‘ఉద్యోగాల ఊచకోత’లకు కారణాలేమిటి?

ABN , First Publish Date - 2023-01-29T01:00:00+05:30 IST

ప్రపంచంలో అనేక చోట్ల ఆఫీసులున్న గూగుల్, ఎమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్‌, మెటా – వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేల సంఖ్యలో, ఉద్యోగుల్ని తీసివేస్తున్న వార్తల్ని...

‘ఉద్యోగాల ఊచకోత’లకు కారణాలేమిటి?

ప్రపంచంలో అనేక చోట్ల ఆఫీసులున్న గూగుల్, ఎమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్‌, మెటా – వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేల సంఖ్యలో, ఉద్యోగుల్ని తీసివేస్తున్న వార్తల్ని గత కొన్ని నెలలుగా చూస్తున్నాం, చదువుతున్నాం. మరీ, ముఖ్యంగా ఈ మధ్య, నాలుగైదు రోజులుగా మళ్ళీ ఈ వార్తలు ఎక్కువయ్యాయి. ఈ ఉద్యోగుల్లో దాదాపు అందరూ మేధా శ్రమలు చేసేవారే. వీరు చేసే మేధాశ్రమ, ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినదే. ‘సాఫ్ట్‌వేర్’ అంటే, కొన్ని రకాల కంప్యూటర్ ప్రోగ్రాముల కూడిక అని చెప్పవచ్చును. ‘ప్రోగ్రాం’ అంటే, కంప్యూటర్ల ద్వారా కొన్ని పనులు చేయించడానికి రాసే కొన్ని సూచనల కూడిక. బ్యాంకుల్లో, రైల్వేస్టేషన్లలో, విమానాశ్రయాల్లో, ఫ్యాక్టరీలలో, టీవీల్లో, సినిమాల్లో, ఫోనుల్లో, చిన్నా–పెద్దా వర్తకాల్లో, అనేక రకాల పనిస్తలాల్లో, వాటికి తగ్గ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి ఇవ్వడం సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లోని మేధో శ్రామికులు చేసే పని. (ఆ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించడం వల్ల ఆ పని స్తలాల్లో గతం కంటే, అతి తక్కువ మందితో ఎక్కువ పని జరిగితేనే ఆ సాఫ్ట్‌వేర్‌ని యజమానులు కొంటారు –అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.)

సాఫ్ట్‌వేర్‌ అనేది కూడా ఒక ‘సరుకు’. ఆ సరుకుని సాంకేతిక జ్ఞానంతో (టెక్నాలజీతో) తయారు చేస్తారు కాబట్టి, ఆ ఉద్యోగుల్ని ‘టెకీలు’ అంటూ వుంటారు. ఆ టెకీలని పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లోనించీ తీసివేస్తూ, ఆ కంపెనీ యజమానులు రక రకాల కారణాలు చెపుతున్నారు. 2022లో, వెయ్యి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో 2 లక్షల 30 వేల మందిని ఉద్యోగాల్లో నించీ తీసేశారు. అందుకే, 2022ని ‘పీడకలల సంవత్సరం’ (‘నైట్‌మేరిష్ ఇయర్’) అన్నారు. ఉద్యోగుల్ని తీసెయ్యడానికి యజమానులు చెప్పే కారణాలు కొన్ని ఇప్పుడు ఇలా ఉన్నాయి: కంపెనీల ఆదాయాల్లో (అంటే, లాభాల్లో) పెరుగుదల లేదట! వాళ్ళ సరుకులకి డిమాండు తగ్గిందట! కంపెనీలకు ఖర్చులు ఎక్కువయ్యాయట! కస్టమర్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాల్ని ఆశిస్తున్నారట! కరోనా కాలంలో జనాలు ఇళ్ళకే పరిమితం అయ్యి, సరుకుల్ని ఆన్‌లైన్‌లో తెప్పించుకునే పద్ధతి ఎక్కువవడంతో, ఎక్కువమంది ఉద్యోగుల్ని పెట్టుకున్నారట! ఆ డిమాండు అలాగే కొనసాగుతుందనుకున్నారట! కానీ, ఆ తర్వాత, డిమాండు తగ్గడంతో, ఆన్‌లైన్‌ వ్యాపారం మందగించడం వల్ల, తప్పని సరై అదనంగా వున్న ఉద్యోగుల్ని తీసెయ్యాల్సి వచ్చిందట! బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీలూ అవీ ఎక్కువ అవుతున్నాయట!

