Justice For Bhavyasri: భవ్యశ్రీ కేసులో నిందితులు ఎవరు? పోలీసులు కేసును నీరు గారుస్తున్నారా?

ABN , First Publish Date - 2023-09-26T15:20:04+05:30 IST

ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఆమెను నలుగురు అబ్బాయిలు ప్రేమించగా.. ఆమె ఒక్కరికే ఓకే చెప్పడంతో మిగతా ముగ్గురు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Justice For Bhavyasri: భవ్యశ్రీ కేసులో నిందితులు ఎవరు? పోలీసులు కేసును నీరు గారుస్తున్నారా?

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ హత్య సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో చిత్రహింసలు పెట్టి, వేధించి ముగ్గురు వ్యక్తులు ఆమెను హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో భవ్యశ్రీని చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చిత్తూరు జిల్లా పోలీసులు చెప్తున్నారు. దీంతో అసలు నిందితులు ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భవ్యశ్రీకి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో #JusticeForBhavyaSri హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

అసలు భవ్యశ్రీ ఎలా చనిపోయింది?

ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఆమెను నలుగురు అబ్బాయిలు ప్రేమించగా.. ఆమె ఒక్కరికే ఓకే చెప్పడంతో మిగతా ముగ్గురు కక్ష పెంచుకుని ఆమెను కిడ్నాప్ చేశారని.. మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి వివస్త్రను చేశారని.. కళ్లు పీకి, జుట్టు కత్తిరించి బావిలో పడేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 17 నుంచి భవ్యశ్రీ కనిపించకుండా పోయింది. పలుచోట్ల వెతికినా కనిపించకపోవడంతో మరుసటి రోజు ఆమె తండ్రి మునికృష్ణ పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. అయితే ఈనెల 20న వేణుగోపాలపురం సమీపంలోని ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలో ఉన్న నీళ్లు తోడించి భవ్యశ్రీ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. అయితే బావిలో మృతురాలి జుట్టు దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవ్యశ్రీని చిత్ర హింసలకు గురిచేసి చంపి ఉంటారని కొందరు ఆరోపిస్తున్నారు.

కానీ మరోవైపు భవ్యశ్రీని ఎవరూ రేప్ చేయలేదని పోలీసులు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో వాళ్లు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసులో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నిజం కాదని చిత్తూరు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం మృతి చెందిన అమ్మాయిపై ఎటువంటి అత్యాచారం కానీ శరీరంపై గాయాలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆమె తలపై ఊడిపోయిన జుట్టు బావిలో దొరికిందని.. అయితే తలపై గుండుకొట్టిన గుర్తులు తమకు కనిపించలేదన్నారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల కాల్ డీటెయిల్స్, టెక్నికల్ ఎనాలసిస్ ఆధారంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. నిందితులు ఎంతటివారైనా తాము ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. గుండు కొట్టించడం, కళ్లు పీకేయడం అన్నీ అసత్య ప్రచారాలేనని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2023-09-26T15:20:04+05:30 IST