Yuvagalam Padayatra: టీడీపీతోనే రాయలసీమ సస్యశ్యామలం: నారా లోకేశ్‌

ABN , First Publish Date - 2023-05-13T21:49:40+05:30 IST

వృథాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలనే ఆలోచన ఎన్టీఆర్‌ చేశారని, ఇందులో భాగంగానే తెలుగు గంగ ప్రాజెక్టు, వెలుగోడు జలాశయాలను..

Yuvagalam Padayatra: టీడీపీతోనే రాయలసీమ సస్యశ్యామలం: నారా లోకేశ్‌

నంద్యాల: వృథాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలనే ఆలోచన ఎన్టీఆర్‌ చేశారని, ఇందులో భాగంగానే తెలుగు గంగ ప్రాజెక్టు, వెలుగోడు జలాశయాలను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) గుర్తుచేశారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 98వ రోజు భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో కరివేన శివారులోని విడిది కేంద్రం నుంచి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర కరివేన ఆత్మకూరు పట్టణం మీదుగా నల్లకాలువ వరకు సాగింది. 98వ రోజు పాదయాత్ర 13.2 కి.మీటర్ల మేర సాగగా ఇప్పటి వరకు మొత్తం 1252.7 కి.మీటర్లు కొనసాగింది. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్‌ మాట్లాడుతూ జగన్‌ నిక్కర్‌ వేసుకునే సమయంలోనే ఎన్టీఆర్‌ (NTR) సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు.

రూ.2కే కిలో బియ్యం, రైతులకు రూ.50కే విద్యుత్‌, 65 ఏళ్లు దాటిన వారికి పెన్షన్‌, తక్కువ ధరకే జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ల వంటి అనేక కార్యక్రమాలను తీసుకు వచ్చారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. జగన్‌ మాత్రం తానే సంక్షేమ పథకాలను మొదలు పెట్టానడడం విడ్డూరమని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు (Chandrababu) హయాం కంటే జగన్‌ (Jagan) హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా..? దీనిపై చర్చకు సిద్ధమేనా.. ఊసరవెళ్లి జగన్‌ అంటూ లోకేశ్‌ ప్రశ్నించారు. ఎన్నికల ముందు జగన్‌ అనేక రకాల హామీలు ఇచ్చారని.. అవేవి అమలు చేయడం లేదని లోకేశ్ దుయ్యబట్టారు.

Updated Date - 2023-05-13T21:49:40+05:30 IST