పత్రికల్ని ఇలా చదివి అలా పడేస్తే, ‘నిజమే గదా కంపెనీల వారి బాధలు’ అనిపిస్తాయి. అసలు నిజాలు వేరేగా వుంటాయి. అన్ని ఉత్పత్తి శాఖల్లో లాగే, ‘సాఫ్ట్‌వేర్’ రంగంలో కూడా అనేక మంది ప్రైవేటు పెట్టుబడిదారులు (కంపెనీల పేరుతో) ఉంటారు. ఒకరు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి, టెకీలతో ఒక రకం ప్రోగ్రాములు తయారు చేయించి, వాటిని అమ్మి, లాభాలు సంపాదిస్తూ వుంటే, మిగతా పెట్టుబడిదారులు కూడా, ఆ రంగంలోకే దిగుతారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఇవ్వొచ్చు. ఒక్క ఉదాహరణ చూద్దాం. జనాలు తమ డబ్బుని ఇతరులకు పంపడానికి, ఒక కంపెనీ వాడు ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసి, లాభాలు సంపాదిస్తూ వుంటే, ఇంకో పదిమంది బైల్దేరి అదే రకం వ్యాపారంలోకి దిగుతారు. సమాజంలో, అసలు ఏ రకం సాఫ్ట్‌వేర్లు ఎన్ని కావాలి? – అనే సమిష్టి ప్లాను వుండదు. దాంతో, అనేక కంపెనీల వాళ్ళు పోటీలుపడి మరీ, ఎడా పెడా సాఫ్ట్‌వేర్లని తయారుచేయిస్తారు. అది, మార్క్సు మాటల్లో చెప్తే, ‘అమితోత్పత్తి అనే అంటురోగానికి’ దారితీస్తుంది. అమితోత్పత్తిని అమ్ముకోడానికి, వాటిని కొనే కస్టమర్ల కోసం (మార్కెట్ కోసం) వేట సాగుతుంది. సరుకులు తయారు చేయించే పెట్టుబడిదారుల మధ్య సమన్వయం గానీ, ఒక ఉమ్మడి ప్లాను గానీ వుండదు కాబట్టి, మార్కెట్‌లో అమ్మగలిగే దానికన్న ఎన్నో రెట్లలో సరుకులు తయారవుతాయి. అవి అమ్ముడు అయ్యే వరకూ, మళ్ళీ కొత్తగా సరుకుల్ని (సాఫ్ట్‌వేర్లని) తయారు చేయించడం వీలు కాదు. అలాంటప్పుడు సాఫ్ట్‌వేర్‌ తయారీ గతంలో కంటే ఎక్కువ స్తాయిలో అవసరంగా ఉండదు. దాంతో, ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో కొంత భాగాన్నో, చాలా భాగాన్నో పనుల్లోనించీ తీసేస్తారు. (పనుల్లో నించీ తీసివేయడానికి ఇంకో కారణం, సాఫ్ట్‌వేర్ రంగంలోనే, తక్కువ మందితో ఎక్కువ పని చేయించగలిగే సాఫ్ట్‌వేర్లు తయారు కావడం కూడా. సాఫ్ట్‌వేర్‌ రంగంలో వచ్చిన ఈ సంక్షోభం సమాజంలోని ఇతర శాఖలకి కూడా సోకుతుంది. ఆ వివరాలు ఇక్కడ చూడలేము.) అప్పటికే పనులు లేకుండా వున్న నిరుద్యోగ సాఫ్ట్‌వేర్‌ కార్మిక జనాభాలోకి ఈ కొత్త నిరుద్యోగులు కూడా చేరతారు. కంపెనీలో ఇంకా వున్న చాలామంది కార్మికులకు, ఫుల్‌టైం ఉద్యోగాలు, పార్ట్‌టైం ఉద్యోగాలుగా మారతాయి. జీతాలు తగ్గిపోతాయి. వీరు కూడా దాదాపు నిరుద్యోగులతో సమానం అవుతారు. ఫుల్‌టైం పనుల్లో వున్న కార్మికులకు కూడా జీతాలు తగ్గించి వేస్తారు. ‘సరుకు అమ్ముడు పోవడం లేదు కాబట్టి, ఫుల్‌జీతాలు ఇవ్వలేము’ అంటారు. జీతాలు ఎంత తగ్గించినా కార్మికులు దానికే అంగీకరించవలసిన పరిస్తితి ఏర్పడుతుంది. గతంలో ముగ్గురో, నలుగురో పని చేసే ఒక కార్మిక కుటుంబంలో, ఒకరికో ఇద్దరికో పనులు పూర్తిగా పోయి, మిగిలిన వారి జీతాల తోటే అందరూ బతకవలసి వస్తుంది.

ఇక, అందరికీ ఉద్యోగాలు పోయిన కార్మిక కుటుంబాన్ని తీసుకుంటే, దాని సంగతి చెప్పడానికేమీ వుండదు – పస్తులూ, జబ్బులూ, బిచ్చమెత్తడాలూ, దొంగతనాలూ, హత్యలూ, ఆత్మ హత్యలూ తప్ప! (నిలకడగా లేని ఆర్ధిక వ్యవస్త వల్ల, ఉద్యోగ భద్రత లేని కారణంగా, భారత దేశపు నగరాల్లో వారానికి 50 మంది చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నారని 2021 నాటి ప్రభుత్వపు లెక్కలే చెపుతున్నాయి)

