Worksite Schools: వలస పిల్లలకు ‘వర్క్‌సైట్‌’ స్కూళ్లు

ABN , First Publish Date - 2023-01-08T16:36:31+05:30 IST

నగరాల్లో నిర్మాణరంగం విస్తరిస్తుంటే... దానితో పాటే వలస కూలీలు పెరగడం సాధారణమే. పొట్టకూటి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు సరే... వారి పిల్లల సంగతేంటీ? వారి

Worksite Schools: వలస పిల్లలకు ‘వర్క్‌సైట్‌’ స్కూళ్లు
వలస పిల్లలకు అండగా..

నగరాల్లో నిర్మాణరంగం విస్తరిస్తుంటే... దానితో పాటే వలస కూలీలు పెరగడం సాధారణమే. పొట్టకూటి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు సరే... వారి పిల్లల సంగతేంటీ? వారి చదువు మాటేమిటి? భాష సమస్య పిల్లల చదువుకు పెద్ద ఆటంకంగా మారుతుంది. దాంతో వారంతా పాఠశాలకు దూరమవుతున్నారు. గత్యంతరం లేక బాల కార్మికులుగా మారుతున్నారు. అయితే అలాంటి వారి జీవితాల్లో వెలుగు నింపే ఒక ప్రయత్నం జరుగుతోంది. అదే ‘వర్క్‌సైట్‌ స్కూల్స్‌’ కాన్సెప్ట్‌ (Worksite Schools). హైదరాబాద్‌ (Hyderabad)లోని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ (Rachakonda Police Commissioner) (ప్రస్తుతం ఏడీజీ) చేసిన ఈ ప్రయత్నం అద్భుత ఫలితాలనిస్తోంది.

ఆ విశేషాలే ఇవి...

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లక్షలాది మంది కార్మికులు వారి కుటుంబాలతో కనిపిస్తుం టారు. వారి పిల్లలు చదువు లేక బాల కార్మికులుగా మారుతున్నారు. పాఠశాలకు వెళ్లి పలకా బలపం పట్టాల్సిన చిట్టి చేతులు... వెట్టి చాకిరి చేసి కమిలిపోతున్నాయి.

17.gif

ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌తో వెలుగులోకి...

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి... 14 ఏళ్లలోపు పనిలో చేరిన చిన్నారులను గుర్తించి, బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ ఏడాది జనవరి, జూలై నెలలో ‘ఆపరేషన్‌ స్మైల్‌’ (Operation Smile), ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ (Operation Muskan) కార్యక్రమాల్ని పోలీస్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం రాచకొండ పరిధిలోని ఇటుక బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మొదటి రోజు నిర్వహించిన దాడిలో 182 మంది చిన్నారులు ఇటుక బట్టీల్లో మగ్గిపోవడం గుర్తించారు. తల్లిదండ్రులతో వారి పిల్లలు బాల కార్మికులుగా పని చేస్తూ బతుకులీడుస్తున్నారు. ఈ విషయం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) మహేష్‌ ఎం.భగవత్‌ (Mahesh M. Bhagwat) దృష్టికి వెళ్లింది. స్వయంగా రంగంలోకి దిగిన సీపీ మరో ప్రాంతంలో కూడా తనిఖీలు నిర్వహించగా అక్కడి ఇటుక బట్టీల్లో మరో 172 మంది పిల్లలు పని చేస్తున్నట్లు గుర్తిం చారు. దాంతో చిన్నారులతో పని చేయిస్తున్న ఇటుక బట్టీల యాజ మాన్యాలపై కేసులు నమోదు చేశారు. వలస వచ్చిన కార్మికుల పిల్లల భద్రతకు భరోసా కల్పించాలని బలంగా సంకల్పించారు. వారిని ఎలాగైనా విద్యావంతులను చేయాలని నిర్ణయించుకున్నారు. అలా సీపీ సంకల్పం లోంచి పుట్టిన ఆలోచనే ‘వర్క్‌సైట్‌ స్కూల్స్‌’.

