Vizag Swetha: వైజాగ్ శ్వేత మృతి కేసులో వీడిన మిస్టరీ.. ఫైనల్‌గా పోలీసులు ఏం తేల్చారంటే..

ABN , First Publish Date - 2023-04-28T18:35:08+05:30 IST

రెండు రోజుల క్రితం వివాహిత శ్వేత (Swetha) అనుమానాస్పద మృతిలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్వేత ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Vizag Swetha: వైజాగ్ శ్వేత మృతి కేసులో వీడిన మిస్టరీ.. ఫైనల్‌గా పోలీసులు ఏం తేల్చారంటే..

విశాఖ: రెండు రోజుల క్రితం వివాహిత శ్వేత (Swetha) అనుమానాస్పద మృతిలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్వేత ఆత్మహత్య (suicide) చేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతానికి చెందిన గురివెల్లి శ్వేత మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. శ్వేతపై అత్తింటి వేధింపులు వాస్తవమేనని సీపీ శ్రీకాంత్‌ (CP Srikanth) తెలిపారు. 90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉందని, ఆ భూమి తన పేరుపై మార్చాలని భర్త ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నారు. కుటుంబ కలహాలతో శ్వేత మనస్తాపం చెందిందని తెలిపారు. శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు. ఘటనపై గృహ, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశామని, శ్వేత ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని శ్రీకాంత్‌ తెలిపారు. శ్వేతా ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి.. శ్వేత భర్త, అత్తా, మామ, ఆడపడుచు భర్తను అరెస్ట్‌ చేశారు. పెళ్లైన ఏడాదికే శ్వేత తనువు చాలించడానికి గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్నం కోసం అత్తింటివారు వేధించడం వల్ల మృతిచెందిందా లేకుంటే భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయా అనే విషయంపై కూడా విచారణ చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ (Engineering) చేసిన శ్వేత ఉన్నత చదువులు చదువుకునేందుకు యత్నించగా అత్తింటి వారు అభ్యంతరం తెలిపారని, ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయని భావిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు (police) లోతుగా దర్యాప్తు చేస్తేనే అసలు విషయాలు బయటపడే అవకాశముంది.

శ్వేతకు మణికంఠతో గత ఏడాది ఏప్రిల్‌ 22న వివాహమైంది. మణికంఠ (Manikanta) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా ఇంటి వద్ద నుంచే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) పనిచేస్తున్నాడు. భార్య, తల్లిదండ్రులతో కలిసి నెల్లిముక్కులో ఉంటున్నాడు. పదిహేను రోజుల కిందట ఆఫీస్‌ పని మీద హైదరాబాద్‌ (Hyderabad) వెళ్లాడు. శ్వేత మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్‌ చేసింది. ఫోన్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. రాత్రి ఏడు గంటల సమయంలో శ్వేత ఇంట్లోనే ఫోన్‌ను వదిలిపెట్టి తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వచ్చిన పుష్పలత, శాంతారావు ఇంటికి తాళం వేసి ఉండడం, కోడలికి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ రావడంతో బంధువులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాత్రి పది గంటల సమయంలో న్యూపోర్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ ఎదురుగా తీరంలో ఒక యువతి మృతదేహం ఇసుకలో కూరుకుపోయి ఉనట్టు బీచ్‌పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించారు. న్యూపోర్ట్‌ పోలీసులు శ్వేతగా గుర్తించి అత్తమామలకు ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. ఇంట్లో శ్వేత రాసినట్టుగా ఒక సూసైడ్‌ నోట్‌ లభ్యం కావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావించారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, గృహహింస వంటి సెక్షన్లపై కేసు నమోదుచేశారు.

Updated Date - 2023-04-28T18:43:39+05:30 IST