TS Exam: సమ్మమ్‌ బోనమ్‌ అంటే ఏమిటి? గురుకుల టీచర్స్‌‌కు ప్రత్యేకం!

ABN , First Publish Date - 2023-05-15T17:39:47+05:30 IST

తెలంగాణ గురుకుల్‌ బోర్డు ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో నిర్ధారించిన సిలబ్‌సలో నైతికత, మానవ విలువలు లేదా ఎథిక్స్‌కి ప్రత్యేకస్థానం ఉంది.

TS Exam: సమ్మమ్‌ బోనమ్‌ అంటే ఏమిటి? గురుకుల టీచర్స్‌‌కు ప్రత్యేకం!
TS Exam

తెలంగాణ గురుకుల్‌ బోర్డు ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో నిర్ధారించిన సిలబ్‌సలో నైతికత, మానవ విలువలు లేదా ఎథిక్స్‌కి ప్రత్యేకస్థానం ఉంది. జూనియర్‌, డిగ్రీ లెక్చరర్లు, టీజీటీ, పీజీటీ, వ్యాయామ విద్యకు సంబంధించిన సిలబ్‌సలో ఎథిక్స్‌ అంతర్భాగం. సమాజ గమనాగమనాలను నిర్ధారించే ఉపాధ్యాయ వృత్తికి నైతిక విలువలు పునాదిగా ఉండాలని స్వాతంత్ర్యానంతర కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తాత్వికుడిగా, రాష్ట్రపతిగా అభిప్రాయపడ్డారు.

1964-66 సంవత్సరాల మధ్య నియమించిన, అలాగే మొదటి జాతీయ విద్యా కమిషన్‌గా పేరొందిన ‘కొఠారి కమిషన్‌’ ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ధారితమవుతుందని పేర్కొంది. 1958లో నియమించిన ప్రకాష్‌ కమిటీ - విద్యకు నైతికతలో ఉన్న సంబంధాన్ని గుర్తించి వివరించింది. తరవాతి కాలంలో నియమించిన సంపూర్ణానంద కమిటీ కూడా భావసమైక్యతకు నైతిక ప్రాతిపదిక ఉండాలని తెలియచేసింది.

ఎథిక్స్‌ అంటే ఏమిటి?

తెలుగుభాషలో నీతిశాస్త్రంగా పిలిచే ఇది ఇంగ్లీ్‌షలో ఎథిక్స్‌ అనే సమానార్ధాన్ని కలిగి ఉంది. ‘ఇథోస్‌’ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. అంతర్గత స్వభావం, శీలం లేదా ఆచారం, అలవాటు అనే ప్రాథమిక అర్ధాలను కలిగి ఉంది. ఈ శాస్త్రానికి సమాన అర్థం ఇచ్చే ‘మోరల్‌ సైన్స్‌’ లాటిన్‌ భాషకు చెందిన ‘మోర్స్‌’ అనే పదం నుంచి గుర్తించారు. దీని అర్థం అంతర్గత స్వభావం, ఆచారాలు, అలవాటు. సాధారణ అర్థంలో వ్యక్తి నడవడికలో లేదా ప్రవర్తనలో మంచి, చెడు భావనలు వివరించే శాస్త్రంగా గుర్తింపును అందుకుంది.

నీతిశాస్త్రం అంతిమలక్ష్యం విలువలతో కూడిన సమాజ నిర్మాణం. ఒక సమాజ హితం కోసం, సమాజంలోని మనుషులు ఏర్పాట్లు చేసుకుని ఆచరించేందుకు ప్రయత్నించే సూత్రాలు విలువలు ఇవి. వాస్తవానికి తత్వశాస్త్రంలోని అంతర్భాగాలు తర్కశాస్త్రం(లాజిక్‌), సౌందర్యశాస్త్రం నీతిశాస్త్రం. ఈ శాస్త్రం ఊహించడం లేదా విశ్లేషించడానికే పరిమితం కాదు. ఆచరణాత్మక ప్రామాణికతలను కూడా నిర్ణయిస్తుంది.

