ఏ ప్రయోజనాలకీ విరాళాలు.. రాజకీయ పార్టీల మొత్తం విరాళాల్లో 80 శాతం బీజేపీకే!

ABN , First Publish Date - 2023-02-16T18:55:00+05:30 IST

దేశంలో బీజేపీ ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండోసారి

ఏ ప్రయోజనాలకీ విరాళాలు.. రాజకీయ పార్టీల మొత్తం విరాళాల్లో 80 శాతం బీజేపీకే!

న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండోసారి దేశాన్ని పాలిస్తున్న కాషాయ పార్టీ ముచ్చటగా మూడోసారి కూడా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. పార్టీలు నిలబడాలంటే విరాళాలు తప్పనిసరి. ప్రజలు, కంపెనీలు, వ్యాపారవేత్తల నుంచి విరాళాలు అందుకోవడం ద్వారానే అవి మనగలుగుతాయి. ప్రజలేమో తాము అభిమానించే పార్టీ కాబట్టి తోచినంత విరాళంగా అందిస్తారు. వ్యాపార, పారిశ్రామిక వేత్తలు మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వాలు తమ జోలికి రాకుండా విరాళాల రూపంలో పెద్దమొత్తంలో సమర్పించుకుంటారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. విరాళాల రూపంలో వచ్చిన సొమ్మును ఆయా పార్టీలు ఎన్నికల్లో ఉపయోగించుకుంటాయి.

bjp-flag.jpg

అసలు విషయానికి వస్తే 2021-22 సంవత్సరానికి గాను అధికార భారతీయ జనతా పార్టీ (BJP)కి ఏకంగా 614 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఆ ఏడాది మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు కలిపి రూ. 780 కోట్లు వస్తే.. ఒక్క బీజేపీకే రూ. 614 కోట్లు వచ్చాయి. అంటే మొత్తం విరాళాల్లో ఇది 80 శాతమన్నమాట. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ADR) ఈ విషయాలను బయటపెట్టింది. బీజేపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌కి రూ. 95 కోట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి రూ. 58 కోట్ల విరాళాలు వచ్చాయి. మిగతా ప్రాంతీయ పార్టీలు ఆ తర్వాతి స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

కార్పొరేట్లు, వ్యాపారవేత్తల నుంచే ఎక్కువ

బీజేపీ అందుకున్న రూ. 614 కోట్ల విరాళాల్లో కార్పొరేట్లు, వ్యాపారవేత్తల నుంచే ఏకంగా రూ. 548 కోట్ల విరాళాలు వచ్చిపడ్డాయి. తరచి చూడాలే కానీ దీని వెనక చాలా కారణాలే ఉన్నాయి. నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు పెద్ద మొత్తంలో రావడం సర్వ సాధారణమైన విషయమే. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోకడ మరింత పెరిగిందనే చెప్పాలి. ప్రతి ఏడాది ఆ పార్టీకి విరాళాల రూపంలో డబ్బు వచ్చి పడిపోతోంది.

మోదీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో విరాళాలు ఇలా ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడిపోతుండడం అందుకు ఊతమిస్తోంది. ప్రభుత్వం నుంచి తమకు కలలో కూడా హాని జరగకూడదని భావిస్తుండబట్టే పారిశ్రామికవేత్తలు విరాళాల రూపంలో అధికార పార్టీపై కోట్లు కుమ్మరిస్తున్నారు. ప్రభుత్వాన్ని ధిక్కరించి సీబీఐ, ఈడీ దాడులను ఎదుర్కోవడం కంటే విరాళాల రూపంలో రాజీ కుదుర్చుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. పారిశ్రామిక, వ్యాపారవేత్తలందరి మదిలోనూ ఇదే భావన ఉందని చెబుతున్నారు.

రిలయన్స్.. అదానీ సంగతేంటి?

ambani1.jpg

రిలయన్స్, అదానీ సంస్థలు కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చినవేమీ కాదు. కానీ, మోదీ అధికారం చేపట్టాక వాటి ప్రభ అమాంతం వెలిగిపోతోంది. ప్రభుత్వ సంస్థలన్నీ ఒక్కొక్కటిగా అదానీ సొంతమవుతుంటే, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద అమాంతం పెరిగిపోయింది. మోదీ అధికారంలోకి వచ్చాక అదానీ, అంబానీలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం ఇంకేముంటుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు అదానీ సొంతమవుతుంటే, రిలయన్స్ అన్ని రంగాలను ఆక్రమించుకుంటూ గుత్తాధిపత్యం దిశగా సాగుతోంది. ఇప్పుడీ రెండు సంస్థలు ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకుంటున్నాయని, ప్రజాస్వామ్యంలో ఇది వినాశనానికి దారి తీస్తుందని విమర్శిస్తున్నాయి.

అక్రమాల సంగతేంటి?

adani.jpg

పార్టీలకు కోట్లాది రూపాయాల విరాళాలు ఇస్తున్నాయి కాబట్టి కార్పొరేట్, వ్యాపారవేత్తలు చేసే తప్పులు ఒప్పులైపోతాయా? అవును! కచ్చితంగా అదే జరుగుతోందంటున్నాయి ప్రతిపక్షాలు. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందంటూ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ వెల్లడించిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపలు సృష్టించింది. దాదాపు 218 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అదానీ గ్రూపు (Adani Group) దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుచుకుంటున్నట్టు ఆరోపించింది.

అదానీ గ్రూపునకు చెందిన 7 కీలకమైన కంపెనీల స్టాకుల విలువ భారీగా పెరగడంతో ఆయన మొత్తం సంపదలో 100 బిలియన్ డాలర్లు గత మూడేళ్లలోనే సమకూరినట్టు పేర్కొంది. ఈ మూడేళ్లకాలంలో సగటున 819 శాతం మేర షేర్ల విలువ పెరిగినట్టు వివరించింది. పన్ను ఎగ్గొట్టే వారికి స్వర్గధామాలైన కరీబియన్, మారిషస్ నుంచి యూఏఈ వరకు పలు దేశాల్లో అదానీ కుటుంబం నియంత్రణలో ఉన్న పలు డమ్మీ కంపెనీలను గుర్తించినట్టు తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత అదానీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ప్రపంచ కుబేరుల స్థానంలో మూడో స్థానంలో ఉన్న అదానీ ఈ దెబ్బతో ఏకంగా 21వ ర్యాంకుకు పడిపోయి టాప్-20లో చోటు కోల్పోయారు.

బయటకు రాని వాటి సంగతేంటి?

హిండెన్‌బర్గ నివేదిక పుణ్యమా అని అదానీ అక్రమాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయని, మరి రానివాటి సంగతేంటని ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. తాజా విరాళాల ద్వారా కార్పొరేట్ కంపెనీల తెరచాటు బాగోతాలు ప్రస్ఫుటమవుతున్నాయని దుమ్మెత్తిపోస్తున్నాయి.

Updated Date - 2023-02-16T18:55:02+05:30 IST