AP DSC: కొత్త నోటిఫికేషన్‌పై విద్యాశాఖ మంత్రి నీళ్లు చల్లారా?

ABN , First Publish Date - 2023-03-21T13:28:44+05:30 IST

శాసనమండలిలో సోమవారం విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న

AP DSC: కొత్త నోటిఫికేషన్‌పై విద్యాశాఖ మంత్రి నీళ్లు చల్లారా?
విద్యాశాఖ మంత్రి

ఉపాధ్యాయ ఖాళీలు 717 మాత్రమే!

మండలిలో మంత్రి బొత్స ప్రకటన

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల ఆగ్రహం

50,670 టీచర్‌ పోస్టులు ఖాళీ అని కేంద్రం పార్లమెంటులో చెప్పింది

వీటిలో ఏది వాస్తవం?

అడిగిన ప్రశ్నలేంటి.. మీ జవాబులేంటి?

మీ సమాధానానికి 10కి 2 మార్కులే

విఠపు బాలసుబ్రహ్మణ్యం చురకలు

మంత్రి లెక్కలపై లక్ష్మణరావు, సాబ్జీ ఆక్షేపణ

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో సోమవారం విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు 717 మాత్రమేనని మంత్రి చేసిన ప్రకటనపై వారు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో 50,670 టీచర్‌ పోస్టులు (Teacher posts) ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంటులో చెప్పారని గుర్తుచేశారు. ఈ రెండింటిలో ఏది వాస్తవమో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీ (DSC) కొత్త నోటిఫికేషన్‌పై ప్రశ్నకు బొత్స సమాధానమిచ్చారు. దేశంలోనే అత్యధికంగా ఉపాధ్యాయులున్న రాష్ట్రం ఏపీయేనన్నారు. ‘2019లో డీఎస్సీ ద్వారా 14219 పోస్టులను భర్తీ చేశాం. 2018, 1998లో నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించిన వారికి నియామకాలు ఇస్తున్నాం. ఇంకా 717 మాత్రమే ఖాళీలున్నాయి. డీఎస్సీ ఇవ్వాలనే ఆలోచన ఉంది.. పరిశీలిస్తున్నాం.. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం’ అని చెప్పారు. దీనిపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తీవ్రంగా స్పందించారు. కొత్త డీఎస్సీ ఇస్తారో లేదో స్పష్టం చేయకుండా.. ఎప్పుడో చేసిన నియామకాల గురించి ఇప్పుడు చెప్పడం ఏమిటని నిలదీశారు. ‘అడిగిన ప్రశ్న, మీరు చెప్పిన సమాధానం రెండూ ఫొటోలు తీసి మా వాట్సాప్‌ గ్రూపుల్లో పెడతాం. సభలో ఇలాంటి సమాధానాలు కూడా చెబుతారా అని ఉపాధ్యాయులు ఆశ్చర్యపోతారు. ఇదే ప్రశ్నకు మంత్రి చెప్పిందే ఎవరైనా విద్యార్థి జవాబుగా రాస్తే నేను 10కి రెండు మార్కుల కంటే ఇవ్వను. రాష్ట్రంలో నాలుగేళ్ల నుంచి ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని ఉన్నాయి.. కొత్త డీఎస్సీ ఎప్పుడు ప్రకటిస్తారో స్పష్టంగా చెప్పాలి’ అని గట్టిగా అడిగారు. జగన్‌ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆక్షేపించారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50,670 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంటులో చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. అయితే ఇవన్నీ కరోనాకు ముందు లెక్కలని, అప్‌డేట్‌ చేయకముందువంటూ బొత్స చెప్పుకొచ్చారు.సమావేశాలు ముగిశాక కమిటీ వేస్తామని.. దానికి వారిని ఆహ్వానిస్తామన్నారు.

మండలిలో 3 బిల్లులకు ఆమోదం..

శాసనమండలిలో బుధవారం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్‌ డాటెడ్‌ ల్యాండ్స్‌(అప్‌డేషన్‌ ఇన్‌ రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌)(ఎమెండ్‌మెంట్‌) బిల్లు- 2023, ఆంధ్రప్రదేశ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌ బుక్స్‌(ఎమిడిమెంట్‌) బిల్లు-2023, ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రా ఏరియా) ఇనామ్స్‌(ఎబాలిటేషన్‌ అండ్‌ కన్వర్షన్‌ ఇంటూ రైత్వారీ)(ఎమిండ్‌మెంట్‌)-2023 బిల్లులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. సమగ్ర భూ సర్వేపై లఘు చర్చ ముగిశాక చైర్మన్‌ మోషేన్‌రాజు సభను గురువారానికి వాయిదా వేశారు.

Updated Date - 2023-03-21T13:28:44+05:30 IST