Telangana Tet Special: తెలుగు పాఠ్యపుస్తకాల్లోని కవుల గురించి..

ABN , First Publish Date - 2023-09-07T16:32:43+05:30 IST

భావకవిత్వానికి పేరు పొందిన ఈ కవి గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించాడు. 1892-1984 మధ్య కాలానికి చెందిన

Telangana Tet Special: తెలుగు పాఠ్యపుస్తకాల్లోని కవుల గురించి..

రాయప్రోలు సుబ్బారావు

భావకవిత్వానికి పేరు పొందిన ఈ కవి గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించాడు. 1892-1984 మధ్య కాలానికి చెందిన ఈయన తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. రమ్యాలోకం, మాధురీ దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా కన్పిస్తాయి.

గుర్రం జాషువా

గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించిన జుషువా 1895-1971 మధ్య కాలానికి చెందినవాడు. ‘మాతలకు మాత సకల సంపత్సమేత’ అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన గుర్రం జాషువా... గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్‌ మహల్‌, నేతాజి, బాపూజీ, క్రీస్తుచరిత్ర, నాకథ, స్వప్న కథ, ఖండకావ్యాలు, కొత్త లోకము మొదలైన రచనలు చేశాడు. అణువణువున తెలుగుదనం గుబాళింపజేసిన జాషువా రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్లకు కట్టినట్లుంటాయి. కవికోకిల, కవితావిశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్‌, నవయుగకవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు.

శిరశినహల్‌ కృష్ణమాచార్యులు

1905-1992 మధ్య కాలానికి చెందిన ఈ కవి నిజామాబాద్‌ జిల్లా ‘మోర్తాడ్‌’లో జన్మించి, జగిత్యాల జిల్లా కోరుట్లలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరుపొందాడు. ఈయన గాంధీతాత శతకం, కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం అనే రచనలతోపాటు ‘రత్నమాల’ అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు పొందాడు.

సుద్దాల హనుమంతు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు 1910-1982 మధ్య కాలానికి చెందినవాడు. తల్లి లక్ష్మీనరసమ్మ. తండ్రి బుచ్చిరాములు. రెండో ఫారం వరకు చదువుకున్న హనుమంతు హేతువాదిగా పేరుపొందాడు. వ్యవసాయశాఖలో గుమస్తాగా పనిచేసి, కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టలదొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి.

డా.వానమామలై వరదాచార్యులు

1912-1984 మధ్య కాలానికి చెందిన డాక్టర్‌ వానమామలై వరదాచార్యులు 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు. ఈయన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తివైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయేకొమ్మ, రైతుబిడ్ద(బుర్రకథల సంపుటి) మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

ఆచ్చి వేంకటాచార్యులు

రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన ఈ కవిశిఖామణి నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం, అవునూరు గ్రామంలో జన్మించాడు. 1914-1985 మధ్య కాలానికి చెందిన ఈయన అండాళ్‌ బుర్రకథ, రాగమాల, మా ఊరు(ఏకాశ్వాస ప్రబంధం) అనే రచనలు చేశాడు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.

డా.పల్లా దుర్గయ్య

హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించిన డా.పల్లా దుర్గయ్య తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి. 1914-1983 మధ్య కాలానికి చెందిన ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ‘16వ శతాబ్ది యందలి ప్రబంధ వాజ్మయం - తద్వికాసం’ అనే అంశంపైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది.

పొట్లపల్లి రామారావు

హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించిన పొట్లపల్లి రామారావు 1917-2001 మధ్య కాలానికి చెందినవాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం(ఖండికలు), పగ మున్నగు రచనలు చేశాడు. ఈయన రచించిన ‘జైలు’ కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది. ఈయన రచన వాడుక భాషలో, సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో ఉంటుంది.

గడిగె భీమకవి

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించిన గడిగె భీమకవి 1920-2010 మధ్య కాలానికి చెందినవాడు. వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అబ్బడం విశేషం. ఈయన రచించిన వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళశైలిలో సుబోధకంగా ఉంటాయి.

దాశరథి కృష్ణమాచార్య

మహబూబాబాద్‌ జిల్లా చిన్న గూడూరులో జన్మించిన ధాశరథి 1925-1987 మధ్య కాలానికి చెందినవాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబునకగ్గిపెట్టెద’ అన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనలు తదితర కవితా సంపుటాలను, నవమి(నాటికలు), యాత్రాస్మృతి(స్వీయచరిత్ర) అనే గ్రంథాలు రచించాడు. సినీగేయ కవిగా ఆణిముత్యాలు వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి. తెలుగులో గజల్‌ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్‌ గజళ్లను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూకవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. ఈయన 1967లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందారు. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్యాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోను, ప్రాచీన పద్యశైలితోను ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి.

-స్తంభంకాడి గంగాధర్‌

తెలుగు ఉపాధ్యాయులు

Updated Date - 2023-09-07T16:32:43+05:30 IST