Group-1 Mains: 2030 నాటికి ఐరాస సూచించిన లక్ష్యమేంటి?

ABN , First Publish Date - 2023-03-15T15:25:35+05:30 IST

2030 నాటికి ప్రపంచ దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి ఆశయాలను ఐక్యరాజ్యసమితి 2015లో నిర్దేశించింది. అందులో ఎనిమిదో ఆశయం ఈ విధంగా

Group-1 Mains: 2030 నాటికి ఐరాస సూచించిన లక్ష్యమేంటి?
ఐరాస సూచించిన లక్ష్యమేంటి?

నిరుద్యోగం

2030 నాటికి ప్రపంచ దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి ఆశయాలను ఐక్యరాజ్యసమితి 2015లో నిర్దేశించింది. అందులో ఎనిమిదో ఆశయం ఈ విధంగా ఉంది. ‘స్థిరమైన, సమ్మిళిత, కొనసాగించగల ఆర్థికవృద్ధిని, హుందాతనం, ఉత్పాదకతతో కూడిన సంపూర్ణ ఉద్యోగితను ప్రపంచ దేశాలు 2030 సంవత్సరం నాటికి సాధించాలి’.

ప్రచంచ దేశాల అభివృద్ధికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఆశయాల్లోని ఎనిమిదోది పూర్తిగా ఉపాధి లేదా నిరుద్యోగానికి సంబంధించినది. ఈ ఆశయ సాధన కోసం 12 లక్ష్యాలను నిర్దేశించారు. అవి..

 • జాతీయ పరిస్థితులను అనుసరించి దేశాల తలసరి ఆదాయంలో స్థిరమైన పెరుగుదలను సాధించాలి. ప్రత్యేకించి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో కనీసం 7 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయాలి.

 • వైవిద్య ఆర్థిక కార్యకలాపాల ద్వారా, సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నతి, నవకల్పనల ద్వారా ఎక్కువ అదనపు విలువను సృష్టించే ఉత్పాదకతను పెంపొందించాలి. శ్రమ సాంద్రత ఉండే రంగాలను ప్రోత్సహించాలి.

 • ఉత్పాదకత, హుందాతనంతో కూడిన ఉద్యోగిత, ఉద్యమదారిత్వం, సృజనాత్మకత, నవకల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల పటిస్టత, వృద్ధి, పరపతి అందుబాటు కోసం పటిష్టమైన అభివృద్ధి విధానాల రూపకల్పన.

 • పర్యావరణానికి కలుగుతున్న హానిని తగ్గిస్తూ వినియోగం, ఉత్పత్తికి సంబంధించిన వనరుల సామర్థ్యాన్ని పెంచుతూ పది సంవత్సరాల ఫ్రేమ్‌వర్క్‌తో సుస్థిర వినియోగ, ఉత్పత్తి కార్యక్రమాల రూపకల్పన జరగాలి. అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయంలో చొరవ చూపాలి.

 • 2030 నాటికి స్త్రీలు, పురుషులు(యువతీ, యువకులు సహా), దివ్యాంగులు అందరికీ సమాన వేతనం, హుందాతనం, ఉత్పాదకతతో కూడిన ఉద్యోగితను కల్పించాలి.

 • 2020 నాటికే విద్య, శిక్షణ, ఉపాధి రంగాల్లో లేని యువత సంఖ్య(శాతం)ను భారీగా తగ్గించాలి.

 • నిర్బంధ శ్రమ(ఫోర్స్‌డ్‌ లేబర్‌)ను, ఆధునిక కట్టు బానిసత్వాన్ని, మనుషుల అమ్మకాన్ని, బాలకార్మిక వ్యవస్థను, బాల సైనిక వ్యవస్థను నిర్మూలించే సత్వర, ప్రభావిత చర్యలు చేపట్టాలి. 2025 నాటికి అన్నిరకాల బాలకార్మిక వ్యవస్థలు లేకుండా చేయాలి.

 • వలస కార్మికులు ప్రత్యేకించి మహిళా వలస కార్మికులు సహా అందరి హక్కులకు రక్షణ కల్పించాలి. సురక్షితమైన ఉపాధి వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి.

 • స్థానిక సంస్కృతిని, ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ సుస్థిరమైన పర్యాటకరంగం ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించే విధానాల రూపకల్పన, అమలు జరగాలి.

 • బ్యాంకింగ్‌, బీమా, ఇతర ద్రవ్య సేవలు అందరికీ అందేవిధంగా దేశీయ ద్రవ్య సంస్థల సామర్థ్యాన్ని పెంచాలి.

 • అభివృద్ధిలో వెనుకబడిన దేశాలకు వాణిజ్యపరమైన సహాయం ప్రత్యేకించి సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్‌తో వాణిజ్య సంబంధిత సాంకేతిక సహాయాన్ని అందించాలి.

