Anita: మద్యపాన నిషేధం ఇప్పుడు ఎన్నో దశలో ఉందో చెప్పాలి..

ABN , First Publish Date - 2023-06-01T14:48:04+05:30 IST

విశాఖ జిల్లా: టీడీపీ మినీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

Anita: మద్యపాన నిషేధం ఇప్పుడు ఎన్నో దశలో ఉందో చెప్పాలి..

విశాఖ జిల్లా: టీడీపీ మినీ మేనిఫెస్టో (TDP Mini Manifesto)తో వైసీపీ (YCP) నేతల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anita) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో (YCP Manifesto)ను 98.5 శాతం అమలు చేసామని.. మేనిఫెస్టోని పవిత్రం గ్రంధం అని చెప్పి వైసీపీ నేతలు (YCP Leaders) గ్రంధం చూడడం మానేశారని ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం.. (Prohibition Alcohol), ఆ తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు... ఇపుడు ఎన్నో దశలో ఉందో చెప్పాలన్నారు. వైసీపీ నేతల బుర్రలో చిప్స్ దొబ్బాయేమో.. అన్ని అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. రోజా టీడీపీలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారని, ఇప్పుడు వేదికలపై చిందులు వేసి.. టీడీపీని విమర్శిస్తున్నారని అన్నారు. ఏపిని గంజాయిలో నంబర్ 1గా నిలిపారని ఆరోపించారు.

సంపాదించే దమ్ము ఉన్నవాడే అప్పులు చేయాలని అనిత అన్నారు. చంద్రబాబు ఒక మాట చెబితే.. ప్రపంచంలో పెట్టుబడిదారులు వస్తారని.. సంపద సృష్టించింది చంద్రబాబేనని అన్నారు. అమ్మవడిలో ఎంత మంది పిల్లలు ఉంటే... అంత మందికి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 3 గ్యాస్ సిలెండర్స్ ఉచితం అన్నారు.. వైసీపీకి దమ్ముంటే 6 సిలెండర్స్ అని చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని.. దమ్ముంటే అభివృద్ధిపై వైసీపీ నేతలు చర్చకు రావాలని అనిత సవాల్ చేశారు. నాలుగేళ్ల కాలంలో రైతులకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

గజని సినిమాలో హీరోలా స్పీకర్ తమ్మినేని వ్యవహారం ఉందని, ఆయన స్పీకర్ అనే విషయం గుర్తుంచుకోవాలని అనిత అన్నారు. చంద్రబాబుపై స్పీకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం పెట్టారని.. ఎల్లో షర్ట్ వేసున్న సంగతి మర్చిపోయారా? అని అన్నారు. చంద్రబాబుకు బ్లాక్ కమాండర్స్ కాదు, 75 లక్షల ఎల్లో కమాండర్స్ ఉన్నారనే సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. రాకపోయినా ఎన్నికలకు మేం సిద్ధమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని.. సైకో ఇంటికి వెళ్లడం ఖాయమని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-01T14:48:04+05:30 IST