Pawan Fans: ‘తొలిప్రేమ’ సినిమా ప్రదర్శనలో యువకుల బీభత్సం.. దీని వెనక రాజకీయ కుట్ర ఉందా?.. అసలేం జరుగుతోంది?

ABN , First Publish Date - 2023-07-01T10:36:41+05:30 IST

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ నటించిన ‘‘తొలిప్రేమ’’ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది.

Pawan Fans: ‘తొలిప్రేమ’ సినిమా ప్రదర్శనలో యువకుల బీభత్సం.. దీని వెనక రాజకీయ కుట్ర ఉందా?.. అసలేం జరుగుతోంది?

విజయవాడ: జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) నటించిన ‘‘తొలిప్రేమ’’ సినిమా (Tholi prema Movie) విడుదలై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. దీంతో పవన్ అభిమానులే కాకుండా ప్రజలు సినిమాను థియేటర్లలో మరోసారి వీక్షిస్తున్నారు. అయితే విజయవాడలో మాత్రం పవన్ అభిమానుల పేరుతో పలువురు బీభత్సం సృష్టించారు. నగరంలోని కపర్థి సినిమా థియేటర్‌లో నిన్న(శుక్రవారం) తొలిప్రేమ సినిమాను ప్రదర్శనకు వేశారు. సెకండ్ షో సమయంలో అభిమానుల పేరుతో పలువురు హంగామా చేశారు. కొందరు యువకులు సినిమా తెర చించేసి, సీట్లను ధ్వంసం చేశారు. కుట్రతోనే థియేటర్‌ను ధ్వంసం చేసేందుకు వచ్చారని థియేటర్ సిబ్బంది చెబుతున్నారు.

సినిమా మధ్యలో పది మంది యువకులు అకస్మాత్తుగా లేచి గొడవ చేశారు. స్క్రీన్ పైకి ఎక్కి కోసేయడంతో పాటు... సీట్ల పైకి ఎక్కి చించేశారు. వీరిని అడ్డుకునేందుకు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అలాగే థియేటర్‌లోని సీసీ కెమెరాలు, బయట అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానులు పేరుతో కావాలనే చేశారే అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా అభిమానులు చేశారా? లేక రాజకీయ కారణాలతో చేశారా అనేది తేలాల్సి ఉంది. రాత్రి జరిగిన ఘటన చూస్తే విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేసి ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని... ఇటువంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ కూడా తమ అభిమానులను కంట్రోల్ చేయాలని థియేటర్ యాజమాన్యం కోరుతోంది.

నష్టం.. కష్టం కలిగిస్తే ప్రదర్శనలు ఆపేస్తాం: థియేటర్ మేనేజర్

నిన్న తొలిప్రేమ సినిమా ప్రదర్శనలో అభిమానులు అరాచకం సృష్టించారని కపర్థి ధియేటర్ మేనేజర్ మోహన్ రావు తెలిపారు. శనివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. పొగ బాంబులు తెచ్చి తెర పైకి విసిరారని.. అడ్డుకున్నందుకు థియేటర్ సిబ్బందిపై దాడి చేశారన్నారు. తెర చించి, సీట్లు పీకేశారని.. దండం పెట్టినా వదల్లేదని వాపోయారు. 47 యేళ్లుగా ఈ ఎగ్జిబిటర్ రంగంలో ఉన్నానని.. ఇలాంటి దారుణం గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. రాజకీయ కారణాలు ఉంటే బయట చూసుకోవాలని అన్నారు. పెద్ద హీరోలు అయినా తాము సినిమా‌ ప్రదర్శిస్తేనే వారికి ఆదరణ అని చెప్పుకొచ్చారు. అభిమానులు పేరుతో ఇలా చేస్తే... ఆ హీరోకే నష్టమన్నారు. ఈ దాడి వల్ల నాలుగు లక్షలు నష్టం కలిగిందని.. అద్దాలు, సీసీ కెమెరాలు కూడా పగుల‌కొట్టారన్నారు. తమకు నష్టం చేస్తే, కష్టం కలిగిస్తే ప్రదర్శనలు ఆపేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ధియేటర్‌లో‌ సినిమాలు ఆడక.. జీతాలు ఇవ్వలేని‌ పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా హీరోలు, సినిమా పెద్దలు చర్యలు తీసుకోవాలని మేనేజర్ కోరారు.


కాగా.. నిన్న(శుక్రవారం) తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో తొలిప్రేమ చిత్రం 4కే ఫార్మాట్‍లో రీ-రిలీజ్ అయింది. ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మాతా క్రియేషన్స్ ముందుకొచ్చింది. తొలిప్రేమ సినిమా రీ-రిలీజ్‍కు భారీ క్రేజ్ వచ్చింది. పవన్ కళ్యాన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన తొలిప్రేమ మూవీని బిగ్ స్క్రీన్‍పై చూసేందుకు పవర్ స్టార్ అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు.

Updated Date - 2023-07-01T10:48:29+05:30 IST