Rapaka Varaprasad: దొంగ ఓట్లతో నాకు మెజార్టీ... రాపాక వరప్రసాద్ షాకింగ్ కామెంట్స్..

ABN , First Publish Date - 2023-03-27T17:43:54+05:30 IST

రెండు రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad). మొన్న జరిగిన ఎమ్మెల్సీ

Rapaka Varaprasad: దొంగ ఓట్లతో నాకు మెజార్టీ... రాపాక వరప్రసాద్ షాకింగ్ కామెంట్స్..

అమరావతి: రెండు రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad). మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) ఓట్లు అమ్ముకున్నారు మీకు తెలుసా..! ఈ ఓటు బేరం ముందు నాకే వచ్చింది’’ అని వ్యాఖ్యానించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ఈ రోజు తాను దొంగ ఓట్లతో గెలిచానని తన మీద తానే బాంబ్ పేల్చుకున్నారు. తాను గెలవడానికి దొంగ ఓట్లే కారణమని ఒప్పుకున్నారు. వరప్రసాద్‌కు తన సొంత గ్రామం చింతలమోరిలో అభిమానుల ఆత్మీయ సమావేశంలో రాపాక గుట్టు విప్పారు. అభిమానులు, స్నేహితులను చూసిన రాపాక... తన మనసులోని మాటను బయటకు కక్కారు. అది కూడా సొంతూరిలోనే తనకు దొంగ ఓట్లు వేశారని అసలు గుట్టువిప్పారు. ‘‘చింతలమోరిలో మా ఇంటి దగ్గర బూత్‌లో కాపుల ఓట్లు ఉండవు. అన్నీ ఎస్సీల ఓట్లే ఉంటాయి. ఎవరో ఎవరికీ తెలిదు. సుభాష్‌తో పాటు వీళ్లంతా జట్టుగా వచ్చి ఒక్కక్కరు దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయేవాళ్లు. పదిహేను, ఇరవై మంది వచ్చేవాళ్లు, ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేవాళ్లు. ఏకంగా ఈ ఓట్ల వల్ల 800 ఓట్ల వందల మెజార్టీ వచ్చింది’’ అని రాపాక తన గెలుపు రహస్యాన్ని బట్టబయలు చేశారు.

మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) విజయం సాధించారు. వాస్తవానికి టీడీపీ (TDP) ఎన్నికల్లో పోటీ చేయదనే ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేల సపోర్టు కావాలి. కానీ టీడీపీకున్న ఎమ్మెల్యే సంఖ్య 19 మాత్రమే. అందువల్ల టీడీపీ అభ్యర్థి గెలివడం సాధ్యం కాదని అందరూ బలమైన అభిప్రాయంతోనే ఉన్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మంత్రాంగంతో ఆ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత క్రాస్ ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్పడ్డారని నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సస్సెషన్స్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) ముగిసిన తర్వాత ఎమ్మెల్యే రాపాక, మరో ఎమ్మెల్యే మద్దాల గిరి టీడీపీ అభ్యర్థిని బలపర్చాలని టీడీపీ నేతలు మంతనాలు జరిపారని వెల్లడించారు. ఈ క్రమంలోనే నిన్న రాపాక చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

‘మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అమ్ముకున్నారు మీకు తెలుసా.. ఈ ఓటు బేరం ముందు నాకే వచ్చింది.. నాకంటే ముందు వైసీపీ నేత కేఎస్‌ఎన్‌ రాజుకు వచ్చింది’ అని రాపాక వరప్రసాద్‌ తెలిపారు. జనసేన తరఫున గెలిచి ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న ఆయన అంతర్వేదిలో గత శుక్రవారం రాత్రి వైసీపీ (YCP) నేతలు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలని టీడీపీ ఉండి ఎమ్మెల్యే రామరాజు నుంచి తనకు ఆఫర్‌ వచ్చిందన్నారు. తొలుత కేఎ్‌సఎన్‌ రాజు వద్దకు ఇది వచ్చింది. రాపాక అటువంటి వారు కాదని ఆయనతో నేను మాట్లాడనని రాజు చెప్పారని తెలిపారు. అయితే అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే రామరాజు (MLA Ramaraju) ఈ విషయాన్ని మళ్లీ తన వద్ద ప్రస్తావించారని, టీడీపీలో మంచి భవిష్యత్‌ ఉంటుందని.. ఇతర ఫైనాన్సియల్‌ వ్యవహారాలు మాట్లాడదామని చెప్పారని అన్నారు. అయితే తాను కమిట్మెంట్‌తో జగన్మోహన్‌రెడ్డి వెంట ఉన్నానని తెలిపారు. ‘వైసీపీకి ఓటేశాను. టీడీపీకి ఓటేసిన నలుగురు ఎమ్మెల్యేలు పోయారు కదా! ఒక్కసారి పరువుపోతే సమాజంలో బతకలేం. సిగ్గు, శరం విడిస్తే రూ.10 కోట్లు వచ్చేవి’ అని చెప్పారు. తన వ్యాఖ్యలపై రాపాక ఆదివారం వివరణ ఇస్తూ మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక పోటీ చేశారు. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక అభ్యర్థి రాపాకే. గెలిచిన తర్వాత ఆయన వైసీపీ ప్రభుత్వానికి మద్దుతుగా నిలిచారు. రాపాక వరప్రసాద్ కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి నల్లి వెంకటకృష్ణ మల్లిక్‌పై 5869 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. టికెట్ కోసం ప్రయత్నించగా బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత జనసేనలో చేరారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రాపాక వరప్రసాదరావుకు 50,053 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా ఉన్న బొంతు రాజేశ్వరరావుకు 49,239 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావుకు 44,592 ఓట్లు వచ్చాయి. దీంతో రాపాక వరప్రసాదరావు 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

Updated Date - 2023-03-27T17:53:06+05:30 IST