AP BJP New Chief: ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి..

ABN , First Publish Date - 2023-07-04T15:26:08+05:30 IST

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులయ్యారు. చడీ చప్పుడు కాకుండా ఏపీ అధ్యక్షుడి పదవి నుంచి సోమువీర్రాజును తొలగించిన అధిష్టానం.. కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా సోముకు అధిష్టానం ఆదేశించింది.

AP BJP New Chief: ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి..

అమరావతి: పలు రాష్ట్రాలకు బీజేపీ కొత్త సారధులను పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిల పేర్లను పార్టీ ప్రకటించింది. పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులను మార్చింది. పంజాబ్‌ బీజేపీ చీఫ్‌గా సునీల్ జఖర్, జార్ఖండ్‌కు బాబూలాల్ మరండీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని జేపీ నడ్డా నియమించారు. మరోవైపు.. తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను పార్టీ నియమించింది.

చడీ చప్పుడు కాకుండా ఏపీ అధ్యక్షుడి పదవి నుంచి సోమువీర్రాజును తొలగించిన అధిష్టానం.. కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా సోము వీర్రాజును అధిష్టానం ఆదేశించింది. సోము వీర్రాజును తొలగిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఆయనకే ఫోన్ చేసి చెప్పి షాక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్‌ చేశారు. ‘‘మీ టర్మ్‌ అయిపోయింది.. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయాలి’’ అని సూచించారు. బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతా రామరాజు జయంతి కార్యక్రమాన్ని సోము వీర్రాజు నిర్వహించిన కాసేపటికే ఈ షాకింగ్ న్యూస్ ఆయన వినాల్సి వచ్చింది.

ఏపీలో ఇటీవలి కాలంలో ఆయనపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అదీ చాలదన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటానికి కూడా కారణం సోము వీర్రాజేనన్న టాక్ నడిచింది. ఈ క్రమంలో సోము వీర్రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. లీగల్ సెల్ సమావేశంలో సోము చేసిన కామెంట్లపై పలువురు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీలో ఉంటే గెలవలేమనే రీతిలో సోము వీర్రాజు కామెంట్లు చేశారని ఫిర్యాదు లేఖలో స్పష్టం చేశారు. తానూ వేరే పార్టీకి వెళ్తే గెలిచేవాడినని సోము వీర్రాజు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఉన్న ఫీడ్ బ్యాక్‌తో పాటు ఈ ఫిర్యాదునూ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అధ్యక్షుడి మార్పు ఆవశ్యకమని భావించిన అధిష్టాం సోమువీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించి పురందేశ్వరిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పురంధేశ్వరి అమర్నాథ్ యాత్రలో ఉన్నారు.

Updated Date - 2023-07-04T15:34:38+05:30 IST