 • 2020 నాటికే యువతకు ఉపాధి కల్పించే విశ్వవ్యాప్త వ్యూహాన్ని అభివృద్ధి పరిచి, అమలుచేయాలి. ప్రపంచ కార్మికసంస్థ ‘విశ్వవ్యాప్త ఉద్యోగాల కల్పన ఒప్పందం’ను అమలు చేయాలి.

 • పై లక్ష్యాలను 2015లోనే నిర్దేశించినప్పటికీ అందులో కొన్ని 2020 నాటికే సాధించాల్సిన లక్ష్యాలు కూడా ఉన్నప్పటికీ ప్రపంచంలో నిరుద్యోగం 2019 సంవత్సరంలో 5.4 శాతం, 2020లో 6.6 శాతం, 2021లో 6.2 శాతంగా ఉంది. 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్ల బాల కార్మికులు పనిచేస్తున్నారు.

 • ప్రపంచ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 1990 సంవత్సరం కంటే ముందు 5 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

 • 2021లో భారత్‌లో నిరుద్యోగం 6 శాతం ఉండగా తక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో 5.5 శాతంగా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో 4.2 శాతం, దక్షిణాసియాలో 5.8 శాతంగా ఉంది.

 • సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) ప్రకారం 2023 ఫిబ్రవరి 18న భారతదేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉంది. ఇది పట్టణాల్లో 8.1 శాతం, గ్రామాల్లో 7.7 శాతంగా ఉంది.

 • అయితే నిరుద్యోగం, నిరుద్యోగ శాతం అవగాహన కావడానికి కింది భావనలను అర్థం చేసుకోవడం అవసరం.

నిరుద్యోగం: పనిచేయగల సామర్థ్యం ఉండి, పనిచేయాలనే ఆసక్తి ఉండి ప్రతిఫలంతో కూ డిన పని దొరకని స్థితిని నిరుద్యోగం అం టారు. అంటే పనిచేయగల స్థోమత లేని చిన్నపిల్లలు, ముసలివారు గానీ పనిచేయాలనే ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ వారిని శ్రామికశక్తిగా, నిరుద్యోగులుగా గుర్తించడం జరగదు.

 • అదేవిధంగా పనిచేయగల సామర్థ్యమున్నప్పటికీ అమలులో ఉన్న వేతనం లేదా పని పరిస్థితులు, హోదా నచ్చక పనిచేయడానికి ఆసక్తి చూపనివారిని కూడా నిరుద్యోగులుగా గుర్తించరు.

నిరుద్యోగ శాతాన్ని చూసేప్పుడు కింది భావనలను అర్థం చేసుకోవాలి.

1. శ్రామిక జనాభా రేటు: మొత్తం జనాభాలో పనిచేస్తున్న లేదా పనిచేయడానికి అందుబాటులో ఉన్నవారి శాతం.

2. కార్మిక జనాభా రేటు: మొత్తం జనాభాలో ఉపాధి పొందుతున్న/ ఉద్యోగంలో ఉన్నవారి శాతం.

3. నిరుద్యోగం రేటు: మొత్తం శ్రామిక జనాభాలో నిరుద్యోగుల శాతం.

జాతీయ గణాంకాల కార్యాలయం 2017లో కాలపరిమితి శ్రామిక జనాభా సర్వే చేయడం ఆరంభించింది.

 • అందులో భాగంగా 2017 జూలై నుంచి 2018 జూన్‌ వరకు మొదటి రౌండ్‌, 2018 జూలై నుంచి 2019 జూన్‌ వరకు రెండో రౌండ్‌, 2019 జూలై నుంచి 2020 జూన్‌ వరకు మూడో రౌండ్‌, 2020 జూలై నుంచి 2021 జూన్‌ వరకు నాలుగో రౌండ్‌ శ్రామిక జనాభా సర్వేను నిర్వహించారు. నాలుగో రౌండ్‌ సర్వే ఆధారిత నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం అంచనాలు కిందివిధంగా ఉన్నాయి.

శ్రామిక జనాభా రేటు: దేశం మొత్తంలో శ్రామిక జనాభా రేటు 2020-21లో 41.6 శాతం, 2019-20లో 40.1 శాతం, 2018-10లో 37.5 శాతం, 2017-18లో 36.9 శాతంగా ఉంది.

 • పురుషుల్లో తీసుకున్నప్పుడు శ్రామిక జనాభా రేటు 2020-21లో 57.5 శాతం, 2019-20లో 56.8 శాతం, 2018-19లో 55.6 శాతం, 2017-18లో 55.5 శాతంగా ఉంది.

 • స్త్రీలల్లో తీసుకున్నప్పుడు 2020-21లో 25.1 శాతం, 2019-20లో 22.8 శాతం, 2018-19లో 18.6 శాతం, 2017-18లో 17.5 శాతంగా ఉంది.

