CBI: అవినాష్ రెడ్డి వ్యవహారంపై సీబీఐ కీలక నిర్ణయం?

ABN , First Publish Date - 2023-05-19T18:05:10+05:30 IST

కర్నూలు నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు బయలుదేరారు. రేపు ఉదయం కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

CBI: అవినాష్ రెడ్డి వ్యవహారంపై సీబీఐ కీలక నిర్ణయం?

కర్నూలు: కర్నూలు నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు బయలుదేరారు. రేపు ఉదయం కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) వ్యవహారంలో ఇవాళ ఉదయం నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఎప్పుడేం జరుగుతుందో అటు అవినాష్ వర్గానికి.. ఇటు సీబీఐ అధికారులకు ఎవరికీ తెలియని పరిస్థితి.

శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మి ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. తల్లిని చూడటానికి సీబీఐ (CBI) విచారణకు డుమ్మా కొట్టి మరీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరారు. అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి..! తాడిపత్రి (Tadipatri) సమీపంలోని చుక్కలూరులో అంబులెన్స్ ఆపి తన తల్లిని చూశారు. అనంతరం అవినాష్ తన కాన్వాయ్‌లోకి వెళ్లారు.

గుత్తి సమీపంలో జాతీయ రహదారిపై వచ్చిన తర్వాత హైదరాబాద్ వైపు వెళ్తారా..? బెంగళూరు వెళ్తారా..? అనే దానిపై సస్పెన్స్ కొనసాగింది. ప్రస్తుతం అవినాష్ కాన్వాయ్‌లోనే ముందువైపు అంబులెన్స్ నడుస్తోంది. అంబులెన్స్‌లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు అవినాష్ కాన్వాయ్‌ను పెద్ద ఎత్తున అభిమానులు, ప్రధాన అనుచరులు.. ఎమ్మెల్యేకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఫాలో అవుతున్నారు.

కవరేజ్‌కు వెళ్లిన ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి (ABN -Andhrajyothy) ప్రతినిధులపై ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) అనుచరులు దాడి చేయడం పాశవిక చర్యగా భావిస్తున్నామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (JAAP) అధ్యక్షులు రవితేజ, ఉఫాధ్యక్షులు ఆర్‌వి సూర్యనారాయణరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాను అడ్డుకోవాలని అనుకోటం ఫ్యాక్షనిజానికి నిదర్శనమని మండిపడ్డారు. అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరవుతున్నాడా లేక పారిపోతున్నాడా అన్న విషయం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. అవినాష్ రెడ్డి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తాను సీపీఐ వద్ద హాజరవుతున్నానా లేక పులివెందులకు వెళ్తున్నానా అనే విషయాన్ని ఎందుకు మీడియాకు వెల్లడించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను జర్నలిస్టుల సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవని స్పష్టం చేశారు. బాధ్యతగల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రోజూ మీడియాను తిట్టడాన్నే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇలా దాడులను ఆయన కూడా ప్రోత్సహిస్తున్నారా అన్న అనుమానం వస్తోందని తెలిపారు. ఈ దాడులను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (JAAP) పూర్తిగా ఖండిస్తోందన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ పంపాలని జాప్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-19T18:30:58+05:30 IST