YCP vs TDP: పరిటాల సునీత, శ్రీరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. హరికృష్ణారెడ్డిపై చెప్పులతో దాడి

ABN , First Publish Date - 2023-03-06T21:09:30+05:30 IST

సోషల్‌ మీడియా ముసుగులో వైసీపీ (YCP) అరాచకానికి తెరలేపింది. గుంటూరుకు చెందిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సోషల్‌ మీడియాలో జరిగిన మాటల యుద్ధం..

YCP vs TDP: పరిటాల సునీత, శ్రీరామ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. హరికృష్ణారెడ్డిపై చెప్పులతో దాడి

అనంతపురం: సోషల్‌ మీడియా ముసుగులో వైసీపీ (YCP) అరాచకానికి తెరలేపింది. గుంటూరుకు చెందిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సోషల్‌ మీడియాలో జరిగిన మాటల యుద్ధం అనంతలో ఉద్రిక్తతకు దారి తీసింది. విశాఖలో తాజాగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (Global Investors Summit) నిర్వహించారు. ఆ సమ్మిట్‌పై టీడీపీ యువనేత, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ (Paritala Sriram) కామెంట్‌ చేస్తూ సోషల్‌ మీడియా (Social media)లో పోస్టు పెట్టారు. శ్రీరామ్‌ పోస్టుపై గుంటూరుకు చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త హరికృష్ణారెడ్డి (Harikrishna Reddy) స్పందించాడు. సోషల్‌ మీడియా వేదికగా పరిటాల శ్రీరామ్‌ను పరుష పదజాలంతో దూషించాడు. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్త సజ్జ అజయ్‌, హరికృష్ణారెడ్డికి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘సోషల్‌ మీడియాలో కాదు.. దమ్ముంటే అనంతపురం వెళ్లి పరిటాల శ్రీరామ్‌ గురించి మాట్లాడు’ అని చాలెంజ్‌ చేశాడు. దీనిపై హరికృష్ణారెడ్డి తిరిగి సోషల్‌ మీడియాలో స్పందించాడు. సోమవారం ఉదయం 10 గంటలకు అనంతపురం క్లాక్‌ టవర్‌ సెంటర్‌కు వస్తానని, దమ్ముంటే కాస్కోవాలని సవాల్‌ విసిరాడు. సోషల్‌ మీడియా వేదికగా జరిగిన ఈ వ్యవహారం అనంతలో ఉద్రిక్తతకు కారణమైంది.

హరికృష్ణారెడ్డికి పరిటాల అభిమానుల దెబ్బ

వైసీపీ కార్యకర్త హరికృష్ణారెడ్డికి పరిటాల అభిమానుల దెబ్బ ఏమిటో రుచి చూపించారు. పోలీసులు హరికృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ వాహనంలోకి ఎక్కించిన సమయంలో పరిటాల అభిమానులు ఒక్కసారిగా పరుగున అక్కడికి చేరుకున్నారు. వాహనంలో కూర్చున్న హరికృష్ణారెడ్డిని పరిటాల అభిమానులు పిడిగుద్దులు గుద్దారు. ఓ అభిమాని ఏకంగా చెప్పు దెబ్బ రుచి చూపించాడు. ఇదే క్రమంలో కొందరు వైసీపీ అల్లరిమూకలు రాళ్లతో దాడి చేయడంతో ఓ కానిస్టేబుల్‌తో పాటు ఓ టీడీపీ కార్యకర్తకు తీవ్ర రక్తగాయాలయ్యాయి.

సరిహద్దు దాటించేశారు..

అనంతలో ఉద్రిక్తతకు కారకుడైన హరికృష్ణారెడ్డికి పోలీసులు రాచబాట చూపించారు. అదుపులోకి తీసుకున్న అనంతరం స్టేషన్‌కు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. జిల్లా సరిహద్దు దాటించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆదేశాలతో ఆ నియోజకవర్గంలోని ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నాయి.

Updated Date - 2023-03-06T21:09:30+05:30 IST