TSPSC paper leak: ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నా అన్ని మార్కులు ఎలా వచ్చాయో విశ్లేషిస్తే తేలిందిదీ!

ABN , First Publish Date - 2023-03-31T11:20:22+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC paper leak)లో.. సిట్‌ దర్యాప్తులో తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు ఏకంగా మాస్టర్‌ ప్రశ్నపత్రాలనే లీక్‌ చేసినట్లు

TSPSC paper leak: ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నా అన్ని మార్కులు ఎలా వచ్చాయో విశ్లేషిస్తే తేలిందిదీ!
TSPSC paper leak

మాస్టర్‌ ప్రశ్నపత్రమే లీక్‌

నిందితుల దగ్గర మాస్టర్ ప్రశ్నపత్రం

జవాబులతో పాటే ప్రశ్నపత్రాల లీకేజీ..

షమీమ్ ఇంట్లో కీలక సమాచారం లభ్యం

ఎల్‌బీనగర్, సైదాబాద్, ఉప్పల్‌లో సిట్ అధికారుల సోదాలు

ఎంత మంది ప్రశ్నపత్రాలను షేర్ చేశారు? ప్రవీణ్, రాజశేఖర్‌లకు ఎంత ఇచ్చారు?

షమీమ్, రమేశ్, సురేశ్‌లకు సిట్ ప్రశ్నలు.. మరో ముగ్గురు నిందితుల కస్టడికీ పిటిషన్

విచారణ నేటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC paper leak)లో.. సిట్‌ దర్యాప్తులో తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు ఏకంగా మాస్టర్‌ ప్రశ్నపత్రాలనే లీక్‌ చేసినట్లు సిట్‌ గురువారం నిగ్గుతేల్చింది. టీఎస్‌పీఎస్సీ ఈ సారి ప్రశ్నపత్రాల రూపకల్పనలో సిరీస్‌ (ఏ, బీ, సీ, డీ) పద్ధతిని త్యజించి, జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేసింది. దేశంలో ఈ తరహాలో జబ్లింగ్‌ పద్ధతిలో ప్రశ్నపత్రాన్ని రూపొందించడం ఇదే మొదటిసారి. ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అంటే.. మాస్టర్‌ ప్రశ్నపత్రం మాత్రం టీఎస్‌పీఎస్సీ దగ్గర ఉంటుంది. అభ్యర్థులకు పరీక్షల్లో అందేపత్రాల్లో ప్రశ్నలు జంబ్లింగ్‌ పద్ధతిలో ఉంటాయి. గతంలో కీ విడుదలలో ఏ, బీ, సీ, డీ సిరీస్‌ వారీగా సమాధానాలను పేర్కొనేవారు. ఈ సారి జంబ్లింగ్‌ పద్ధతి కావడంతో.. మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని, మాస్టర్‌ కీని మాత్రమే అప్‌లోడ్‌ చేశారు. అభ్యర్థులు ఆయా ప్రశ్నలు తమకు వచ్చిన ప్రశ్నపత్రంలో ఎక్కడున్నాయో వెతుక్కుని మాత్రమే.. స్కోరును తెలుసుకోవాల్సి వచ్చింది. ఇక సమాధానాల విషయంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో మాత్రం ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లను కూడా జంబ్లింగ్‌ చేశారు. అంటే.. ఒక అభ్యర్థి ప్రశ్నపత్రంలో ఒకటో నంబర్‌ ప్రశ్న, అతని పక్కన ఉండే అభ్యర్థికి 104వ నంబర్‌ ప్రశ్నగా వస్తుంది. సమాధానాలు కూడా ఆ ప్రశ్నకు మొదటి అభ్యర్థి ప్రశ్నపత్రంలో ‘ఏ’ సమాధానం అయితే.. రెండో అభ్యర్థి ప్రశ్నపత్రంలో ‘సీ’ అనే ఆప్షన్‌ సరైనది ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ అధికారులు ఇంత పకడ్బందీగా వ్యవహరించినా.. సమాధానాలతో కూడిన మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని రూపొందించడంతో మొదటికే మోసం వచ్చినట్లు సిట్‌ అంచనాకు వచ్చింది.

ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నా..

గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం (TSPSC) అత్యంత కఠినంగా ఉంది. ఎంతలా అంటే.. బడా కోచింగ్‌ సెంటర్లు సైతం ఆ ప్రశ్నపత్రానికి పూర్తిస్థాయిలో కీ రూపొందించడానికి కనీసం వారం రోజుల సమయం పట్టింది. చాలా ప్రశ్నలకు ‘‘టీఎస్‌పీఎస్సీ కీ వచ్చాకే అసలైన సమాధానాన్ని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశాయి. బడా కోచింగ్‌ సెంటర్లకే అంత సమయం పడితే.. పరీక్షకు వారం రోజుల ముందు ప్రవీణ్‌ లీక్‌ చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మాస్టర్‌ ప్రశ్నపత్రం పొందిన తోటి టీఎ్‌సపీఎస్సీ ఉద్యోగులు 100కు పైగా మార్కులను ఎలా సాధించగలిగారు? అన్న ప్రశ్నకు సిట్‌ సమాధానాన్ని కనుగొంది. ప్రవీణ్‌ లీక్‌ చేసిన మాస్టర్‌ ప్రశ్నపత్రంలోనే సమాధానాలున్నాయని గుర్తించింది. అందుకే.. ప్రవీణ్‌, సురేశ్‌, రమేశ్‌, షమీమ్‌లాంటివారు 100కు పైగా మార్కులను సాధించారని నిర్ధారించింది. సాధారణంగా మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని, దాని కీని వేర్వేరుగా ఎన్‌క్రి్‌ప్ట చేసిన డాక్యుమెంట్లలో పొందుపర్చాల్సి ఉండగా.. టీఎస్‌పీఎస్సీ మాస్టర్‌ ప్రశ్నపత్రంలోనే కీని కూడా పేర్కొన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

షమీమ్‌ ఇంట్లో సోదాలతో..

ఈ కేసులో పదో ముద్దాయిగా ఉన్న షమీమ్‌తోపాటు.. సురేశ్‌(ఏ11), రమేశ్‌(ఏ12)ను సిట్‌ ఐదు రోజుల కస్టడీకి తీసుకుని, విచారిస్తున్న విషయం తెలిసిందే..! ప్రవీణ్‌, రాజశేఖర్‌తో వీరికి ఎప్పటి నుంచి పరిచయాలున్నాయి? వారిద్దరూ పేపర్‌ను లీక్‌ చేసిన విషయం ఎలా తెలిసింది? అనే కోణంలో ఈ ముగ్గురినీ ప్రశ్నించింది. ప్రవీణ్‌, రాజశేఖర్‌కు డబ్బులేమైనా ఇచ్చారా? ఇతరులతో ప్రశ్నపత్రాలను షేర్‌ చేసుకున్నారా? అనే విషయాలపై ముగ్గురినీ వేర్వేరుగా, కలిపి విచారించింది. అదే సమయంలో సిట్‌కు చెందిన వేర్వేరు బృందాలు ఏకకాలంలో ఈ ముగ్గురి ఇళ్లలో సోదాలు జరిపాయి. ఎల్‌బీనగర్‌లోని గుంటి జంగయ్య కాలనీలో.. షమీమ్‌ ఉండే అపార్ట్‌మెంట్‌, సైబరాబాద్‌ నాగులమ్మ టెంపుల్‌ సమీపంలోని సురేశ్‌ ఇల్లు, ఉప్పల్‌ హునమాసాయినగర్‌లోని రమేశ్‌ ఇంట్లో ఈ సోదాలు కొనసాగాయి. షమీమ్‌ ఇంట్లో మాస్టర్‌ప్రశ్నపత్రం దొరికినట్లు సిట్‌ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఇదే అంశంపై సిట్‌ అధికారులు షమీమ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘వారం రోజుల్లో ఆ ప్రశ్నలకు ఎలా ప్రిపేర్‌ అయ్యారు? ఏదైనా కోచింగ్‌ సెంటర్‌ ఫ్యాకల్టీల సహాయం తీసుకున్నారా??’’ అని సిట్‌ ప్రశ్నించగా.. షమీమ్‌ అసలు విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. ‘‘మా చేతికి చిక్కింది మాస్టర్‌ ప్రశ్నపత్రం. సమాధానాలు అందులోనే ఉన్నాయి’’ అని వివరించినట్లు సమాచారం. అటు రమేశ్‌, సురేశ్‌ ఇళ్లలో కూడా మాస్టర్‌ ప్రశ్నపత్రం నకళ్లు దొరికినట్లు తెలిసింది.

ఏఈ ప్రశ్నపత్రాన్ని ఎందరికి అమ్మారు?

ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల ద్వారా ఏఈ ప్రశ్నపత్రాన్ని రూ.10లక్షలకు కొనుగోలు చేసిన రేణుక, ఆమె భర్త డాక్యానాయక్‌, తమ్ముడు రాజేశ్వర్‌లు ప్రశ్నపత్రాన్ని అంగట్లో సరుకులా అమ్మేశారని సిట్‌ నిర్ధారించింది. డాక్యానాయక్‌, రాజేశ్వర్‌ ద్వారా ఏఈ మాస్టర్‌ ప్రశ్నపత్రం చాలా మందికి చేరినట్లు సిట్‌ భావిస్తోంది.

కస్టడీ పిటిషన్‌ నేటికి వాయిదా..

ఏఈ ప్రశ్నపత్రం లీకేజీలో అరెస్టయిన ప్రశాంత్‌రెడ్డి, తిరుపతయ్య, రాజేందర్‌లను వారంపాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన నాంపల్లి కోర్టు.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2023-03-31T11:20:22+05:30 IST