Education: ఆర్భాటంగా వైద్య కళాశాలలు ప్రారంభం.. కానీ సౌకర్యాలు మాత్రం..!
ABN , First Publish Date - 2023-10-02T12:00:49+05:30 IST
జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్నది సర్కారు లక్ష్యం. వచ్చే ఏడాదే మరో 8 కాలేజీలు ప్రారంభిస్తాం. ఏటా 10 వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది’’ గత నెల 15న తొమ్మిది మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా
రాష్ట్రంలోని సర్కారీ వైద్య కళాశాలల్లో సౌకర్యాలు కరువు
ఆర్భాటంగా 17 కొత్త కాలేజీల ప్రారంభం
రేకుల షెడ్లలో కొనసాగుతున్న తరగతులు
మార్కెట్ ఆఫీసులు, గోదాముల్లో హాస్టళ్లు
అద్దె భవనాల్లో అరకొర వసతులతో సరి
ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చేందుకు లేని ల్యాబ్‌లు
అన్ని కాలేజీల్లోనూ వైద్య అధ్యాపకుల కొరత
ఎన్‌ఎంసీ తనిఖీల సమయంలోనే హడావుడి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ‘‘జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్నది సర్కారు లక్ష్యం. వచ్చే ఏడాదే మరో 8 కాలేజీలు ప్రారంభిస్తాం. ఏటా 10 వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది’’ గత నెల 15న తొమ్మిది మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. అయితే ప్రభుత్వ లక్ష్యం గొప్పదే అయినా కాలేజీల్లో తగిన సౌకర్యాలు కల్పించకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా.. ప్రభుత్వం దానిని పూర్తిగా విస్మరించింది. ఓవైపు తరగతులు ప్రారంభమైనా.. బోధనకు తగినంత మంది అధ్యాపకులు లేరు. విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందేందుకు ల్యాబ్‌లూ అందుబాటులోకి రాలేదు. తరగతుల నిర్వహణకు సరైన భవనాలు లేవు. విద్యార్థులు ఉండేందుకు తగిన హాస్టళ్లు లేవు. దీంతో అరకొర వసతులు, సౌకర్యాల నడుమ తమ చదువు సాగేదెలా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, రామగుండంలో వైద్య కళాశాలలను ప్రారంభించగా, ఈ ఏడాది ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగామ, సిరిసిల్ల, నిర్మల్, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వంద చొప్పున సీట్లతో కాలేజీలను ప్రారంభించారు. అయితే వీటిలో ఒకటి, రెండు మినహా ఏ కాలేజీలోనూ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయలేదు.
నిర్మాణం కొనసాగుతుండగానే..
కామారెడ్డిలో మెడికల్ కళాశాల భవనం పూర్తి కాకపోవడంతో మాతాశిశు సంరక్షణ కేంద్రం కోసం నిర్మించిన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గత ఏడాది తరగతులు ప్రారంభం కాగా, ఇప్పటికీ భవనాల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. నర్సింగ్ కళాశాలల కోసం నిర్మించిన భవనాల్లో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రభుత్వ క్షయ, ఛాతి ఆస్పత్రిని ఆధునీకరించి మెడికల్ కాలేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం మెడికల్ కళాశాలను పాత కలెక్టరేట్ భవనంలో కొనసాగిస్తున్నారు. క్యాంపస్ పరిసరాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. కొత్తగూడెం మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ కోసం పది కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్లలోనూ రూ.39 కోట్లతో భవన నిర్మాణం చేపట్టినా.. ఇంకా పనులు పూర్తి కాలేదు. అరకొర వసతుల మధ్యే తరగతులు కొనసాగుతున్నాయి. రామగుండంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలకు సింగరేణి నిధులు సమకూరుస్తోంది. భవనం పనులు ఇంకా పూర్తి కాకపోయినా.. ల్యాబ్, గ్రంథాలయం, ఆడిటోరియం, తరగతి గదులను అందుబాటులోకి తెచ్చారు. కరీంనగర్‌లో కొన్ని గదుల నిర్మాణం పూర్తి చేసి, తరగతులు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లిలో భవన నిర్మాణం ఇంకా టెండర్ల దశలోనే ఉండడంతో గణపురం మండలంలోని చెల్పూరు వద్ద నిర్మిస్తున్న ఆస్పత్రి భవనంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనగామలో భవన నిర్మాణానికి టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. దీంతో చంపక్‌హిల్స్ వద్ద అనాటమీ ల్యాబ్‌ల కోసం నాలుగు రేకుల షెడ్లను నిర్మించారు. ఇందులో రెండు షెడ్లలో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు.