కార్మిక జనాభా రేటు: 2020-21లో దేశంలో కార్మిక జనాభా రేటు 39.8 శాతం, 2019-20లో 38.2 శాతం, 2018-19లో 35.3 శాతం, 2017-18లో 34.7 శాతంగా ఉంది.

 • పురుషుల్లో తీసుకున్నప్పుడు 2020-21లో 54.9 శాతం, 2019-20లో 53.9 శాతం, 2018-19లో 52.3 శాతం, 2017-18లో 52.1 శాతం ఉంది.

 • స్త్రీలల్లో తీసుకున్నప్పుడు 2020-21లో 24.2 శాతం, 2019-20లో 21.8 శాతం, 2018-19లో 17.6 శాతం, 2017-18లో 16.5 శాతం ఉంది.

నిరుద్యోగ రేటు: దేశంలో నిరుద్యోగ రేటు (సాధారణ ప్రధానరంగం, సాధారణ అనుబంధ రంగం కలిపి) 2020-21లో 4.2 శాతం, 2019-20లో 4.8 శాతం, 2018-19లో 5.8 శాతం, 2017-18లో 6.1 శాతం ఉంది.

 • పురుషుల్లో తీసుకున్నప్పుడు 2020-21లో నిరుద్యోగ రేటు 4.5 శాతం, 2019-20లో 5.1 శాతం, 2018-19లో 6 శాతం, 2017-18లో 6.2 శాతంగా ఉంది.

 • స్త్రీలల్లో తీసుకున్నప్పుడు నిరుద్యోగ రేటు 2020-21లో 3.5 శాతం, 2019-20లో 4.2 శాతం, 2018-19లో 5.2 శాతం, 2017-18లో 5.7 శాతంగా ఉంది.

 • గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 2020-21లో 3.3 శాతం, 2019-20లో 4.0 శాతం, 2018-19లో 5.0 శాతం, 2017-18లో 5.3 శాతంగా ఉంది.

 • పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 2020-21లో 6.7 శాతం, 2019-20లో 7.0 శాతం, 2018-19లో 7.7 శాతం, 2017-18లో 7.8 శాతంగా ఉంది.

నిరుద్యోగం అంచనాల పద్ధతి

భారతదేశంలో నిరుద్యోగాన్ని కిందివిధంగా అంచనా వేస్తారు. నిపుణుల కమి టీ సూచనల మేరకు 1973లో జరిగిన 27వ రౌండ్‌ జాతీయ శాంపిల్‌ సర్వే ప్రామాణిక వ్యక్తి సంవత్సరం(స్టాండర్డ్‌ పర్సన్‌ ఇయర్‌)ను, మూడురకాల నిరుద్యోగ అంచనా పద్ధతులను నిర్వచించింది. ఒక సంవత్సర కాలంలో కనీసం 273 రోజులు, రోజుకు కనీసం ఎనిమిది గంటలు ఉపాధి పొందినపక్షంలో దానిని స్టాండర్డ్‌ పర్సన్‌ ఇయర్‌గా గుర్తించారు. కిందివిధంగా మూడు నిరుద్యోగ అంచనా పద్ధతులను అనుసరించారు.

1. సాధారణ స్థితి నిరుద్యోగం: సర్వే చేయదల్చుకున్న సంవత్సరం(365 రోజులు)లో పని దొరకని వ్యక్తులను నిరుద్యోగులుగా గుర్తిస్తారు. దీనినే బహిరంగ నిరుద్యోగం(ఓపెన్‌ అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌) అని, తీవ్రమైన నిరుద్యోగం (క్రానిక్‌ అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌) అని కూడా అంటారు. దీనిని సాధారణ ప్రధాన రంగ నిరుద్యోగం అని, సాధారణ అనుబంధ రంగ నిరుద్యోగం అని కూడా అంచనా వేస్తారు.

2. వారం వారి స్థితి నిరుద్యోగం: సర్వే చేస్తున్న వారంలో ఒకరోజు కూడా పని దొరకని వారిని ఈ నిరుద్యోగులుగా పరిగణిస్తారు.

3. రోజువారీ స్థితి నిరుద్యోగం: ఈ పద్ధతిలో సర్వే చేస్తున్న వారం రోజుల్లో ప్రతి రోజును పరిగణనలోకి తీసుకుంటారు. ఒకరోజు నాలుగు కంటే తక్కువ, కనీసం గంట పని దొరికినా సగం దినం(హాఫ్‌ డే) పని దొరికినట్లుగా లేదా రోజులో నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని దొరికితే ఒకరోజు పని దొరకనట్లు పరిగణిస్తారు. ఇలా కూడా పని దొరకని దినాలను నిరుద్యోగ దినాలుగా లెక్కిస్తారు.

SSSE.jpg

-డా.ఎం.ఏ.మాలిక్‌,

అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్‌పల్లి, హైదరాబాద్‌.

Updated Date - 2023-03-15T15:29:04+05:30 IST