TCS Q4 results: మార్చి త్రైమాసికంలో రాణించిన ఐటీ దిగ్గజం టీసీఎస్.. డివిడెండ్ ఎంతంటే...

ABN , First Publish Date - 2023-04-12T20:44:41+05:30 IST

ఆర్థిక సంవత్సరం 2022-2023 చివరి త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) అదరగొట్టింది. ఏడాది ప్రాతిపదికన (YoY) మార్చితో ముగిసిన త్రైమాసికానిగానూ 14.76 శాతం పెరుగుదలతో....

TCS Q4 results: మార్చి త్రైమాసికంలో రాణించిన ఐటీ దిగ్గజం టీసీఎస్.. డివిడెండ్ ఎంతంటే...

ముంబై: ఆర్థిక సంవత్సరం 2022-2023 చివరి త్రైమాసికంలో (Q4 Results) దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) అదరగొట్టింది. ఏడాది ప్రాతిపదికన (YoY) మార్చితో ముగిసిన త్రైమాసికానిగానూ 14.76 శాతం పెరుగుదలతో రూ.11,392 కోట్ల నికర లాభాన్ని కంపెనీ వెల్లడించింది. అంతక్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.9,926 లాభాన్ని ఆర్జించినట్టు కంపెనీ ప్రస్తావించింది. ఆదాయం విషయానికి వస్తే గతేడాది మార్చి త్రైమాసికంలో స్థూల ఆదాయం రూ.50,591 కోట్లుగా ఉండగా ఇప్పుడది 16.94 శాతం పెరుగుదలతో క్యు4లో రూ.59,162 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరం 2023కిగానూ ఒక్క షేరుపై రూ.24 డివిడెండ్‌ను అందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

రిటైల్ - సీపీజీ విభాగా 13 శాతం, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్‌లో 12.3 శాతం చొప్పున రెండంకెల వృద్ధి సాధించగా.. మిగతా రంగాలకు చెందిన విభాగాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. టెక్నాలజీ అండ్ సర్వీసెస్ 9.2 శాతం, బీఎఫ్ఎస్ఐ 9.1 శాతం, మాన్యుఫ్యాక్చరింగ్ 9.1 శాతం, కమ్యూనికేషన్స్ అండ్ మీడియా 5.3 శాతంగా ఉన్నాయని వెల్లడించింది.

ఆర్థిక సంవత్సరం 2023లో దృఢమైన వృద్ధి సంతృప్తికరంగా ఉందని సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ చెప్పారు. బుక్ ఆర్డర్ కంపెనీ పటిష్టతను తెలియజేస్తోందన్నారు. కంపెనీ సర్వీసులకు చక్కటి డిమాండ్ ఉందన్నారు. సమీప కాలంలో వృద్ధికి సంకేతంగా ఆయన అభివర్ణించారు. కాగా రాజేష్ గోపినాథన్ అనూహ్యంగా గత నెలలోనే తన బాధ్యతలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీసీఎస్‌కు దాదాపు 6 ఏళ్లపాటు ఆయన నాయకత్వం వహించారు.

Updated Date - 2023-04-12T20:45:25+05:30 IST