గురుకుల ఉపాధ్యాయ సిలబస్‌ - నీతిశాస్త్రం

సిలబ్‌సలో నిర్ధారించిన మూడు పేపర్లలో మొదటిది జనరల్‌ స్టడీస్‌. దీనిలోని రెండో విభాగంలో టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌తో కలిసి ఎథిక్స్‌ ప్రత్యేకంగా ఉంటుంది. దాదాపు 20 నుంచి 25 ప్రశ్నలకు సంబంధించిన ఈ విభాగంలో ఎథిక్స్‌ నుంచి 5 నుంచి 8 ప్రశ్నలను ఆశించవచ్చు.

ఉన్నత సమాజాన్ని నిర్మించడంలో, నాగరికత ఫలాలను ఒక తరం నుంచి మరో తరానికి అందచేయడంలో, జ్ఞాన సమాజాన్ని విస్తరించడంలో ‘విద్య’ది పునాది పాత్ర. దీనిని ఆచరణాత్మక సంచయం చేయడంలో భూమిక పోషించేది ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే అభ్యర్థులకు సంబంధించిన నైతికత, విలువల ప్రాతిపదికపైన ఆధారపడే వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో భాగంగా ఈ అంశాన్ని పరీక్షల కోసం ఉద్దేశించిన సిలబ్‌సలో చేర్చారు.

వాస్తవంగా బీఎడ్‌ సిలబ్‌సలోనే తత్వశాస్త్రం మొదటి పేపరుగా ఉంటుంది. తత్వశాస్త్రంలో అంతర్భాగంగా నీతిశాస్త్రం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొనే అభ్యర్థులు ఈ శాస్త్ర అధ్యయనాన్ని బీఎడ్‌ ప్రిపరేషన్‌లో భాగంగానే ఆరంభిస్తారు.

నీతిశాస్త్రంలో ఏ అంశాలు ఉంటాయి?

జెఎల్‌, డిఎల్‌, టీజీటీ, పీజీటీ తదితర వృత్తుల కోసం సంసిద్ధమవుతున్న అభ్యర్థులు ఎథిక్స్‌ లేదా నీతిశాస్త్రాన్ని ఒక ప్రత్యేక అంశంగా గుర్తించరు. కేవలం పరీక్ష హాలులో తార్కిక జ్ఞానంతో ఈ శాస్త్ర ప్రశ్నలకు సమాధానం రాయవచ్చనే అవగాహనతో ఉంటారు. వాస్తవానికి నీతిశాస్త్రం నుంచి వచ్చే ప్రశ్నలకు తార్కిక, హేతుబద్ధమైన విచక్షణతో సమాధానాలు రాయవచ్చు. కానీ ఈ శాస్త్ర మౌలిక అంశాలపై అవగాహన ఏర్పాటుచేసుకోవడం ద్వారా సంపూర్ణమైన అవగాహనతో అన్ని ప్రశ్నలకు సమాధానం రాసే అవకాశం ఉంది.

సిలబ్‌సలో ఎథిక్స్‌కు నిర్ధిష్టమైన అంశాలను ప్రస్తావించలేదు. ఎథిక్స్‌ - ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ - టీచింగ్‌ ప్రొఫెషన్‌ ఎథిక్స్‌ అనే విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఎథిక్స్‌ను అధ్యయనం చేయడంలో ఈ కింది అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.

  • నీతిశాస్త్రం - మానవ విలువలు

  • వ్యక్తి - సమాజ సంబంధాలు

  • భారత రాజ్యాంగం నిర్దేశించిన విలువలు

  • జీవన నైపుణ్యాలు

  • వృత్తిపరమైన నైతికత

  • జీవన లక్ష్యాలు - విలువలు - చింతన

  • సామాజిక సమాచార విస్తరణ - నైతికతతో కూడిన నిబద్ధత

  • పై అంశాల్లో వృత్తిపరమైన నైతికతకు ప్రత్యేకత ఉంది.

ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ అవసరం ఏమిటి?

నైతిక విలువలు మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. వృత్తి నిర్వహణలో ఉద్యోగిపై తాను అభ్యసించిన విద్యాప్రభావం, పుట్టుకతో వచ్చిన తెలివితేటలు, పరిసరాల నుంచి ప్రభావితమైన వైఖరి ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణ సాఫీగా జరగడం కోసం వృత్తి ఉద్యోగులు నిర్దేశించిన ప్రవర్తన నియమావళిని అనుసరించాలి. ఈ నియమావళి నైతిక ప్రమాణాలను ప్రాతిపదికగా చేసుకొని నిర్దేశితమవుతుంది. ఉద్యోగులు పాటించాల్సిన వ్యక్తిగత, సంస్థాగత ప్రమాణాలు నిర్దేశించడం కోసం నైతికశాస్త్ర అవగాహన అవసరం. విద్యాపరమైన నైతికత ఒక దేశ నాగరికతను సుసంపన్నం చేసి ఉన్నత విలువల వైపు నడిపిస్తుందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ అభిప్రాయపడ్డారు.

ఎథిక్స్‌ కోసం ఏమి చదవాలి?

అభ్యర్థులు సిలబ్‌సపై అవగాహన కోసం నిర్ధిష్టమైన పుస్తకాల కోసం వెతికే అవసరం లేదు. బీఎడ్‌లో చదివిన విద్యా పునాదులు లేదా తత్వశాస్త్రం భావనలు అధ్యయనం చేయండి. అదేవిధంగా నైతికశాస్త్ర మౌలిక అధ్యయనం కోసం ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరానికి చెందిన పాఠ్యగ్రంథం నైతికత, మానవ విలువలు ఉపయోగపడుతుంది.

నీతిశాస్త్రం అంతిమలక్ష్యం విలువలతో కూడిన సమాజ నిర్మాణం. ఒక సమాజ హితం కోసం, సమాజంలోని మనుషులు ఏర్పాట్లు చేసుకుని ఆచరించేందుకు ప్రయత్నించే సూత్రాలు విలువలు.

నమూనా ప్రశ్నలు

1. రైట్‌ అనే లాటిన్‌ భాషలోని పదానికి అర్థం.

ఎ) నియమబద్ధంగా ఉండటం

బి) హేతుబద్ధంగా ఉండటం

సి) ఉపయోగకారిగా మారడం

డి) పైవన్నీ సరైనవే

2. సమ్మమ్‌ బోనమ్‌ అంటే?

ఎ) సర్వోష్ఠమైన సౌజన్యం బి) వ్యక్తిగత విజయం

సి) ఉన్నత పరిజ్ఞానం డి) పైవన్నీ సరైనవి

3. రాజ్యాంగ లక్ష్యాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.

ఎ) రాజ్యాంగ ప్రవేశిక బి) ప్రాథమిక హక్కులు

సి) ప్రాథమిక విధులు డి) పరిపాలన జాబితాలు

4. తమచుట్టూ ఉన్న సమాజం నుంచి దూరమవుతున్న యువత.

ఎ) ఇంటర్నెట్‌ ప్రభావం బి) విద్య ప్రభావం

సి) కుటుంబ విలువల ప్రభావం

డి) డి) పైవన్నీ సరైనవే

5. మీ దేశం మీకు ఏమి ఇచ్చింది అని కాదు, మీరు మీ దేశానికి ఏమి చేశారో చెప్పండి... అని పేర్కొన్నది.

ఎ) మహాత్మాగాంధీ బి) ఉడ్రో విల్సన్‌

సి) జాన్‌ ఎఫ్‌ కెనడి డి) నేతాజీ

సమాధానాలు: 1) డి 2) ఎ 3) ఎ 4) ఎ 5) సి

-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-05-15T17:41:50+05:30 IST