Petrol Prices: పెట్రోల్‌పై తగ్గింపు లేనట్లేనా!?.. తాజా పరిణామం చూస్తుంటే...

ABN , First Publish Date - 2023-09-07T02:44:51+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే గ్యాస్‌ బండ భారాన్ని కాస్త తగ్గించడంతో పండగ సీజన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల విషయంలోనూ ఊరట లభించకపోదా అని వాహనదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ, సౌదీ అరేబియా, రష్యా ఆ ఆశలపై నీళ్లు చల్లాయి.

Petrol Prices: పెట్రోల్‌పై తగ్గింపు లేనట్లేనా!?.. తాజా పరిణామం చూస్తుంటే...

ఇంధన ధరల తగ్గుదల ఆశలపై నీళ్లు

90 డాలర్లకు చేరువలో క్రూడ్‌

ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే గ్యాస్‌ బండ భారాన్ని కాస్త తగ్గించడంతో పండగ సీజన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల విషయంలోనూ ఊరట లభించకపోదా అని వాహనదారుల్లో ఆశలు చిగురించాయి. కానీ, సౌదీ అరేబియా, రష్యా ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. మన దేశంలో ధరలతో వాటికేం సంబంధం అనుకుంటున్నారా..? ప్రపంచ మార్కెట్‌కు ముడిచమురు రోజువారీ సరఫరాను పది లక్షల బ్యారళ్ల మేర తగ్గించాలన్న గత నిర్ణయాన్ని ఈ ఏడాది చివరికి వరకు పొడిగిస్తున్నట్లు పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్యలోని ఆ రెండు కీలక దేశాలు ప్రకటించాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ కమోడిటీ ధరలు ఒక్కసారిగా ఎగబాకి 10 నెలల గరిష్ఠానికి తాకాయి. బ్రెంట్‌ రకం ముడి చమురు బ్యారల్‌ ధర 90 డాలర్లకు చేరువైంది.


ఈ ఏడాదిలో బ్రెంట్‌ క్రూడ్‌ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. గడిచిన వారం రోజుల్లో దీని రేటు 6.5 శాతం మేర పెరిగింది. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఎగుమతి దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు మన ఇంధన విక్రయ కంపెనీలు మరింత వెచ్చించాల్సి వస్తుంది. భారత్‌లో 85 శాతం ఇంధన అవసరాలు దిగుమతుల ద్వారానే సమకూరుతాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపును అవరోధంగా మారినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, మే, జూన్‌లో భారత్‌ ముడి చమురు దిగుమతులకు ఒక్కో బ్యారల్‌పై వెచ్చించిన మొత్తం 73-75 డాలర్ల స్థాయిలో ఉండగా.. జూలైలో 80.37 డాలర్లు, ఆగస్టులో 86.43 డాలర్లకు చేరింది. ఈ నెలలో 89.81 డాలర్లకు ఎగబాకింది.

Updated Date - 2023-09-07T11:41:19+05:30 IST