TSPSC Speciall: అశోకుడికి ‘మస్కి’ శాసనంలో ఉన్న బిరుదులేంటి?

ABN , First Publish Date - 2023-02-18T14:48:14+05:30 IST

అశోకుడి పట్టాభిషేకం అయిన తొమ్మిదేళ్లకు కళింగ యుద్ధం జరిగినట్లు శాసనాల్లో ఉంది. క్రీ.పూ 260లో అశోకుడు సామ్రాజ్య కాంక్షతో

TSPSC Speciall: అశోకుడికి ‘మస్కి’ శాసనంలో ఉన్న బిరుదులేంటి?
మౌర్యుల సొంతం!

సువిశాల సామ్రాజ్యం.. మౌర్యుల సొంతం!

టీఎస్‌పీఎస్సీ/పోలీస్‌ పరీక్షల ప్రత్యేకం/ ఇండియన్‌ హిస్టరీ

నందుల రాక్షస పాలన నుంచి ప్రజలకు మౌర్యులు విముక్తి కల్పించారు. అంతేకాదు వాయువ్య ప్రాంతాల్లోని విదేశీయులను అంతం చేశారు. పాటలీపుత్రం కేంద్రంగా రాజధానిని నెలకొల్పి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. సువ్యవస్థీకృత పాలన విధానానికి పునాదులు వేశారు.

మెగస్తనీస్‌ (Megasthenes) ‘ఇండికా’, టాలమీ- జాగ్రఫీ, జస్టిన్‌- ఎపిటస్‌, ప్లుటార్క్‌ - ద లైవ్స్‌, ప్లిని- నేచురల్‌ హిస్టరీ, చాణక్యు(కౌటిల్యుడు)ని అర్థశాస్త్రం మొదలైన రచనలు మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. మౌర్యుల కాలంలోని పన్నులు, శిక్షల గురించి కౌటిల్యుడు తన గ్రంథంలో రాశాడు. దీనిని ఆంగ్లంలోకి శ్యామశాస్త్రి అనువదించాడు. కౌటిల్యుడు ఈ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. కానీ, ఇది ఎంతవరకు నిజమని పాశ్చాత్య చరిత్రకారుల్లో సందేహాలు ఉన్నాయి. క్రీ.పూ.322లో సంస్కృత భాష కాని, లిపి కాని రాలేదు. కేవలం అశోకుని కాలంలోనే శాసనాల్లో బ్రాహ్మి లిపి, ప్రాకృత భాషలు ఉపయోగించారు. ఆ తరవాతే సంస్కృతం వచ్చింది. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశ స్థాపకుడు. ఇతని కుమారుడు, బిందుసారుడు. తరవాత అశోకుడు రాజ్యానికి వచ్చాడు. చంద్రగుప్త మౌర్యుడు తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా వాయువ్య భారతంలో ఉన్న అలెగ్జాండర్‌ సేనాని ‘సెల్యూకస్‌ నికేటర్‌’ని ఓడించాడు. తరవాత అతని కుమార్తె ‘హెల్లిన్‌స’ను వివాహం చేసుకుని భారత - గ్రీకు దేశాల మధ్య వైవాహిక సంబంధాలతో మైత్రిని కొనసాగించాడు. ఈ వివాహ ప్రతిఫలంగా చంద్రగుప్త మౌర్యకు సెల్యూకస్‌ నికేటర్‌ అరకోషియా (కాందహార్‌), పరోపనిషద్‌ (కాబూల్‌), గెడోసియా(బలూచిస్థాన్‌), ఏరియా(హీరట్‌) లేదా అఫ్ఘనిస్థాన్‌ - ఇరాన్‌ దేశాల సరిహద్దు గల ప్రాంతం ఇచ్చాడు. చంద్రగుప్త మౌర్యుడు తన గురువు అయిన భద్రబాహు ప్రేరణతో జైనమతంలోని ‘దిగంబర’ శాఖను స్వీకరించినట్లు ‘పరిశిష్ఠ పర్వన్‌’ గ్రంథంలో పేర్కొన్నారు. జైనమతం స్వీకరణ అనంతరం పాటలీపుత్రంలో తొలి జైనపరిషత్‌ను నిర్వహించి, మైసూర్‌లోని చంద్రగిరి పర్వతంపై సల్లేఖన వ్రతం ఆచరించి మరణించినట్లు తెలిసింది.

బిందుసారుడు: ఇతను చంద్రగుప్త మౌర్యుని కుమారుడు. ఇతనికి సింహసేనుడు, అమిత్ర ఘాత, శతృ సంహారకుడు అనే బిరుదులున్నాయి. సిరియారాజు మొదటి ఆంటియోక్‌సతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. బిందుసారుడు రెండు సముద్రాల మధ్య ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. తన చివరి పాలన కాలంలో తక్షశిలలో పెద్ద సైనిక తిరుగుబాటు జరిగింది. దీనిని యువరాజైన అశోకుడు అత్యంత పాశవికంగా అణచివేశాడు. చివరి బిందుసారుడు ‘అజీవక’ మతం స్వీకరించి, బిహార్‌లోని నాగార్జున గుహలో మరణించాడు.