16.gif

పని ప్రదేశంలోనే పాఠశాల...

హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్‌ పరిధి దేశంలోనే అతి పెద్దది. దీని పరిధిలో అనేక అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వలస వస్తున్నవారు ఎక్కడెక్కడ ఉన్నారు? ఎంతమంది చిన్నారులు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు? అనే డేటా కలెక్ట్‌ చేశారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో కార్మికుల పిల్లలను పనిలో పెట్టుకున్న యాజమాన్యాలతో సీపీ మహేష్‌ ఎం.భగవత్‌ సమావేశం ఏర్పాటు చేశారు. వారికి అవగాహన కల్పించారు. ‘పిల్లలతో వలస వచ్చిన తల్లిదండ్రులు వారిని ఒంటరిగా వదిలేసి పనులు చేయడం కష్టమే. కాబట్టి పని ప్రదేశంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని, అందుకు యజమానులంతా సహకరించాల’ని ఆయన కోరారు. ‘వర్క్‌సైట్‌ స్కూల్స్‌’ ప్రతి పాదనను వారి ముందు ఉంచారు. ఆ విధంగా ఈ కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు. దానికి అవసరమైన నిధులు ఆయా ఫ్యాక్టరీలు, కంపెనీలు సమకూర్చాయి.

14.gif

‘ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌’ సహకారంతో...

రాచకొండ సీపీ ఆలోచనను ముందుకు నడిపించడానికి ‘ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌’ అనే స్వచ్చంద సంస్థ ముందుకొచ్చింది. ముందుగా వర్క్‌సైట్‌ స్కూళ్లలో పిల్లలను చేర్పించారు. వలస వచ్చిన కార్మికుల్లో ఎక్కువ మంది ఒడిశా రాష్ట్రానికి చెందిన వారే కావడంతో పిల్లలకు విద్యాబోధన కోసం ఆ రాష్ట్రం నుంచి విద్యా వలంటీర్లను రప్పించారు. ఇలా దేశం లోనే ఎక్కడా లేని విధంగా రాచకొండపరిధిలో ‘వర్క్‌సైట్‌ స్కూళ్లు’ ప్రారంభమయ్యాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ప్రభుత్వంతో మాట్లాడి వర్క్‌సైట్‌ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందించారు. వలస కార్మికులకు ఆహార భద్రతను కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఒక్క రూపాయికి కిలో బియ్యం పిల్లల కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా వారిలో భరోసా నింపారు. 2016లో మొదలైన ఈ ‘వర్క్‌సైట్‌ స్కూళ్ల’ను గత ఆరేళ్లుగా నిరంతరాయంగా కొన సాగిస్తూ వేల మంది పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌ను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

dgp.gif

వలస పిల్లల బాధ్యత మనదే...

‘‘ ప్రతీ ఏటా నవంబర్‌లో వందలాది మంది వలస కార్మికులు ఇటుక బట్టీల్లో పనిచేయడానికి ఒడిశా నుంచి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాలకు వస్తుంటారు. వారు మరుసటి ఏడాది జూన్‌ వరకు ఉండి వెళ్లిపోతుంటారు. వారి సౌలభ్యం మేరకు ‘వర్క్‌సైట్‌ స్కూల్స్‌’ను నవంబర్‌ నుంచి జూన్‌ వరకు నిర్వహిస్తున్నాం. పిల్లలు తిరిగి వెళ్లేటప్పుడు ‘ఎయిడ్‌ ఎట్‌ యాక్షన్‌’ సంస్థ సభ్యులు వారిని ఒడిశాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి హాస్టల్‌ వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ విద్యను అభ్యసించిన చిన్నారులకు ఒడిశాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడి కలెకర్లతో మాట్లాడుతున్నాం.’’

- మహేష్‌ ఎం.భగవత్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌

- శ్రీనివాస్‌ చింత,

క్రైమ్‌ రిపోర్టర్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-01-08T16:49:26+05:30 IST

Read more