Share News

Eluru: ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇవేం పనులు! ఎంపీ బర్త్‌డే కోసం..!

ABN , First Publish Date - 2023-10-25T12:42:35+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శేషాచల కొండపై ఆలయ అధికారుల అవినీతికి అడ్డే లేకుండా పోతుంది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిని, పార్లమెంటు సభ్యుడిని సైతం తప్పుదోవ పట్టిస్తూ వారికి సైతం నిజాలు చెప్పకుండా అబద్దాన్ని

Eluru: ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇవేం పనులు! ఎంపీ బర్త్‌డే కోసం..!

ఏలూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం శేషాచల కొండపై ఆలయ అధికారుల అవినీతికి అడ్డే లేకుండా పోతుంది. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిని, పార్లమెంటు సభ్యుడిని సైతం తప్పుదోవ పట్టిస్తూ వారికి సైతం నిజాలు చెప్పకుండా అబద్దాన్ని నిజంగా చూపే ప్రయత్నం చేస్తునట్లు అధికారులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనే ధైర్యమో లేక ఎంతోకాలంగా అవినీతికి అలవాటు పడి మాకు అడ్డు చెప్పే వారెవరు అనే విధంగా అధికారుల ప్రవర్తన తయారయింది. తాజాగా ఓ ఎంపీ పుట్టినరోజు వేడుకలకు ద్వారకాతిరుమల దేవస్థానాన్ని ఆలయ అధికారులు వేదికగా చేశారు. ప్రస్తుతం ఆ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. అయితే ఆ విషయానికి సంబంధించి మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు ద్వారకాతిరుమ శేషాచల కొండపై ధూమ్ ధామ్ గా నిర్వహించారు. ఆ వేడుకల్లో భాగంగా దేవస్థానానికి చెందిన ఓ కళ్యాణ మండపాన్ని ఉచితంగా కేటాయిస్తూ ఆలయ అధికారులు ఎంపీ పుట్టినరోజు నిమిత్తం వచ్చిన అభిమానులకు భోజనాలు వడ్డించారు. అయితే భోజనాల విషయం వివాదాస్పదం అవడంతో ఆలయ అధికారులు ఎంపీ కోటగిరి శ్రీధర్ దేవస్థానానికి డబ్బులు చెల్లించిన కారణంగానే భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. కానీ అందులో అధికారుల మాయాజాలం బయటపడింది.

1.jpg

ఎంపీ శ్రీధర్ వద్ద దేవస్థానం అధికారులు అభిమానులకు భోజనాల పేరుతో 3 లక్షల రూపాయలు చెక్ తీసుకున్నారు. అయితే ఎంపీ అభిమానులకు పెట్టిన భోజనాలు దేవస్థానం అన్నదాన ట్రస్టు తరఫున ఉచితంగా అందించినట్లు, దానికి ఎంపీ దేవస్థానానికి విరాళంగా మూడు లక్షలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఎంపీ ఇచ్చిన చెక్కు చూపించమంటే బ్యాంకులో వేసామని బుకాయిస్తున్నారు. వాస్తవానికి దేవస్థానం అధికారులు శేషాచలం కొండపై అన్నదాన భవనంలో ఎంతమంది భక్తులు వచ్చినా ఉచితంగా భోజనాలు పెడతారు. కానీ ఈ భోజనాల విషయంలో అధికారులు ఎంపీ డబ్బులు చెల్లించారు అందుకనే భోజనాలు పెట్టామని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఎందుకంటే ఎవరైనా దేవస్థానం అన్నదాన ట్రస్ట్ కు విరాళం ఇస్తే వెంటనే ఆ చెక్కును, విరాళం బాండును, వాటిని ఇచ్చే వ్యక్తి ఫోటోతో సహా దేవస్థానం అధికారులు చూపుతారు. కానీ ఎంపీ శ్రీధర్ ఇచ్చిన చెక్కు మాత్రం ఇప్పటివరకు చూపలేదు. విరాళం బాండ్ గురించి అడిగితే తమకు తెలియదని సంబంధిత అధికారులు చెప్పడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఎంపీ శ్రీధర్ దగ్గర తీసుకున్న చెక్కు ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి పేరుతో తీసుకున్నట్లు ఆలయ వర్గాల్లో చర్చ సాగుతుంది.

2.jpg

అయితే అలా నిబంధనలకు విరుద్ధంగా ట్రస్టుల పేరు చూపకుండా అధికారుల పేరుతో చెక్కులు తీసుకోవడం దేవస్థానానికి విరుద్ధం. మరి ఎంపీ శ్రీధర్ ఇచ్చిన చెక్కు ఏమైనట్లు అనే విషయం తెలియకుండా ఉంది. ఎంపీ శ్రీధర్ తన అభిమానుల భోజనాలకు దేవస్థానానికి విరాళం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.కానీ ఆ చెక్కును అన్నదాన ట్రస్ట్లో ఎందుకు చూపడం లేదో అర్థం కాని ప్రశ్నగా మారింది. అయితే ఈ విషయంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను కూడా ఆలయ అధికారులు తప్పుదోవ పట్టించారు. దేవాదాయ శాఖ మంత్రికి సైతం నిజాలు తెలియకుండా చేయడం వెనక అధికారుల ఆంతర్యం ఏమిటో తెలియాలి. నిజంగా దేవస్థానం అన్నదాన ట్రస్ట్ కు విరాళం ఇచ్చినట్లుగా చెక్కుచూపితే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇప్పటికైనా ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారులు, ప్రభుత్వ పెద్దలు కులంకశంగా ఆలోచించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

3.jpg

4.jpg

5.jpg

Updated Date - 2023-10-25T12:44:00+05:30 IST