AP News: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. తారాజువ్వ పడటంతో...

ABN , First Publish Date - 2023-03-30T13:33:50+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

AP News: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. తారాజువ్వ పడటంతో...

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) తణుకు మండలం దువ్వలో శ్రీరామనవమి వేడుక (Sriramanavai Celebrations) ల్లో అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని దువ్వ వేణుగోపాలస్వామి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారాజువ్వ పడటంతో ఆలయ పందిరి పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆలయంలోని భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.

శ్రీరామనవమి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో నవమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వేడుకల సందర్భంగా భారీ స్థాయిలో చలువ పందిళ్లు వేశారు. వేడుకలు జరుగుతున్న సమయంలో ఉత్సవాల నిర్వహకులు బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో ఓ తారా జువ్వ చలువ పందిళ్లపై పడింది. దీంతో ఒక్కసారిగా నిప్పంటుకుంది. క్షణాల వ్యవధిలో పందిళ్లకు మొత్తం మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయంలోని భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఫైరింజన్ ఇంకా రాకపోవడంతో స్థానికులు, భక్తులు కలిసి మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవకపోవడంతో భక్తులు, ఆలయ నిర్వహకులు ఊపిరిపీల్చుకున్నారు. శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడుకల్లో ఏదో అపచారం జరగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్థులు భావిస్తున్నారు.

Updated Date - 2023-03-30T13:36:33+05:30 IST