Meta: ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తోందా?

ABN , First Publish Date - 2023-02-17T19:38:00+05:30 IST

ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తోందా? Meta Lay-Offs Again And Again

Meta: ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తోందా?


ఉద్యోగుల్ని నడిరోడ్డున పడేయడమే అభివృద్ధికి బాట వేస్తుందా? ఉద్యోగుల కోతలే సంస్థకి మేలు చేస్తాయా? ప్రపంచ ప్రసిద్ధ మెటా (Meta) సంస్థ ప్రస్తుతం ఈ కాన్సెప్ట్‌తోనే వ్యవహరిస్తోందని అంటున్నారు విమర్శకులు.

ఇటీవలి కాలంలో మెటా పూర్తి సంకుచిత ధోరణిలో ప్రవర్తిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పెరిగిన పోటీ కారణంగా అయితేనేం, గత సంవత్సరం ఆదాయం కొంత తగ్గడం వల్ల అయితేనేం... మెటా సంస్థ ఇప్పుడు పూర్తిగా స్వార్థపూరితంగా మారిందంటున్నారు విమర్శకులు. మెటా అనేది ఇప్పుడు - ఉద్యోగుల సంక్షేమానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనీ, కేవలం ఒక క్యాష్ ప్రింటింగ్ మిషన్‌గా మారిపోయిందనీ అంటున్నారు. ఇవన్నీ ఎవరో ఉబుసుపోక అసూయతో చెబుతున్న మాటలు కావు. ప్రపంచ ప్రసిద్ధ టెక్ వెబ్‌సైట్లలో వచ్చే ఆర్టికల్స్‌లో సైతం ఇలాంటి విమర్శలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మెటా తీరు మారిందనీ, దానిపట్ల నిరసన పెరిగిందనీ మనకి అర్థమవుతుంది.

ముఖ్య విషయం ఏంటంటే - మెటా సంస్థ మార్చినెలలో మరికొంతమందిని ఉద్యోగుల్ని ఇంటికి పంపించబోతోందట. నిజానికి మెటా సంస్థ ఇప్పుడు నష్టాల్లో ఏమీ లేదు. ఉద్యోగుల్ని ఇంటికి పంపించాల్సినంత సంక్షోభం కూడా ఆ సంస్థలో లేదు. నిజానికి 2022 చివరికి - అనుకున్న దాని కంటే ఎక్కువ లాభాలు గడిచింది కూడా! ఆ చివరి క్వార్టర్లో దాదాపు 3200 కోట్ల డాలర్లకు పైగా ఆదాయాన్ని మెటా సాధించింది. అలాగే - మెటా యూజర్ల సంఖ్య కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ప్రస్తుతం మెటా డెయిలీ యూజర్ల సంఖ్య 2500 కోట్లమంది. ఇక నెలవారీ యూజర్ల సంఖ్య తీసుకుంటే - అది 300 కోట్లకు దగ్గరగా ఉంది. మరి ఇలా ఎంతో ఆశావాహంగా లాభాల బాటలో పయనిస్తున్న ఈ సమయంలో - ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా తీసిపడేయాల్సిన పనేంటి? - అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మెటావాళ్లు గత నవంబర్లో ఏకంగా 11 వేల మంది ఎంప్లాయిస్‌ని విధుల్నించి తొలగించారు. మెటా సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో వీళ్లు 13 శాతం. అసలు మెటా చరిత్రలోనే ఇంత పెద్ద లే-ఆఫ్ (Meta Layoffs) ఎప్పుడూ జరగలేదని చెప్పచ్చు.

9.jpg

అయితే - మెటా ఈ విమర్శల్ని తీసుకోవడం లేదు సరి కదా, తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. అది సహజమే కావచ్చు. కానీ మెటా తీరు ఎలా ఉందీ అంటే - అసలు ఎంప్లాయీల్ని తొలగించడం వల్లే సంస్థ లాభాలు పెరిగాయని విశ్వసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ ధోరణే విమర్శలకి గురవుతోంది.

మా సంస్థకి సంబంధించినంతవరకూ 2023 సంవత్సరం ... అనేది యియర్‌ ఆఫ్‌ ఎఫిషియన్సీ... - అంటూ మెటా గతంలో ప్రకటించింది. అంటే 2023 మొత్తం సామర్థ్యానికి సింబల్‌గా మెటాని తీర్చిదిద్దుతారట. ఈ ఏడాదంతా మెటాసంస్థ మరింత బలంగా చురుగ్గా ఉండబోతుందనీ, దాన్ని అలా మార్చేందుకు వీలుగా ఈ ఏడాది ఎన్నో చర్యలు తీసుకుంటామనీ, దానికోసం ఎన్నో స్ట్రాటజీలు తమ దగ్గర ఉన్నాయనీ మెటా చెబుతూ వస్తోంది. అయితే ఆ స్ట్రాటజీల మాట ఎలా ఉన్నా - ముందు ఎంప్లాయీల్ని తొలగించడమే మెటా ముందున్న అతి ముఖ్యమైన స్ట్రాటజీగా కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. సరయిన కారణాలు చూపకుండా పెద్ద స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు జరిగితే.. అది తాత్కాలికంగా లాభాలు చూపించవచ్చుగానీ, లాంగ్‌ రన్‌లో సంస్థ క్రెడిబిలిటీ దెబ్బ తింటుందనీ అది మంచిది కాదనీ నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-02-17T20:31:09+05:30 IST