ఉద్యోగాల ఊచకోత జరిగే కాలమే, సంక్షోభకాలం! సంక్షోభం అనేది పెట్టుబడిదారీ వర్గానికి – అనుకున్నంత ‘లాభం’ సంపాదించలేని సమస్యగా వుంటే, కార్మికవర్గానికి – ‘జీవితావసర ఉత్పత్తులు’ సంపాదించలేని (జీవించడమే సాధ్యం కాని) సమస్యగా వుంటుంది. వీరు వేరు వేరు వర్గాలు. యజమాని వర్గానికి ‘లాభం’ తగ్గే సమస్య అయితే, శ్రామికవర్గానికి రోజూ తిండి తినడమే సాధ్యం కాని సమస్య! కాబట్టి, ‘సంక్షోభం’ అనేది – ఇరువర్గాలకూ ఒకే అర్ధంతో కాదు, వేరు వేరు అర్ధాలతో వుంటుంది.

పెట్టుబడిదారీ విధానం సృష్టించే అనర్ధాలకు పరిష్కారం ఒక్కటే. అది, పెట్టుబడిదారీ విధానాన్నే రద్దు చెయ్యడం! అంటే, శ్రమదోపిడీని రద్దు చెయ్యడం! ఇదెలాగూ ఇప్పట్లో జరిగే పని కాదుగదా? ఇప్పుడు ఏమి చెయ్యాలీ అంటే, మేధాశ్రామికులైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా సంఘాలు పెట్టుకోవాలి. (పూనా, చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు లాంటి చోట్ల కొన్ని ఉన్నట్టు సమాచారం.) ఉద్యమాలు చెయ్యాలి. ఉదాహరణకి సమ్మె లాంటివి, వాటికి అనుమతులు ఉన్నా, లేకపోయినా! సమ్మెల వల్ల ఉపయోగం ఉంటుందా అనే ప్రశ్న రావచ్చు. దానికి, మార్క్సు ఎంగెల్సులు ఇచ్చిన వివరణలు చూద్దాం!

ఎంగెల్సు: ‘సమ్మె వల్ల ఉపయోగం ఏమీ వుండదని తెలిసి కూడా కార్మికులు సమ్మెకు ఎందుకు పూనుకుంటారని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే, అది తప్పనిసరి. యజమానులు చేసే ప్రతి తగ్గింపుకూ కార్మికులు నిరసన తెలిపి తీరాలి. ‘మనుషులుగా మేము ప్రస్తుత సామాజిక పరిస్థితులకే లొంగి జీవించడం కాదు; ఈ సామాజిక పరిస్థితులే మారాలి, మేము మనుషులుగా బతకడానికి వీలుగా!’ అని కార్మికులు ఆశిస్తారు. వారు, ఏ నిరసనా లేకుండా నిశ్శబ్దంగా వుండిపోతే, ‘యజమానులు తమ మంచి కాలంలో కార్మికులను దోచుకోవడానికీ, సంక్షోభం రోజుల్లో వారిని ఆకలితో మాడమని వదిలేయడానికీ, యజమానుల వర్గానికి హక్కు వుంది’ – అని కార్మికులు అంగీకరించినట్లే అవుతుంది. ‘కార్మికులు, జంతువులుగా గాక మనుషులుగా జీవించాలనే’ ఆశను పూర్తిగా కోల్పోనంతవరకూ, యజమానుల విధానాలకు వ్యతిరేకంగా తిరగబడుతూనే వుండాలి... ఈ కార్మిక సంఘాలు చేసే సమ్మెల నిజమైన ప్రాధాన్యత ఏమిటంటే, కార్మికులు తమలో పోటీని రద్దు చేయడానికి చేసే తొట్టతొలి ప్రయత్నాలే సమ్మెలు. కార్మికులకు వారిలో వారికి గల పోటీయే, అంటే వారిలో కలిసి కట్టుతనం లోపించడమే, కార్మికులందరూ ఒకే లక్ష్యంతో వుండకపోవడమే, పెట్టుబడిదారుల ఆధిక్యానికి ఆధారమనే నిజాన్ని గుర్తించడం సమ్మెల్లో ఇమిడి వుంది.’ (‘ఇంగ్లండులో కార్మికవర్గ స్తితిగతులు’ అనే 1845 నాటి పుస్తకంలో.)

మార్క్సు: ‘పెట్టుబడితో తమ అనుదిన ఘర్షణలో, కార్మికులు పిరికి వారై, వెనుకంజ వేసినట్టయితే, అంతకన్నా పెద్ద ఉద్యమాన్ని దేన్నీ ప్రారంభించే అర్హతను తప్పని సరిగా కోల్పోతారు.’ (‘వేతనం, ధరా, లాభం’ అనే 1865 నాటి వ్యాసంలో.)

శ్రామికవర్గ సిద్ధాంతకర్తలు అందించిన మార్గం స్పష్టమే. కదలవలిసింది శ్రామిక వర్గం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా శ్రామికవర్గంలో భాగమే అని మళ్ళీ చెప్పాలా?

రంగనాయకమ్మ

Updated Date - 2023-01-29T10:46:29+05:30 IST