అరకొర వసతుల మధ్య హాస్టళ్లు
కొత్త మెడికల్ కాలేజీల హాస్టళ్లను చాలా చోట్ల అద్దె భవనాలు, అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేశారు. వనపర్తిలో బాలికల హాస్టల్ కోసం ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. అబ్బాయిలకు స్థానిక గురుకుల హాస్టల్‌లో హాస్టల్ వసతి కల్పించారు. గత ఏడాది 150 మంది విద్యార్థులకు వసతి కల్పించిన చోటే.. ఈ ఏడాది 300 మంది ఉండాల్సి వస్తోంది. సంగారెడ్డిలోనూ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొత్తగూడెంలో అయితే మెడికోలు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు. కాలేజీ ప్రాంగణంలో బాల, బాలికల కోసం వేర్వేరుగా వసతి గృహాలు నిర్మించేందుకు గత ఏడాది శ్రీకారం చుట్టినా నిధుల లేమితో పనులు ఆగిపోయాయి. ఇక్కడి మెడికల్ కాలేజీ నుంచి జనరల్ ఆస్పత్రికి వెళ్లాలంటే విద్యార్థులు పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. నిర్మల్‌లోనూ ప్రైవేటు భవనాల్లోనే హాస్టల్ వసతి కల్పించారు. ఆసిఫాబాద్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని హాస్టల్‌గా మార్చి విద్యార్థినులకు వసతి కల్పిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పాత కార్యాలయాలను బాలుర హాస్టల్‌గా వినియోగిస్తున్నారు. జగిత్యాలలో స్థానిక నర్సింగ్ కళాశాలలో బాలికలకు, పురాణీపేటలోని ఓ అద్దె భవనంలో బాలురకు వసతి గృహాలు ఏర్పాటు చేశారు. భూపాలపల్లిలో సింగరేణి రామప్ప క్వార్టర్స్‌లో వసతి ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయగా, హాస్టళ్లు అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ పట్టణంలో ఉన్నాయి. సిరిసిల్ల మెడికల్ కాలేజీ విద్యార్థులకు వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో వసతి ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో బాలుర కోసం ఆర్టీసీ వర్క్‌షాప్ సమీపంలోని కాలనీలో, బాలికల కోసం తీగలగుట్టపల్లిలోని ప్రైవేట్ భవనాల్లో వసతి కల్పించారు. మంచిర్యాలలో బాలికలకు ప్రైవేట్ భవనంలో వసతి ఏర్పాటు చేయగా, కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఇక, బాలురకు ఎలాంటి సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో.. స్థానికంగా ఉన్న హాస్టళ్లు, హోటళ్లను ఆశ్రయిస్తున్నారు.
వేధిస్తున్న అధ్యాపకుల కొరత..