అశోకుడు: ఇతను బిందుసారుని కుమారుడు. అశోకుడి పట్టాభిషేకం అయిన తొమ్మిదేళ్లకు కళింగ యుద్ధం జరిగినట్లు శాసనాల్లో ఉంది. క్రీ.పూ 260లో అశోకుడు సామ్రాజ్య కాంక్షతో కళింగ (నేటి ఒడిషా)పై దండయాత్ర చేశాడు. దీని వివరాలు ‘థౌలి’ శాసనంలో ఉన్నాయి. థౌలి నేటి భువనేశ్వర్‌ పట్టణానికి సమీపంలో ఉంది. కళింగ యుద్ధం జరిగిన 10 సంవత్సరాలకు పాటలీపుత్రంలో బౌద్ధ సమావేశాన్ని అశోకుడు ఏర్పాటు చేశాడు. అశోకుడికి ‘దేవానాం ప్రియ (దేవతలకు ఇష్టమైనవాడు), ‘ప్రియదాసి (ప్రియమైన రూపం కలిగినవాడు) అనే బిరుదులు ఉన్నట్లు ‘మస్కి’ శాసనంలో ఉంది. ఈ శాసనం కర్ణాటకలో బయల్పడింది.

అశోకుడు (Ashoka) తన పట్టాభిషేకం సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు ఆదేశించాడు. బానిసలు, సేవకులపై కరుణ; తల్లిదండ్రులు, పెద్దలంటే విధేయత; గురువుల పట్ల గౌరవం, స్నేహితులు, బంధువులపై ఔదార్యం; పురోహితులు, భిక్షువుల పట్ల ఆదరణ వంటివి అశోకుడు ప్రభోదించిన ధర్మ సూత్రాలు. 42 సంవత్సరాల పాలన అనంతరం క్రీ.పూ.232లో అశోకుడు మరణించాడు.

అశోకుని గొప్పదనం: భారతదేశంలో తొలిసారిగా శాసనాలు ముద్రించాడు. బ్రాహ్మి లిపి, పాళి భాషల్లో శాసనాలు ఎక్కువగా చెక్కించాడు. ఈ శాసనాలను క్రీ.శ. 1837లో జర్మనీ దేశస్తుడైన జేమ్స్‌ ప్రిన్సెస్‌ చదివాడు. 1842లో ఆంగ్లేయుడైన కెప్టెన్‌ నొర్రీస్‌ ‘ఖరోస్థి’ లిపిలోని శాసనాలను అధ్యయనం చేశాడు. సెభా్‌షఘర్‌, మాన్సారా, భుంతహాల్‌ ప్రాంతాల్లో అశోకుడు శాసనాలు చెక్కించాడు. ‘ధర్మ’ ప్రచారానికి 18 మంది మహా మంత్రులను వివిధ ప్రాంతాలకు పంపించాడు. వారిలో చారులత(నేపాల్‌కు); సంఘమిత్ర, మహేంద్ర(శ్రీలంకకు) ముఖ్యులు. అశోకుడు ఒక పెద్ద శక్తిమంతమైన సైన్యాన్ని కొనసాగిస్తూనే ఆసియా, ఐరోపాలాంటి రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలు విస్తరింపజేశాడు. వీరిలో ఆంటియోకస్‌, తుర్మయా, మాకా లాంటి గొప్ప రాజులు అశోకుడి స్నేహితులు. అశోకుడు బౌద్ధ కార్యకలాపాలకు మార్గదర్శనం చేశాడు. భారతదేశంలో ప్రేరణ కలిగించిన ఆదర్శవంతమైన చక్రవర్తిగా మిగిలిపోయాడు.

మౌర్యుల వాస్తు శిల్పకళ: అశోకుడు సాంచి, సార్‌నాథ్‌, బార్హూత్‌ స్థూపాలు, గుహ దేవాలయాలు నిర్మించాడు. అఫ్ఘనిస్థాన్‌లో సుమారు 84 వేల స్థూపాలను అశోకుడు నిర్మించాడు. వీటికి చునార్‌ గనుల నుంచి రాతిని ఉపయోగించాడు. అశోకుడి మొదటి శాసనంలో ప్రజల నైతికత గురించి, 7వ శాసనంలో పరమత సహనం గురించి రాశాడు. 10వ శాసనంలో పునర్జన్మ సిద్ధాంతం, 13వ శాసనంలో కళింగయుద్ధం గురించి ఉంది. మౌర్యులు సహజంగా శైవ భక్తులు. చంద్రగుప్తు మౌర్యుడు భద్రబాహు గురువు ద్వారా జైనం స్వీకరించాడు. బిందుసారుడు అజీవక మతం స్వీకరించాడు. అశోకుడు బౌద్ధం స్వీకరించినా ‘ధర్మం’ ప్రచారం చేశాడు. అశోకుడిని బౌద్ధ అశోకుడిగా పేర్కొనడం కంటే ధర్మ అశోకుడిగా చెప్పడం సమంజసం.

