Union Budget 2023: బీఎస్ఎన్‌ఎల్‌కు మంచి రోజులు.. బడ్జెట్‌లో ఏకంగా..

ABN , First Publish Date - 2023-02-01T19:54:17+05:30 IST

నష్టాల్లో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ

Union Budget 2023: బీఎస్ఎన్‌ఎల్‌కు మంచి రోజులు.. బడ్జెట్‌లో ఏకంగా..

న్యూఢిల్లీ: నష్టాల్లో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్‌(BSNL)కు మంచి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్(Union Budget-2023) ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 44,720 కోట్లు వెచ్చించనుంది.

బీఎస్ఎన్‌ఎల్‌లో 4జీ స్ప్రెక్టమ్, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్, పునర్నిర్మాణం కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్ పత్రాల్లో పేర్కొన్నారు. మూలధన పెట్టుబడితోపాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కోసం అదనంగా రూ. 7,443.57 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం అందించనుంది. జీఎస్‌టీ చెల్లింపుల కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 3,550 కోట్లు ఇవ్వనుంది.

స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(VRS) కోసం ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సాయం బీఎస్ఎన్ఎల్‌తోపాటు ఎంటీఎన్ఎల్‌(MTNL)కూ వర్తిస్తుంది. బీఎస్ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం అక్టోబరు 2019లో అందించిన రూ. 69 వేల కోట్ల ఉపశమన ప్యాకేజీకి అదనంగా ఈ సాయం అందించనుంది.

బీఎస్ఎన్ఎల్ త్వరలోనే 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ సొల్యూషన్స్‌ను ఈ నెలలో లైవ్ నెట్‌వర్క్‌పై పరీక్షించనుంది. 4జీ శాచ్యురేషన్ ప్రోగ్రామంలో భాగంగా ఏడాదిలోపు దేశంలోని అన్ని గ్రామాల్లోనూ 4జీ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు కీలకంగా మారాయి. ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని ప్రతి మూలకు 4జీ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొస్తారు.

రిలయన్స్ జియో(Reliance Jio), ఎయిర్‌టెల్(Airtel) వంటి ప్రైవేటు రంగ టెలికం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించిన వేళ బీఎస్ఎన్ఎల్ మాత్రం 4జీ సేవలకు సిద్ధమవుతుండడం గమనార్హం. 2019 నుంచీ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. అయితే, దేశీయ సంస్థల పరిమిత పరిస్థితుల నేపథ్యంలో 2020లో టెండర్‌ను రద్దు చేసింది. అయితే, ఆ తర్వాత మాత్రం దేశీయ పరికరాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ఆలస్యానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయం సంస్థకు మరింత మేలు కలిగించనుంది.

Updated Date - 2023-02-01T19:54:19+05:30 IST