కొత్త మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాధారణంగా ఒక్కో విభాగానికి ఒక హెచ్‌వోడీ, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. కానీ, కొత్త కాలేజీల్లో 60శాతం వరకూ, పాత కాలేజీల్లో 40 శాతానికిపైగా అధ్యాపకుల కొరత ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్ మెడికల్ కళాశాలకు 650కి పైగా పోస్టులు మంజూరయ్యాయి. ఇక్కడ ప్రిన్సిపాల్‌తో కలిపి ఆరుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 31 మంది సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్‌లో ఇద్దరు ఏవోలు, ఇద్దరు ఆఫీస్ సూపరింటెండెంట్లు ఉన్నారు. పలు విభాగాల్లో సిబ్బంది కొరత ఉంది. ఆసిఫాబాద్ వైద్య కళాశాలకు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి సుమారు 400 మంది ఉండాలి. కానీ, అక్కడ 12 మంది అధ్యాపకులు ఉండగా, 40 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. జగిత్యాలలో 64 మంది అధ్యాపకులు ఉండగా, బోధనేతర సిబ్బంది 49 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక మంచిర్యాలలో 43 మంది, కామారెడ్డిలో 47 మంది, నిర్మల్‌లో 30 మంది, వనపర్తిలో 73 మంది, నాగర్‌కర్నూల్‌లో 35మంది, సంగారెడ్డిలో 122 మంది అధ్యాపకులు ఉన్నారు. వనపర్తి మెడికల్ కాలేజీలో 40 మంది ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా.. 16 మంది, కొత్తగా రిక్రూట్‌మెంట్‌కు వెళ్లినా.. నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్టుల్లో సగం మంది కూడా ఉద్యోగాల్లో చేరని పరిస్థితులు ఉన్నాయి. గత ఏడాది డిసెంబరు 6న మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు 1440 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 1060 మంది ఎంపికయ్యారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వగా.. కేవలం 625 మందే విధుల్లో చేరారు. కొన్ని విభాగాల్లో సగం దరఖాస్తులు కూడా రాలేదు. వైద్య విద్య అధ్యాపకుల ప్రైవేటు ప్రాక్టీస్ చేయొద్దంటూ జీవో జారీ చేయడంతో.. సర్కారీ కొలువుల్లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.
గోదాములు, రేకుల షెడ్లే కాలేజీలుగా..
జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చే వీలుంటుంది. కానీ, ఇంత పెద్ద సంఖ్యలో కాలేజీలు ఏర్పాటు చేసేటప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాలేజీ ఏర్పాటు చేయాలనుకున్న చోట రెండేళ్లు ముందుగానే అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ, వైద్య విద్య ఉన్నతాఽధికారులు కనీస వసతులు కూడా లేనిచోట్ల ఈ కాలేజీలను ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఉన్నపళంగా కాలేజీల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం సవాలుగా మారింది. పలు చోట్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయాలు, గోదాములు, రేకుల షెడ్‌లనే రెనొవేషన్ చేసి మెడికల్ కాలేజీలుగా మార్చారు. జగిత్యాలలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములను రెనొవేషన్ చేసి అందులో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా అంకుశాపూర్‌లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనం పూర్తి కాకున్నా.. అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాలలో వ్యవసాయ మార్కెట్ కోసం వినియోగించిన రేకుల గోదామును మరమ్మతు చేసి వినియోగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గత ఏడాదే తరగతులు ప్రారంభమైనా, భవనం ఇంకా పూర్తి కాలేదు. దీంతో నర్సింగ్ కళాశాల భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రాక్టికల్ ల్యాబ్‌లు ఏవీ?
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తప్పనిసరిగా బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ ల్యాబ్‌లు ఉండాలి. కానీ, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఎక్కడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదు. ఇందుకు సంబంఽధించిన కనీస ఎక్వి్‌పమెంట్‌ను కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పుడిప్పుడే వైద్యశాఖ ఆ చర్యలు తీసుకుంటోంది. నిజానికి జాతీయ వైద్య కమిషన్ నిబంధనల మేరకు తరగతులు ప్రారంభమయ్యే నాటికే అవన్నీ అందుబాటులో ఉండాలి. కానీ, గత ఏడాది ప్రారంభమైన ఎనిమిది కాలేజీల్లో సెకండియర్ విద్యార్థులకు అవసరమయ్యే మైక్రోబయాలజీ, ఫాథాలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ ల్యాబ్‌లను ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. వైద్య విద్య ఉన్నతాధికారుల ప్రణాళిక లోపం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీనియర్ అధ్యాపకులు చెబుతున్నారు. నిధుల కొరత వల్ల కూడా సకాలంలో అన్నింటిని సమకూర్చుకునే పరిస్థితి లేదని అంటున్నారు. ఇక ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీకి వస్తున్నాయంటే ఉన్నతాధికారులు చివరి నిమిషంలో ఎక్వి్‌పమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, నిర్మాణాలకు టెండర్లను పిలిచినట్లు చూపించడం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి.