Harish rao Vs AP Ministers: కేసీఆర్ కుటుంబంపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రవ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-13T15:32:55+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని, తెలంగాణలో పొందాలని, ఆంధ్ర, తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా..

Harish rao Vs AP Ministers: కేసీఆర్ కుటుంబంపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రవ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని, తెలంగాణలో పొందాలని, ఆంధ్ర, తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా.. ఏది బాగుందో చెప్పాలంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల కౌంటర్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు తర్వాత తాజగా మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Seediri Appalaraju) కాస్త ఘాటుగా స్పందించారు. ఏకంగా సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబాన్నే టార్గెట్ చేసి మాట్లాడారు. ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోసి తెలంగాణకు నాయకులయ్యారని మండిపడ్డారు.

‘‘నువ్వేమో మంత్రివి. మీ మామగారు (కేసీఆర్) ముఖ్యమంత్రి. ఆయనకు ఓ కొడుకు ఆయన మంత్రి (కేటీఆర్). తెలంగాణ మీ జాగీరా.. మీరు ప్రాంతీయ ఉగ్రవాదులు. నువ్వు, మీ మామ, మీ మామ కొడుకు, మీ మామ కూతురు (కవిత) మీరందరూ ప్రాంతీయ ఉగ్రవాదులు. పనికిమాలిన మాటలు ఆపి. మీ పని మీరు చూసుకోండి. మా ఆంధ్రవాళ్లు తెలంగాణకు రావడం మానేస్తే అక్కడ ఏమీ ఉండదు. అడుక్కుతినడం తప్ప. వీళ్లు బుర్ర తక్కువ తెలంగాణ వాళ్లు’’ అని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణలో జరిగిన అభివృద్ధితో అనుక్షణం పోలుస్తు తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు రెండు రాష్ట్రాల మధ్య ఆసక్తికర పరిణామాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్‌రావు ఏకంగా ఏపీకి చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. తెలంగాణలో ఏముందని అలా మాట్లాడుతున్నారంటూ ఏపీ మంత్రులు హరీశ్‌రావుపై ధ్వజమెత్తారు. దీనిపై హరీశ్‌రావు కూడా అంతే ఘాటుగా స్పందించారు.

‘‘ఆంధ్ర నేతలారా.. మా జోలికి రావద్దు.. మా గురించి మాట్లాడకపోతేనే మీకు మంచిది’’ అంటూ హెచ్చరించారు. హరీశ్‌ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తప్పుపట్టడం.. అంతే వేగంగా ఆయన సైతం స్పందించడం... తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలంలో హరీశ్‌రావు బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఎగదొబ్బినా.. అక్కడి అధికార పక్షం అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదు.. అని ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-04-13T15:42:31+05:30 IST