Twitter: భారత్‌లో 2 ట్విటర్ ఆఫీస్‌లు మూసివేత.. ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2023-02-17T16:34:38+05:30 IST

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను (Twitter) హస్తగతం చేసుకున్నాక ఉద్యోగుల తొలగింపునకు పూనుకున్న టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు...

Twitter: భారత్‌లో 2 ట్విటర్ ఆఫీస్‌లు మూసివేత.. ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం!

ముంబై: మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను (Twitter) హస్తగతం చేసుకున్నాక ఉద్యోగుల తొలగింపుపై దృష్టిపెట్టిన టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా మరో కీలక చర్యకు నడుం బిగించారు. వ్యయాల తగ్గింపే లక్ష్యంగా కార్యాలయాల మూసివేతకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భారత్‌లోని మూడు ట్విటర్ కార్యాలయాల్లో రెండింటిని మూసివేస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఢిల్లీ, ముంబైల్లోని ఆఫీస్‌లు మూసివేయాలని నిర్ణయించగా.. బెంగళూరులోని కార్యాలయాన్ని మాత్రం యథావిథిగా కొనసాగించనుందని తెలుస్తోంది. ఎక్కువ మంది ఇంజనీర్లు ఇక్కడ నుంచి పనిచేస్తున్నారు. కాగా ఢిల్లీ, ముంబైల్లోని ఆఫీస్‌లు కేంద్రంగా ఇంతకాలం పనిచేసిన ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కొనసాగించాలని ట్విటర్ కోరిందని సమాచారం.

కాగా ట్విటర్‌ను లాభాల బాటలోకి నడిపించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గతేడాది 2022 నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగుల ఏరివేత ప్రకటించారు. అందులో భాగంగా భారత్‌లో పనిచేసే ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించినట్టు పలు రిపోర్టులు ఇదివరకే పేర్కొన్నాయి.

కాగా ట్విటర్ కార్యాలయాల మూసివేత ఒక్క భారత్‌లోనే కాదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఆఫీస్‌లను ట్విటర్ మూసివేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు భారత్‌లో కూడా ఆఫీస్‌లను మూసివేసింది. ట్విటర్‌ను ఆర్థికంగా స్థిరీకరించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నారు. కంపెనీ కార్యకలాపాలు సవ్యంగా కొనసాగాలంటే ఆర్థికంగా బలోపేతమవ్వడం చాలా ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. అందుకే తొలుత ఉద్యోగుల తొలగింపు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు కార్యాలయాల మూసివేతకు శ్రీకారం చుట్టారు.

Updated Date - 2023-02-17T16:43:16+05:30 IST