TCS: టెక్ రంగంలో ఉద్యోగాల కోతల వేళ టీసీఎస్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. టెకీలూ ఇక ధైర్యంగా ఉండండి

ABN , First Publish Date - 2023-02-19T18:44:55+05:30 IST

ఇటీవలి కాలంలో ఐటీ రంగం(IT Sector)లో కోతలు సర్వసాధారణంగా మారాయి. పింక్ స్లిప్‌ల గొడవ ఎక్కువైపోయింది. మొదట ట్విట్టర్‌(Twitter)తో మొదలైన ఈ లే ఆఫ్‌ల గొడవ ఆ తర్వాత

TCS: టెక్ రంగంలో ఉద్యోగాల కోతల వేళ టీసీఎస్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. టెకీలూ ఇక ధైర్యంగా ఉండండి

ముంబై:ఇటీవలి కాలంలో ఐటీ రంగం(IT Sector)లో కోతలు సర్వసాధారణంగా మారాయి. పింక్ స్లిప్‌ల గొడవ ఎక్కువైపోయింది. మొదట ట్విట్టర్‌(Twitter)తో మొదలైన ఈ లే ఆఫ్‌ల గొడవ ఆ తర్వాత అన్ని సంస్థలకు పాకింది. అమెజాన్(Amazon) నుంచి మైక్రోసాఫ్ట్(Microsoft) వరకు దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను ఇంటికి పంపించాయి. మరికొన్ని అదే దారిలో ఉన్నాయి. ఈ దెబ్బలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS) మాత్రం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. తాము ఒకసారి ఒకరిని నియమించుకుంటే దీర్ఘకాలంలో ఆ ఉద్యోగి నైపుణ్యం పెరుగుతుందని విశ్వసిస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు, ఉద్యోగాలు కోల్పోయిన స్టార్టప్ ఎంప్లాయీస్‌ను తీసుకోవాలని చూస్తున్నట్టు ఆ సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ అధికారి మిలింద్ లక్కడ్(Milind Lakkad) ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీలన్నీ ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త ఆశలను చిగురింపజేశాయి.

తాము ఉద్యోగులను తొలగించబోమని, ఎందుకంటే తాము కంపెనీలో ప్రతిభను పెంచుకోవడంపై నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. కాబట్టి సంస్థలో లే ఆఫ్‌లు(Lay Offs) ఉండబోవన్నారు. చాలా కంపెనీలు తమకు కావాల్సిన దానికంటే పెద్ద మొత్తంలో ఉద్యోగులను నియమించుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి (Lay Offs) ఎదురవుతుందోన్న ఆయన.. తమ సంస్థలో ఓ ఉద్యోగి చేరితే వారిని వారిని ఉత్పాదకశక్తిగా మార్చడం తమ బాధ్యతేనని మిలింగ్ వివరించారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి ప్రతిభలో లోపం ఉన్నట్టు గుర్తిస్తే అతడికి మరింత శిక్షణతోపాటు సమయం కూడా ఇస్తామని చెప్పారు.

6 లక్షల మందికిపైగా ఉద్యోగులను కలిగిన టీసీఎస్(TCS) గత సంవత్సరాల మాదిరిగానే వేతన పెంపును ప్రకటించబోతోంది. స్టార్టప్స్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగాలు ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇస్తున్నాయని, అలా బయటకు వచ్చిన వారిని నియమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌లోని అనేక అంశాలు, ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో ప్రతిభ కోసం వెతుకుతున్నట్టు చెప్పారు.

డిసెంబరు త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2 వేల మంది సిబ్బంది తగ్గడం ఒకేసారి జరిగిందా? మళ్లీ మార్చి త్రైమాసికంలోనూ ఇది కొనసాగుతుందా? అన్న ప్రశ్నకు లక్కడ్ బదులిస్తూ.. గతేడాది తాము 2 లక్షల మందిని నియమించుకున్నామని, వారిలో 1.19 లక్షల మంది ట్రైనీలేనని గుర్తు చేశారు.

Updated Date - 2023-02-19T18:44:58+05:30 IST