిస్తూ ఏటా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తూ వస్తోంది. ఎంపిక కోసం ప్రవేశపరీక్ష నిర్వహించినా ఉత్తీర్ణత సాధించిన వారి వివరాల జాబితాను ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా అకడమిక్‌ ఇయర్‌ మొదలై నెలలు గడుస్తుంటంతో గురుకులాల్లో ప్రవేశం కల్పించాలంటూ విద్యార్ధులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. పిల్లలను వెంటబెట్టుకొని దగ్గర్లోని గురుకులాలకు వెళ్లిన తల్లిదండ్రులకు అధికారుల తీరుతో తీవ్ర నిరాశ తప్పడం లేదు. పైగా అధికారులు రోజూ కార్యాలయంలోనే ఉంటున్నా.. ఐదో తరగత ప్రవేశాల కోసం పిల్లలను చేర్పించేందుకు వచ్చే తల్లిదండ్రులను వారు మాట్లాడేందుకు ఇష్టపడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

bee.jpg

ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులు ఎక్కువగా ఉండటానికి తోడు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఒకసారి ఐదో తరగతిలో ప్రవేశం లభిస్తే..ఇక పదో తరగతి వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతోనే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2023-24 విద్యా ఏడాదికిగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో కలిపి మొత్తం 48,200 పైగా సీట్లలో ప్రవేశాలకు ఎస్సీ గురుకులం ప్రవేశ పరీక్ష నిర్వహించింది. దాదాపు 1.10లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అయితే ఉత్తీర్ణులైన పిల్లల జాబితాను పూర్తిస్థాయిలో అధికకారులు ఇప్పటిదాకా ప్రకటించలేదు. కేవలం మొదటి, రెం డో విడత జాబితాలను మాత్రమే ప్రకటించారు. 2 విడతల్లోనూ ఎంతమంది ప్రవేశం పొందారు? ఎంతమంది పొందలేదు? అనే విషయాలను ఇప్పటిదాకా వెల్లడించలేదు. ప్రవేశాలకు సంబంధించి మూడో జాబితాను ఇప్పటిదాకా విడుదలే చేయలేదు. జూన్‌ 12న విద్యాసంవత్సరం ప్రారంభమైంది ఇప్పటికి రెండు నెలలు పూర్తయినా ఐదో తరగతి ప్రవేశాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయకపోవడమేంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఎస్సీ గురుకులం మూడో విడత జాబితా ప్రకటించకముందే ఐదో తరగతి ప్రవేశాలు పూర్తయ్యాయంటూ అక్కడ అధికారులు ఒక ఫ్లెక్సీను ఉంచారు. దీంతో ప్రవేశాల జాబితా ప్రక్రియ పూర్తికాకపోముందే సీట్లు ఎలా అయిపోతాయని విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

బ్యాక్‌ లాగ్‌ సీట్ల భర్తీలోనూ జాప్యమే

ఇక 6 నుంచి 10వ తరగతుల్లో ఉన్న బ్యాక్‌ లాగ్‌ సీట్ల భర్తీలోనూ జాప్యమే రాజ్యమేలుతోంది. ఐదో తరగతిలో ప్రవేశాల పరంగా నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఎస్సీ గురకులం సీట్ల భర్తీ ప్రక్రియలో జాప్యం చేస్తుండటంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్షలను తమకు తామే నిర్వహించుకోవాలని ఎస్టీ, బీసీ గురుకులాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఎస్సీ గురుకులానికి చెప్పినట్టు సమాచారం.

Updated Date - 2023-08-16T11:27:05+05:30 IST