అశోకుని ధమ్మ విధానం: లౌఖికంగా నాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ సమస్యలకు ఈ విధానంలో పరిష్కారం కన్పిస్తుంది. సామాజిక సమస్యల నేపథ్యంలో వ్యక్తులు అనుసరించాల్సిన మానవతావాదమే అశోకుని ధమ్మ విధానంలోని సారాంశం. దీనిలో ప్రధాన సూత్రాలు దాతృత్వం, సహనం, అహింస, సంక్షేమం. దీని వ్యాప్తి కోసం 18 మంది మహామంత్రులను దేశంలోని వివిధ ప్రాంతాలకు అశోకుడు పంపించాడు.

మౌర్య సామ్రాజ్య పతనం: అశోకుడు స్థాపించిన సువిశాల సామ్రాజ్యాన్ని తదుపరి మౌర్య రాజులు కాపాడలేక పోయారు. కుణాలుడు, సంప్రతి, దశరధుడు, చివరి మౌర్య రాజైన బృహద్రుడు అసమర్థులు కావడంతో సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. బృహద్రుడి సేవకుడే పుష్య మిత్రుడు. తన రాజుపై తిరుగుబాటు చేసి చంపేసి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి ‘శుంగ’ వంశాన్ని స్థాపించాడు.

ఇండో గ్రీకు రాజ్యాల స్థాపన: మౌర్యుల పతనం అనంతరం విదేశీ దండయాత్రలు కొనసాగాయి. గ్రీకు-బాక్ట్రియన్‌ రాజు డెమిట్రియస్‌ విజృంభించి క్రీ.పూ.180లో దక్షిణ అఫ్ఘనిస్థాన్‌, వాయువ్యంలోని కొన్ని ప్రాంతాలను జయించాడు. దీంతో ఇండో - గ్రీకులు ‘ట్రాన్స్‌ - సింధూ’ ప్రాంతాలపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వీరి ఆధ్వర్యంలో బౌద్ధమతం అభివృద్ధి చెందింది.

మౌర్యుల పరిపాలన:

మౌర్యులు తొలిసారిగా పితృరాజ్య పాలనను అందించారు. అశోకుడు తన శాసనంలో ప్రజలందరూ తన పిల్లలు వంటివారు అని పేర్కొనడం గమనించవచ్చు.

రాజ్య విభజన: మౌర్యులు తమ రాజ్యాన్ని ‘ఆహారాలు(రాష్ట్రాలు)’గా విభజించారు. ఇవి..తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి, తోసలి.

మంత్రి మండలి: చక్రవర్తి పరిపాలనలో సహాయ పడటానికి ఒక మంత్రి మండలి ఉండేది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాజ్యం అనే బండికి ‘రాజు-మంత్రి’ రెండు చక్రాల వంటి వారు అని పేర్కొన్నారు.

ఆర్థిక విధానం: భారతదేశంలో రాజకీయ ఐక్యత, సైనిక భద్రత ఒక సాధారణ ఆర్థిక వ్యవస్థకు అవకాశం కలిగించాయి. మౌర్యుల ఆర్థిక సంవత్సరం జూలైలో ప్రారంభమయ్యేది. భూమి శిస్తు 1/4వ వంతు. ఇదే రాజ్యానికి ముఖ్య ఆదాయం. అటవీ సంపదపై ‘హిరణ్య’, ‘భయలు’; భూములై ‘ప్రజ’ అనే పన్నులు ఉండేవి. రాజు ఆధీనంలోని భూములను ‘సీత భూములు’ అనేవారు. వీటి పర్యవేక్షణకు ‘సీతాధ్యక్షులు’ ఉండేవారు. వ్యవసాయ రంగంలో ‘విష్టి’ లేదా ‘సేద్య బానిస’ విధానం ఉండేది. దీని గురించి మెగస్తనీస్‌ తన ‘ఇండికా’ గ్రంథంలో పేర్కొన్నాడు.

పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు అశోకుడు రవాణా మార్గం వేయించాడు. దీనిని తరవాత కాలంలో షేర్షా చక్రవర్తి పునరుద్ధరించి ‘గ్రాండ్‌ ట్రంక్‌’ రోడుగా మార్చాడు. మౌర్య సమాజంలో బానిసలు లేరని, కేవలం సేద్య బానిసలు మాత్రమే ఉండేవారని మెగస్తనీస్‌ పేర్కొన్నాడు. భారతీయులు మద్యపాన ప్రియులని కూడా మెగస్తనీస్‌ రాశాడు. బహు భార్యత్వం, బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలు ఉండేవి. వేశ్య వృత్తి ఉన్నట్లు చరిత్రకారుడు హెలియోడోరస్‌ పేర్కొన్నాడు. దక్షిణ భారతీయులు విహార, ఆహార ప్రియులని కౌటిల్యుడు ప్రస్తావించాడు. జంతువులతో పోరాటాలు, మల్లయుద్ధాలు, ఉత్సవాలు నిర్వహించడం వీరి వినోదాలు.

-డాక్టర్‌ పి. మురళి, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌

Updated Date - 2023-02-18T14:48:14+05:30 IST